రైతులు సమష్టి కృషితో ‘పండు ఈగల’ను తరిమేయొచ్చు

ABN , First Publish Date - 2022-01-26T05:23:36+05:30 IST

పండ్ల తోటలు, కూరగాయల పంటల దిగుబడులను దెబ్బతీస్తున్న పండుఈగ పురుగుల నిర్మూలనకు ఉద్యాన రైతులు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని ములుగులోని కొండాలక్ష్మన్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ సైంటిస్ట్‌ ప్రొఫెసర్‌ ఏ. కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

రైతులు సమష్టి కృషితో ‘పండు ఈగల’ను తరిమేయొచ్చు
సదస్సులో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ కిరణ్‌కుమార్‌

 మల్కాపూర్‌ సదస్సులో హార్టికల్చర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కిరణ్‌కుమార్‌

తూప్రాన్‌రూరల్‌, జనవరి 25: పండ్ల తోటలు, కూరగాయల పంటల దిగుబడులను దెబ్బతీస్తున్న పండుఈగ పురుగుల నిర్మూలనకు ఉద్యాన రైతులు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని ములుగులోని కొండాలక్ష్మన్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ సైంటిస్ట్‌ ప్రొఫెసర్‌ ఏ. కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌లో మంగళవారం పండు ఈగల బెడద నిర్మూలనపై హార్టికల్చర్‌, ఏటీజీసీ బయెటెక్‌ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ మల్కాపూర్‌ కూరగాయలకు మార్కెట్లో బ్రాండ్‌ ఏర్పడాలని, ఇందుకోసం తెలివిగా తెగుళ్లను నివారించుకునే పద్ధతులను పాటించాలని, ఇందుకోసం ఆధునిక పద్ధతిలో తయారుచేసిన విషపు ఎరలను ఉపయోగించాలని సూచించారు. ఏటీజీసీ బయోటెక్‌ సంస్థ డైరెక్టర్‌ విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పండు ఈగల బెడద నివారణకు తమ సంస్థ నానో టెక్నాలజీతో మాత్రల రూపంలో గోళీలను తయారు చేసినట్లు తెలిపారు. పురుగు మందులను వాడకుండానే గోళీలతో  ఈగ పురుగులను పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు. ఇప్పటివరకు విదేశాలకు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, ఇక తెలంగాణలో కూడా తయారుచేసి రైతులకు ఉపయోగంలోకి తేనున్నట్లు చెప్పారు. జిల్లా హార్టికల్చర్‌ అధికారి నర్సయ్య మాట్లాడుతూ జిల్లాలో పండు ఈగ పురుగుల వల్ల ఎక్కువగా తీగ కూరగాయలు. జామ, మామిడి పండ్ల తోటలపై తీవ్ర ప్రభావం చూపుతూ నష్టం కలిగిస్తున్నట్లు చెప్పారు. రైతులు సామూహికంగా నివారణ చర్యలు చేపట్టి నష్టాలను తగ్గించుకోవచ్చని రైతులకు సూచించారు. యాదగిరి అనే రైతుకు చెందిన పందిరి విధానం ద్వారా సాగు చేస్తున్న బీరపంటలో పండు ఈగల బెడద నిర్మూలనకు ఏటీజీసీ సంస్థవారు తయారు చేసిన గోళీలను ఉపయోగించే విధానంపై డెమో నిర్వహించారు. సదస్సులో హార్టికల్చర్‌ అధికారులు రామకృష్ణ, మౌనిక, సంతో్‌ష, ఏవో రాజమల్లు, బయెటెక్‌సంస్థ సైంటిస్ట్‌ శశిధర్‌రెడ్డితో పాటు గ్రామ సర్పంచి మహాదేవి, జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 150మంది రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T05:23:36+05:30 IST