Abn logo
Sep 23 2021 @ 00:44AM

నష్టపరిహారంపై రైతుల ఆందోళన

రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు

రొళ్ల, సెప్టెంబరు 22: రొళ్ల మండలంలోని కొడికొండ వయా శిరాకు వెళ్లే రహదారి నిర్మాణానికి కేటాయించిన తమ భూములకు ఇచ్చే పరిహారం తక్కువగా ఉందని రొళ్ల మండల రైతులు బుధవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం రొళ్ల మండలంలో ఎకరాకు రూ.4.10లక్షలు మాత్రమే చెల్లించారు. అదే పొరుగున ఉన్న అగళి మండలంలో ఎకరాకు రూ.9లక్షల వరకు నష్టపరిహారం ఇచ్చారు. అయితే రొళ్ల మండలంలో మొత్తం భూమి సగటుకు ఒకేధర కేటాయించడంతో రైతులు ఆందోళన దిగారు. వ్యవసాయ నివాస వాణిజ్య విభాగానికి సంబంఽధించి 220 మంది రైతులకుగాను 39.5 ఎకరాల భూమి రోడ్డు నిర్మాణానికి తీసుకొని పనులు చేపట్టారు. అయితే అధిక శాతం మంది చిన్న సన్నకారు రైతులు, అర ఎకరా కంటే తక్కువ భూమి ఉన్నరైతులు అధిక శాతం ఉన్నారు. రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఏ మండలంలోనూ ఇవ్వనంత తక్కువ ధర రొళ్ల మండల రైతులకు ప్రకటించడం అన్యాయం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములకు కూడా ఇతర మండలాల్లో కేటాయించిన విధంగానే భూములకు ధర నిర్ణయించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు ఎస్‌.రవిభూషణ్‌, నరసింహప్ప, నరసమ్మ, నింగమ్మ, అనసూయమ్మ, పార్వతమ్మ, మారన్న, హనుమక్క, నాగరాజు తదితరులు ఉన్నారు.