రాజ్యాంగ దినోత్సవంనాడు రైతుల హక్కుల అణచివేత : పంజాబ్ సీఎం

ABN , First Publish Date - 2020-11-27T00:19:53+05:30 IST

హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తీరును పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్

రాజ్యాంగ దినోత్సవంనాడు రైతుల హక్కుల అణచివేత : పంజాబ్ సీఎం

చండీగఢ్ : హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తీరును పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్రంగా విమర్శించారు. రాజ్యాంగ దినోత్సవంనాడు రైతుల రాజ్యాంగ హక్కులను అణచివేస్తోందని దుయ్యబట్టారు. నూతన వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న రైతులను హర్యానా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. రైతులపై ఉక్కుపాదం మోపడం అప్రజాస్వామికమని స్పష్టం చేశారు. 


కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు ‘చలో ఢిల్లీ’ నినాదంతో దేశ రాజధాని ఢిల్లీ నగరానికి వెళ్తున్నారు. వీరు ఢిల్లీ వెళ్ళకుండా అడ్డుకునేందుకు సరిహద్దులను హర్యానా ప్రభుత్వం మూసివేసింది. కొందరు రైతులు బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో హర్యానా పోలీసులు వాటర్ కెనన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. 


ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం కెప్టెన్ సింగ్ ఓ ట్వీట్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఢిల్లీ వెళ్ళకుండా సీఎం మనోహర్ లాల్ ఖత్తార్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై నిరంకుశంగా ఉక్కుపాదం మోపడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతులు రెండు నెలల నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అటువంటి రైతులపై బలప్రయోగం చేసి, వారిని హర్యానా ప్రభుత్వం ఎందుకు రెచ్చగొడుతోందని అడిగారు. ప్రభుత్వ రహదారిపై శాంతియుతంగా ప్రయాణించే హక్కు రైతులకు లేదా? అని నిలదీశారు. 


Updated Date - 2020-11-27T00:19:53+05:30 IST