Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదని బ్యాంకు ఎదుట రైతుల ధర్నా

లింగంపేట, డిసెంబరు 6 : బ్యాంకులో జమ అయిన ధాన్యం డబ్బులను ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బ్యాంకు ఎదుట రైతులు ఆందోళనకు దిగిన ఘటన లింగంపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లింగంపేట మండలంలోని రైతులు ఇటీవల విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు స్థానిక ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో జమయ్యాయి. అయితే మూడు రోజుల నుంచి రైతులు డబ్బుల కోసం తిరుగుతున్నా.. బ్యాంకులో ఎంతకూ డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు సోమవారం బ్యాంకును మూసివేసి.. ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. డబ్బులు ఇవ్వాలని కోరితే బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు వెళ్లినా.. డబ్బుల్లేవని సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. కాగా.. ఈ విషయమై బ్యాంకు అధికారులను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. బ్యాంకులో 40వేల ఖాతాలు ఉన్నాయన్నారు. మేనేజర్‌తో పాటు 8 మంది సిబ్బంది పని చేయాల్సి ఉండగా.. కేవలం ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉండడంతో డబ్బుల చెల్లింపులో ఆలస్యం అవుతోందన్నారు. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో.. రైతులు ఆందోళన విరమించారు. 

Advertisement
Advertisement