రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు

ABN , First Publish Date - 2021-06-22T05:26:17+05:30 IST

రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు

రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు

  • ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరపాలి
  • ఆధునిక వ్యవసాయం పట్ల రైతులను చైతన్య పరచాలి
  • వ్యవసాయ అధికారులకు జడ్పీచైర్‌పర్సన్‌ ఆదేశం


వికారాబాద్‌: రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా కొనుగోళ్లు జరపాలని జడ్పీచైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీ కార్యాలయంలో వ్యవసాయ, వాటి అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. వానాకాలం సీజన్‌లో రైతులకు ఆధునిక సాగుపై చైతన్య పరుస్తూ పంటల సాగు, మందుల వాడకంపై అవగాహన కల్పించాలన్నారు. సాగుపెట్టుబడికి ఇప్పటికే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. రైతుబంధు అందని రైతులను గుర్తించి వెంటనే అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు కూరగాయల సాగు, చేపల పెంపకం, పశుపోషణ పెంపొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈవో జానకిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్‌, డీఆర్డీవో కృష్ణన్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా కోఆపరేటివ్‌, మార్కెటింగ్‌ అధికారి పాల్గొన్నారు. 

కంది, పెసర సబ్సిడీ విత్తనాలు పంపిణీ

 మండలంలోని చెంచుపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం వ్యవసాయ విస్తరణ అధికారి జి.అనిల్‌కుమార్‌ గ్రామ రైతులకు జాతీయ ఆహార భద్రతా మిషన్‌ పథకం కింద కంది, పెసర విత్తనాలు వందశాతం సబ్సిడీ కింద మినీకిట్స్‌ అందజేసి తగు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో గ్రామ రైతులు రాములు, వెంకటయ్య, యాదయ్య, రజిత ఉన్నారు. 

వ్యవసాయాధికారి పొలంబాట 

బషీరాబాద్‌: మండల వ్యవసాయాధికారి నాగంకృష్ణ సోమవారం పొలంబాట పట్టారు. తొలకరి వర్షాలకు రైతన్నలు మండలంలోని గొట్టిగఖుర్దు శివారులో పంట విత్తుతుండగా క్షేత్రస్థాయి పరిశీలనకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఏవో రైతులకు సాగు విధానంపై పలు సూచనలు చేశారు. ఏ పంటసాగు చేస్తున్నారనే దానిపై ఆరా తీశారు. విత్తనశుద్ధి తర్వాతే సాగు చేపట్టాలని, అప్పుడు పంట దిగుబడులు బాగా వస్తాయని రైతన్నలకు వివరించారు.

పెసర విత్తనాల పంపిణీ 

జాతీయ అహార భద్రతమిషన్‌ కింద సోమవారం ఏవో నాగంకృష్ణ  నేతృత్వంలో ఏఈవోలు పవాన్‌కుమార్‌, రఘువంశీ పెసర విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. కంది సాగులో పెసర పంటను వేసి లాభాలను ఆర్జించాలని రైతులకు సూచించారు.

Updated Date - 2021-06-22T05:26:17+05:30 IST