ఢిల్లీలో రైతుల సుదీర్ఘ ఉద్యమం విరమణ

ABN , First Publish Date - 2021-12-09T20:55:52+05:30 IST

సుదీర్ఘ కాలంపాటు సాగిన రైతుల నిరసనలు ముగిశాయి

ఢిల్లీలో రైతుల సుదీర్ఘ ఉద్యమం విరమణ

న్యూఢిల్లీ : సుదీర్ఘ కాలంపాటు సాగిన రైతుల నిరసనలు ముగిశాయి. రైతులు ప్రభుత్వం ముందు ఉంచిన అన్ని డిమాండ్లకు ఆమోదం లభించడంతో ఈ ఉద్యమాన్ని విరమించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. తాము డిసెంబరు 11 శనివారం తమ నిరసన కార్యక్రమాలను విరమించి, తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటామని రైతు సంఘాలు గురువారం ప్రకటించాయి. గురువారం సాయంత్రం 5.30 గంటలకు విజయోత్సవ ప్రార్థనను నిర్వహించనున్నట్లు తెలిపాయి. శనివారం ఉదయం 9 గంటలకు సింఘు, టిక్రి నిరసన స్థలాల వద్ద విజయోత్సవ కవాతును కూడా నిర్వహించనున్నట్లు తెలిపాయి. ఈ నెల 13న పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించాలని పంజాబ్ రైతులు నిర్ణయించారు.


రైతుల అన్ని డిమాండ్లను నెరవేర్చేందుకు భారత ప్రభుత్వం నుంచి హామీ లభించడంతో నిరసనలను విరమించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై కమిటీ ఏర్పాటు, రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించడంపై ప్రభుత్వం ఓ లేఖను రైతు సంఘాలకు అందజేసింది. 


సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం అనంతరం రైతు నేత గుర్నామ్ సింగ్ చరుని గురువారం మీడియాతో మాట్లాడుతూ, ‘‘మా ఆందోళనను నిలిపివేయాలని నిర్ణయించాం. జనవరి 15న సమీక్షా సమావేశం నిర్వహిస్తాం. ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోకపోతే, మా ఆందోళనను పునరుద్ధరిస్తాం’’ అని చెప్పారు. 


కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతు సంఘాలకు పంపించిన ఈ లేఖలో పేర్కొన్న అంశాలు ఏమిటంటే,  నిరసన కార్యక్రమాల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించేందుకు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయి. అదేవిధంగా ఇటువంటి కేసులను ఉపసంహరించాలని ఇతర రాష్ట్రాలను కూడా కేంద్రం కోరనుంది. నిరసన కార్యక్రమాల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంపై ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. ఎంఎస్‌పీపై కమిటీలో సంయుక్త కిసాన్ మోర్చా సభ్యులకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తుంది. ఎంఎస్‌పీపై ప్రస్తుత విధానం కొనసాగుతుంది. విద్యుత్తు బిల్లుపై సంబంధితులందరితోనూ, సంయుక్త కిసాన్ మోర్చాతోనూ చర్చించిన తర్వాత మాత్రమే పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం అంగీకరించింది.


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించి, ఈ చట్టాలను రద్దు చేసింది. ఈ ఉద్యమం సుమారు 370 రోజులపాటు జరిగింది. 


Updated Date - 2021-12-09T20:55:52+05:30 IST