Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతుల చూపు సన్నాలవైపు

జిల్లాలో సన్నరకాల వరిసాగుకు రైతుల మొగ్గు

వరి సాగుపై ఇప్పటికీ స్పష్టతనివ్వని ప్రభుత్వం

అదునుదాటిపోతున్న యాసంగి కాలం

ఆరుతడి పంటల సాగుకు సరఫరా కాని విత్తనాలు

ఆయోమయంలో అన్నదాతలు

నిజామాబాద్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని రైతులు సన్నరకాల వరిసాగుపై దృష్టి పెడుతున్నారు. వరినారును సిద్ధం చేస్తున్నారు. సన్నరకాలకు డిమాండ్‌ ఉండడంతో మిల్లర్లతో చర్చించి సాగుకు సిద్ధమవుతున్నారు. యాసంగిలో ఆరుతడి పంటలకు గడువు ముగుస్తుండడం, విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు వరిసాగుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రభుత్వం యాసంగి వరిసాగుపై స్పష్టత ఇవ్వలేదు. ఆరుతడి పంటలకు విత్తనాలను సరఫరా చేయలేదు.

       అదునుదాటిపోతున్న యాసంగి..

జిల్లాలో యాసంగి సాగుకు అదునుదాటిపోతోంది. ఆరుతడి పంటలకు అక్టోబరు, నవంబరు నెలలే అనుకూలంగా ఉంటాయి. డిసెంబరు, జనవరి నెలల్లో కొన్ని రకాల పంటలకే కాలం అనుకూలంగా ఉంటుంది. అయితే వరి సాగుకు బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని నెలన్నర నుంచి ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా విత్తనాలు మాత్రం అందుబాటులో ఉంచలేదు. రైతులు తమ వద్ద ఉన్న జొన్న, ఎర్రజొన్న, మొక్కజొన్న, శనగ, మినుము పంటలను వేశారు. వీటితో పాటు కొద్దిమొత్తంలో పొద్దుతిరుగుడు సాగుచేస్తున్నారు. విత్తనాలు అనుకూలంగా లేకపోవడం, సమయం మించిపోతే పంట దిగుబడి రాకపోవడం, ఎండలు పెరిగితే నీటి అవసరం పెరిగి తెగళ్లు కూడా రానుండడంతో ముందస్తుగా ఆరుతడి పంటలను రైతులు వేస్తున్నారు. వేరుశనగ, నువ్వు, సజ్జ పంటలు వేసేందుకు డిసెంబరు, జనవరి వరకు అవకాశం ఉంది. మిగతా పంటలకు అవకాశం లేకపోవడం వల్ల ముందస్తుగానే విత్తనాలు అందుబాటులో ఉన్నంత వరకు ఈ పంటలను జిల్లాలో సాగు చేస్తున్నారు.

      మూడున్నర లక్షలకుపైగా వరిసాగు..

యాసంగిలో ఎక్కువగా మూడున్నర లక్షలకుపైగా వరిసాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం యాసంగిలో వరి వద్దన్నా.. మరో అవకాశం లేకపోవడంతో ఎక్కువ మంది వరి సాగువైపు మొగ్గుచూపుతున్నారు. అయితే దొడ్డు రకాలకన్న.. సన్న రకాలనే ఎక్కువ మంది వినియోగించడం వల్ల ఏటా ధర కూడా పెరుగుతోంది. ఎక్కువ మంది మిల్లర్లు సన్న రకాలను కొనుగోలు చేస్తున్నారు. కొన్ని రకాలను మద్దతు ధరకు మించి రూ.2300 వరకు క్వింటాలుకు ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో బియ్యాన్ని రూ.4500 వరకు క్వింటాలు చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ బియ్యం వినియోగం పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి మిల్లర్‌లు జిల్లాకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. జైశ్రీరాం రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2200 నుంచి రూ.2300 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ యాసంగిలో గంగా కావేరి, జైశ్రీరాం, ఆర్‌ఎన్‌ఆర్‌, తెలంగాణ సోనా, ఇతర సన్న రకాలను సాగు చేస్తున్నారు. దొడ్డు రకాల్లో 1010 వంటి రకాలను వేస్తున్నారు. సన్నాలకు డిమాండ్‌ ఉండడం వల్ల ఎక్కువ మంది ఈ యాసంగిలో నారుమడులను సిద్ధం చేస్తున్నారు.

         బోధన్‌ డివిజన్‌ మొదలైన వరిసాగు..

బోధన్‌ డివిజన్‌ పరిధిలో కొన్నేళ్లుగా సన్నరకాలను సాగుచేస్తూ రాష్ట్రంలోని రైస్‌మిల్లర్స్‌లతో పాటు కర్ణాటక, ఏపీ రైస్‌ మిల్లులకు నేరుగా అమ్మకాలు చేస్తున్నారు. పొలాల వద్దనే ధాన్యాన్ని అమ్ముతున్నారు. డిమాండ్‌ బట్టి రేటు వస్తుండడంతో రెండు సీజన్‌లలో ఈ డివిజన్‌లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈదఫా కూడా ప్రభుత్వం కొనకున్నా మిల్లర్లకు అమ్మవచ్చనే నమ్మకంతో ఎక్కువ మొత్తంలో సన్న రకాలను వేసేందుకు సిద్ధమవుతున్నారు. బియ్యం డిమాండ్‌ ఉండడం వల్ల ఈ సాగును ఎక్కువగా చేస్తున్నారు. దిగుబడి కూడా  దొడ్డుకన్న కొంత తక్కువ వచ్చినా.. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండడం వల్ల ఈ సాగును చేపడుతున్నారు. ప్రభుత్వం ఈ వారంలోపు సన్నరకాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ముందుగానే జిల్లాలోని పలు గ్రామాల పరిధిలో నారుమడులను సిద్ధం చేసుకున్నారు. డిసెంబరు మొదటి వారం నుంచి సన్నరకాలతో పాటు దొడ్డు రకాల నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వరిసాగుపై ఇప్పటి వరకు స్పష్టత లేకున్నా కొద్ది రోజుల్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది సాగుకు మొగ్గారు. అయితే జిల్లాలో సన్నాలు పండించే రైతులకు మంచి ధరలే వస్తున్నాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. కొన్ని రకాల సన్నాలకు భారీగా డిమాండ్‌ ఉందన్నారు. వారు కొనుగోలు కేంద్రాల కన్న వ్యాపారులకే ఎక్కువగా అమ్మకాలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. బయట ఒప్పందాలు చేసుకుంటూ ఈ రకాలను సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement