రైతులంటే.. పరిహాసమా?

ABN , First Publish Date - 2022-04-04T04:35:34+05:30 IST

రైతే రాజు.. ఇది కేవలం మాటలకే పరిమితం. పరిశ్రమలు.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలెనున్నా.. ఆకలైతే అన్నం పెట్టవు. కేవలం డబ్బును మాత్రమే అందిస్తాయి. ఐతే అన్నానికి మూలమైన తిండి గింజలను పండించేది మాత్రం రైతు. ఆ రైతును నేడు దయనీయ స్థితిలో ఉన్నాడు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకీకరించడం దేవుడెరుగు. కనీసం వేసిన పంట అతివృష్టి చేతనో, అనావృష్టి చేతనో చేతికందకపోతే తగు పరిహారం చెల్లించే ప్రభుత్వాలుగానీ, నాయకులుగానీ లేరు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో గత సంవత్సరం ఆగస్టులో సంభవించిన వర్షాలకు వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. ఈ పంటనష్టాన్ని అంచనా వేసిన అధికారులు ఉన్నతాధికారులకు నివేధికలు పంపించారు.

రైతులంటే.. పరిహాసమా?

- వానలకు దెబ్బతిన్న పంటలకు పరిహారమెప్పుడిస్తారు

- అంచనాలకే పరిమితమవుతున్న అధికార యంత్రాంగం

- పెట్టుబడులు కోల్పోయి రైతుల ధైన్యం

- అన్నదాతలను ఆదుకోని పాలకులు

బెజ్జూరు, ఏప్రిల్‌ 3: రైతే రాజు.. ఇది కేవలం మాటలకే పరిమితం. పరిశ్రమలు.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలెనున్నా.. ఆకలైతే అన్నం పెట్టవు. కేవలం డబ్బును మాత్రమే అందిస్తాయి. ఐతే అన్నానికి మూలమైన తిండి గింజలను పండించేది మాత్రం రైతు. ఆ రైతును నేడు దయనీయ స్థితిలో ఉన్నాడు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకీకరించడం దేవుడెరుగు. కనీసం వేసిన పంట అతివృష్టి చేతనో, అనావృష్టి చేతనో చేతికందకపోతే తగు పరిహారం చెల్లించే ప్రభుత్వాలుగానీ, నాయకులుగానీ లేరు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో గత సంవత్సరం ఆగస్టులో సంభవించిన వర్షాలకు వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. ఈ పంటనష్టాన్ని అంచనా వేసిన అధికారులు ఉన్నతాధికారులకు నివేధికలు పంపించారు. ఐతే ఇంతవరకు నష్టపరిహారం అందలేదు. ఇది ఒక గత సంవత్సరం మాత్రమే కాదు. కొన్నేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా నష్టపోయిన రైతులకు కన్నీరే మిగులుతోంది.

జిల్లాలో ఇలా..

జిల్లాలో గత సంవత్సరం ఆగస్టు 22,23,24 తేదీల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారు 43వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కురిసిన భారీ వానల కారణంగా పెద్ద వాగు పరివాహక ప్రాంతాల్లో పత్తిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. మండలాల వారీగా పెంచికల పేటలో 4,359ఎకరాలు, దహెగాంలో 6,900 ఎకరాలు, కాగజ్‌ నగర్‌లో 3,230 ఎకరాలు, వాంకిడిలో 12వేలు, ఆసిఫాబాద్‌లో 715, లింగాపూర్‌లో 300, సిర్పూర్‌(యూ)లో 370, తిర్యాణిలో 1760, రెబ్బెనలో 1000, కౌటాలలో 365,చింతలమానేపల్లిలో 207, కెరమెరిలో 549 ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు వర్షాలకు నష్టాల పాలయ్యాయి. అయితే అప్పట్లో వ్యవసాయ శాఖ అధికారులు పంట పొలాల్లో సర్వేలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. అయినా ఎనిమిది నెలలు కావస్తున్నా పరిహారంపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా పంటలు మునిగిన ప్పుడల్లా సర్వేలు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప పరిహారం మాత్రం ఇవ్వడం లేదని ఆందోళన చెందుతు న్నారు. జిల్లా వ్యాప్తంగా ఏటా వర్షాల కారణంగా పెద్ద వాగు, ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌ కారణంగా పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. 

ఆదుకునేదెన్నడో

వడగండ్లు, వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రతీసారి అధికారులు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపడమే తప్ప ఏ ఒక్కసారి రైతులకు పరిహారం అందించింది లేదు. పంట నష్టంపై గతంలో దహెగాంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా కూడా చేశారు. ఏటా ప్రకృతి వైపరిత్యాల కారణంగా అన్నదాతలు నష్టాలను చవిచూస్తున్నా ప్రభుత్వసాయం మాత్రం అందడం లేదు. కొన్ని దశాబ్దాలుగా భారీవర్షాల కారణంగా ఏటా అన్నదాతలు పంటలు కోల్పోతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని  రైతులు వాపోతున్నారు. వరదలు, విపత్తులు కారణంగా పంటలు కోల్పోయినప్పుడు రైతులకు పరిహారం ఇవ్వాలని గతంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అమలు కాకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి

- బొడ్డు మల్లేష్‌, రైతు, చిన్న ఐనం

వానలు కురవడంతో సాగుచేసిన పంటలు పూర్తిగా నీట మునిగాయి. అప్పు చేసి సాగు చేశాను. పెద్ద వాగు పంటలను పూర్తిగా ముంచేయడంతో అన్ని విదాలుగా నష్టపోయాను. అధికారులు స్పందించి నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలి.

ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం

- రాజులనాయుడు, ఏడీఏ పెంచికలపేట

గత ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా నీటమునిగిన పంటలపై సర్వేలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. పంట పరిహారం మంజూరుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. నష్ట పరి హారం మంజూరైతే రైతులందరికీ అందజేస్తాం. పరిహారం విషయం ప్రభుత్వ దృష్టిలో ఉంది.

Updated Date - 2022-04-04T04:35:34+05:30 IST