మిరప నకిలీ విత్తనాలతో రైతులు లబోదిబో

ABN , First Publish Date - 2021-08-04T05:54:38+05:30 IST

నకిలీ విత్తనాలు మిరప రైతుల వెన్ను విరిచాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన వారిని తీవ్రంగా దెబ్బకొట్టాయి.

మిరప నకిలీ విత్తనాలతో రైతులు లబోదిబో
పన్నూరులో మొలకెత్తని మిరప నారుమడి

గుట్టుచప్పుడు కాకుండా సొమ్ము వెనక్కిచ్చిన వ్యాపారులు

మర్రిపూడి మండలం పన్నూరులో వెలుగు చూసిన ఘటన

మర్రిపూడి, ఆగస్టు 3 : నకిలీ విత్తనాలు మిరప రైతుల వెన్ను విరిచాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన వారిని తీవ్రంగా దెబ్బకొట్టాయి. వేలాది రూపాయలు వెచ్చించి సాగు చేస్తే మొలకెత్తకపోవడంతో పన్నూరు గ్రామంలోని ఏడుగురు రైతులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకెళ్తే... ఏటా పన్నూరులో 200 ఎకరాలలో రైతులు మిర్చి సాగు చేస్తుంటారు. యథావిధిగా ఈ ఏడాది యశస్విని రకం, తేజా విత్తనాలను 10 గ్రాముల ప్యాకెట్‌ రూ.800 వెచ్చించి పొదిలిలో కొనుగోలు చేశారు. ఆరేడుగురు రైతులు 70 నుంచి 80 ప్యాకెట్ల విత్తనాలను మిరప నారు కోసం చల్లారు. విత్తనాలు చల్లిన తరువాత వారం రోజులకు నారు మొలకెత్తాల్సి ఉంది. మొలకెత్తకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే దుకాణాదారునికి ఫిర్యాదు చేశారు. వారు ఒకే నెంబర్‌ బ్యాచ్‌ విత్తనాలు మొలకెత్త లేదని గుర్తించారు. గుట్టుచప్పుడు కాకుండా విత్తనాల కోసం ఒక్కొక్కరు వెచ్చించిన సుమారు రూ.10 వేల నగదును చెల్లిస్తామని చెప్పి కంపెనీ ప్రతినిధులు.. దుకాణ యజమానులు, రైతులను శాంతింపజేశారు. కొంతమంది రైతులకు వాటి తాలూకు నగదు, ఇంకొందరికి ప్రాంసరీ నోట్లు రాసిచ్చినట్లు సమాచారం. ఈ విషయం ఆనోట ఈనోట పడి బయటకు రావడంతో మర్రిపూడి వ్యవసాయ అధికారి సీహెచ్‌ వెంకటేష్‌ హుటాహుటిన గ్రామానికి చేరుకొని మిరప నారుమడులను పరిశీలించారు. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు. గ్రామానికి చెందిన శీలం రోశిరెడ్డి, బూచి సుబ్బారెడ్డి, బూచి చినకాశిరెడ్డి, మేళం కామేశ్వరరావులకు చెందిన తోటలలో విత్తనాలు మొలకెత్తలేదు. మొత్తం మీద నకిలీ విత్తనాలు రైతుల్లో కలకలం రేపాయి.


Updated Date - 2021-08-04T05:54:38+05:30 IST