పట్టాలపై రైతులు

ABN , First Publish Date - 2021-10-19T07:07:35+05:30 IST

రైతులు చేపట్టిన రైల్‌ రోకోతో ఉత్తరాది రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. ‘లఖీంపూర్‌ ఖీరీ’ ఘటనకు ....

పట్టాలపై రైతులు

ఉదయం 10 నుంచి ఆరు గంటల పాటు రైల్‌రోకో

కేంద్రమంత్రి అజయ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌

ఉత్తరాది రాష్ట్రాల్లో స్తంభించిన రైళ్ల రాకపోకలు

గంటల తరబడి నిరీక్షణ.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు 

దేశవ్యాప్తంగా 290 రైళ్ల రాకపోకలకు అంతరాయం!

రైల్వే స్టేషన్ల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు 

అజయ్‌ను తొలగించకపోతే నిరసన తీవ్రం: తికాయత్‌


న్యూఢిల్లీ/చండీగఢ్‌/జైపూర్‌, అక్టోబరు 18: రైతులు చేపట్టిన రైల్‌ రోకోతో ఉత్తరాది రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. ‘లఖీంపూర్‌ ఖీరీ’ ఘటనకు నిరసనగా సోమవారం 6 గంటల పాటు రైల్‌రోకో నిర్వహించాలన్న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపుతో అనేక ప్రాంతాల్లో రైతులు ప ట్టాలపై బైఠాయించారు. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను అరెస్టు చేయాలంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు. పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. పంజాబ్‌, రాజస్థాన్‌, హరియాణా రాష్ట్రాల్లో పలు చోట్ల రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ కార్యకర్తలు రైల్వే ట్రాక్‌లపై ధర్నా చేసి పలు రైళ్లను అడ్డుకున్నారు. మేరఠ్‌, గ్రేటర్‌ నోయిడాలోనూ నిరసనకారులు రైళ్లను నిలిపివేశారు. ‘‘కేంద్ర మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించి, అరెస్టు చేయాలి.


అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది’’ అని ఎస్‌కేఎం తెలిపింది. రైల్‌రోకో వల్ల దేశవ్యాప్తంగా 290 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో 150 గూడ్సు రైళ్లు ఉన్నాయని.. వాటిలో 75 రైళ్లు థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు బొగ్గును సరఫరా చేసేవేనని  అధికారులు తెలిపాయి. 


అజయ్‌ను అరెస్టు చేయాలి: తికాయత్‌

కేంద్ర మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రాను మంత్రివర్గం నుంచి తప్పించాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ డిమాండ్‌ చేశారు. లఖీంపూర్‌ ఖీరీ ఘటనకు బాధ్యుడైన మంత్రిని తక్షణమే పదవి నుంచి తప్పించాలన్నారు. నిష్పాక్షిక దర్యాప్తు జరగాలంటే ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన్ని మంత్రి పదవి నుంచి తప్పించకపోతే తమ నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


యూపీలో పెద్దగా ప్రభావం లేదు: అధికారులు

రైల్‌రోకో ప్రభావం ఉత్తర్‌ప్రదేశ్‌లో పెద్దగా లేదని రైల్వే అధికారులు తెలిపారు. ఎస్‌కేఎం నిర్వహించిన రైల్‌రోకోతో చెప్పుకోదగ్గ ప్రభావమేమీ లేదని చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారని, రైల్వే స్టేషన్ల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కొన్ని స్టేషన్లలో మాత్రం కొద్దిసేపు రైళ్లను అడ్డుకున్నారన్నారు.

Updated Date - 2021-10-19T07:07:35+05:30 IST