నేటి నుంచి రైతులకు రుణమాఫీ

ABN , First Publish Date - 2020-05-11T10:22:25+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయనున్నారు.

నేటి నుంచి రైతులకు రుణమాఫీ

జిల్లాలో 12వేల మందికి రూ. 30 కోట్ల లబ్ధి

త్వరలో రైతులకు అందనున్న పెట్టుబడి సాయం

సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయనున్నారు. 25వేల రూపాయలలోపు రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ కానున్నాయి. సోమవారం నుంచే రుణ మాఫీ చెక్కులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని సమాచారం. రాష్ట్రంలో రైతులు తీసుకున్న 25 వేలలోపు రుణాలన్నిటిని రద్దు చేస్తున్నామని, తాను బతికి ఉన్నంత వరకు రైతు బంధు పథకాన్ని నిలిపివేసేది లేదని గత మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పత్రికా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.


ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్ర బడ్జెట్‌లో కూడా రైతుల రుణ మాఫీ, రైతు బంధు పథకాల కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. రుణ మాఫి కోసం 1200 కోట్ల రూపాయలను, రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం కోసం 7వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు పథకాలతో 62 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. 


రైతుల ఖాతాల్లో చెక్కుల జమ

రైతు రుణమాఫీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల 50 వేల మందికి ప్రయోజనం చేకూరుతుండగా జిల్లాలో 12 వేల మంది రైతులకు ఈ పథకం కింద లబ్దిచేకూరనున్నది. జిల్లాలో గత పంట కాలంలో 93 వేల మంది రైతులు పంట రుణాలను తీసుకోగా వారిలో 12 వేల మంది 25 వేల రూపాయల వరకు రుణం తీసుకున్నారని అధికారుల వర్గాల అంచనా. మరో 75 వేల మంది లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఒకేవిడతలో 25 వేల రూపాయల రుణాలన్నిటిని రద్దు చేస్తున్నది. జిల్లాలోని 12 వేల మంది రైతులకు 30 కోట్ల రూపాయల మేరకు రుణాలు మాఫీ కానున్నాయి.


ఈ రుణమాఫీ చెక్కులను సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమచేస్తారని అధికారవర్గాలు చెబుతున్నాయి. జిల్లావ్యాప్తంగా లక్షా 71వేల మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. వీరిలో లక్షా 52వేల మంది రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం వ్యవసాయశాఖ పరిశీలన జరిపి ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉంచింది. రైతు బంధు పథకం కింద వీరందరికి పెట్టుబడి సాయంగా ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందించనున్నది.  గత సంవత్సరం ఖరీఫ్‌లో జిల్లాలోని 1,58,383 మంది రైతులకు 169 కోట్ల 33 లక్ష 75 వేల 774 రూపాయల పెట్టుబడి సాయం అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఐదెకరాల వరకు భూమిని కలిగి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిందని, మిగతా రైతులకు సహాయం అందించలేదనే విమర్శలు ఉన్నాయి.


10 ఎకరాలకు మించి పైన ఉన్న రైతులకు మాత్రమే గత పంట కాలంలో పెట్టుబడి సాయం విడుదల కాలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ రకమైన విమర్శలు రావడాన్ని విలేకరుల సమావేశంలో ప్రస్తావిస్తూ తాను ఉన్నంత వరకు రైతుబంధు పథకాన్ని కొనసాగిస్తామని, పెట్టుబడి సాయాన్ని నిరంతరం కొనసాగిస్తూ రైతుల ప్రభుత్వంగా నిలిచిపోతామని ప్రకటించారు. దీంతో త్వరలోనే వానకాలం సాగుకు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లోకి వస్తాయని ఆశిస్తున్నారు. వ్యవసాయ పనులను త్వరలో ప్రారంభించుకోవలసి ఉన్నందు వల్ల వెంటనే పెట్టుబడి సాయాన్ని అందించాలని, పంట రుణాలను బ్యాంకు అధికారులు ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా అందరికీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-05-11T10:22:25+05:30 IST