ఢిల్లీ చేరిన రైతు యాత్ర

ABN , First Publish Date - 2020-11-28T07:40:54+05:30 IST

ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో నిరసనలు తెలియజేయడానికి రైతులకు ఢిల్లీ పోలీసులు అనుమతించారు. ఉత్తర ఢిల్లీలోని నిరంకారి మైదానంలో ఆందోళనను శాంతియుతంగా కొనసాగించాలని పోలీసులు కోరారు. రైతు సంఘాల నాయకులు, పోలీసులకు మధ్య జరిగిన చర్చల్లో ఈమేరకు ఏకాభిప్రాయం కుదిరింది

ఢిల్లీ చేరిన రైతు యాత్ర

నిరసనకు పోలీసుల అనుమతి

పోలీసు పహారాలో చేరుకున్న  వేలాది మంది 

రాజధాని సరిహద్దుల్లో రెండో రోజూ ఉద్రిక్తతలు

ఉదయం లాఠీచార్జ్‌, బాష్పవాయు ప్రయోగం

అడ్డుకోవడానికి రోడ్డును అడ్డంగా తవ్విన పోలీసులు

అన్నదాతలది ‘సత్య యుద్ధం’: రాహుల్‌ గాంధీ 

వెంటనే వారిని చర్చలకు పిలవాలి: పంజాబ్‌ సీఏం

రైతుల ఆందోళనకు ఆమ్‌ ఆద్మీ పార్టీ మద్దతు


న్యూఢిల్లీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో నిరసనలు తెలియజేయడానికి రైతులకు ఢిల్లీ పోలీసులు అనుమతించారు. ఉత్తర ఢిల్లీలోని నిరంకారి మైదానంలో ఆందోళనను  శాంతియుతంగా కొనసాగించాలని  పోలీసులు కోరారు. రైతు సంఘాల నాయకులు, పోలీసులకు మధ్య జరిగిన చర్చల్లో ఈమేరకు ఏకాభిప్రాయం కుదిరింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీ, భారతీయ కిసాన్‌ యూనియన్‌తోపాటు మరిన్ని సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది రైతులు గురువారమే ఢిల్లీని చుట్టుముట్టారు. కరోనా నేపథ్యంలో ఢిల్లీలో నిరసనకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు ప్రకటించి... రాజధాని పరిసరాల్లోనే వారిని ఆపేసి లాఠీచార్జి చేశారు. అయినా రైతులు చెదిరిపోకుండా వణుకుపుట్టించే చలిలోనూ రాత్రంతా రోడ్లపైనే ఉన్నారు. శుక్రవారం ఉదయం నుంచి మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఢిల్లీ - హరియాణ సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం పోలీసులు లాఠీచార్జి చేశారు. రైతులపై బాష్పవాయువు ప్రయోగించారు. పలువురు రైతులు గాయపడ్డారు. అయినప్పటికీ బారికేడ్లను దాటుకుంటూ ఢిల్లీలోకి ప్రవేశించడానికి రైతులు ప్రయత్నించారు.


ఒక దశలో వేలాది మంది రైతులను అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులు భావించారు. అరెస్టు చేసిన వారిని తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసి ఉంచాలని యోచించారు. అందుకోసం దేశరాజధానిలోని  9 స్టేడియాలను తాత్కాలిక జైళ్లుగా మార్చడానికి అనుమతించాలని పోలీసులు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. కానీ, ఢిల్లీ ప్రభుత్వం అందుకు అనుమతించలేదు. చివరికి రైతు సంఘాల నేతలతో జరిగిన చర్చల అనంతరం శాంతియుత నిరసనకు అనుమతిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్‌ ఎస్‌.ఎన్‌. శ్రీవాస్తవ ప్రకటించారు. పోలీసు పహారాలో రైతులు రావడానికి అనుమతిస్తామన్నారు. ఢిల్లీ శివారులోని బురారి ప్రాంతంలో ఉన్న నిరంకారి సమగం మైదానంలో శాంతియుత నిరసనలకు అనుమతించారు. ప్రధానంగా ఢిల్లీ పరిసరాల్లోని పంజాబ్‌, హరియాణ, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచి  రైతులు  భారీగా తరలివచ్చారు. 


కరోనా మార్గదర్శకాలు మాకేనా..?

కరోనా మార్గదర్శకాల కారణంగానే నిరసనలకు అనుమతించడం లేదని ఢిల్లీ పోలీసులు చేసిన ప్రకటనపై రైతులు తీవ్రంగా మండిపడ్డారు. కరోనా మార్గదర్శకాలు మాకే వర్తిస్తాయా అని పోలీసులను ప్రశ్నించారు. బిహార్‌తోపాటు మరిన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన  ఎన్నికల సభల్లో వేలాది మంది గుమిగూడారని, మరి అక్కడ కరోనా మార్గదర్శకాలు అమల్లో లేవా అని కేంద్రాన్ని నిలదీశారు. రైతుల నిరసన నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పలు మెట్రో రైలు సర్వీసులను నిలిపివేశారు. రైతులను వెంటనే చర్చలకు పిలవాలని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. కాగా, రైతులది  ‘సత్య యుద్ధం’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు.  రైతుల నిరసనకు ఆమ్‌ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది.


రోడ్లు తొవ్వి కంటైనర్లు అడ్డంపెట్టి

రైతులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. పంజాబ్‌, హరియాణ నుంచి ఢిల్లీకి వచ్చే పలు జాతీయ, రాష్ట్ర రహదారులపై 20-25 మీటర్ల లోతుతో గుంతలు తవ్వారు. బారికేడ్లను కూడా తోసుకుంటూ రావడానికి రైతులు ప్రయత్నించినందున భారీ కంటైనర్లను రోడ్లకు అడ్డంగా పెట్టారు.  

Updated Date - 2020-11-28T07:40:54+05:30 IST