రైతుల రణం.. కేంద్రం అంతర్మథనం

ABN , First Publish Date - 2020-12-01T07:26:36+05:30 IST

ఐదురోజులు గడిచాయి. ఢిల్లీ పొలిమేరల్లో వేలాది రైతుల నిరసన ఆగలేదు. కొత్త వ్యవసాయ చట్ల్టాలను వ్యతిరేకిస్తూ కదం తొక్కిన ఉత్తర భారతావనికి చెందిన రైతులు.. ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకూ, తమ డిమాండ్లకు అంగీకరించేంత వరకూ ఆందోళన విరమించబోయేదే...

రైతుల రణం.. కేంద్రం అంతర్మథనం

  • నిర్ణయాత్మక పోరు ఇది.. వ్యవసాయ చట్టాలు రద్దుచేయాల్సిందే: రైతులు
  • ఢిల్లీ సరిహద్దుల్లోనే వేలమంది బైఠాయింపు
  • జైలును తలపిస్తున్న నిరంకారి మైదానం
  • కీలక మంత్రుల మంతనాలు
  • ప్రతిపక్షాలవి తప్పుడు ప్రచారాలు: ప్రధాని
  • నిరసనల వెనుక ఖలిస్థానీలు: బీజేపీ
  • ఎన్డీయే నుంచి వైదొలగుతాం: ఆర్‌ఎల్పీ

న్యూఢిల్లీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఐదురోజులు గడిచాయి. ఢిల్లీ పొలిమేరల్లో వేలాది రైతుల నిరసన ఆగలేదు.  కొత్త వ్యవసాయ చట్ల్టాలను వ్యతిరేకిస్తూ కదం తొక్కిన ఉత్తర భారతావనికి చెందిన రైతులు.. ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకూ, తమ డిమాండ్లకు అంగీకరించేంత వరకూ ఆందోళన విరమించబోయేదే లేదని  తేల్చిచెప్పారు. ఈసారి నిర్ణయాత్మక పోరుకు సిద్ధమయ్యే రాజధానికొచ్చామని ప్రకటించారు.   డిమాండ్లపై చర్చకు తావులేదని తాజాగా భీష్మించిన అన్నదాతలు- ఒకవేళ వీటికి గనక ఒప్పుకోకుంటే  కేంద్రం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సోమవారంనాడు జరిగిన ఓ సంయుక్త మీడియా  సమావేశంలో రైతు సంఘాల నేత జగ్మోహన్‌ సింగ్‌ హెచ్చరించారు.  దీంతో కేంద్రసర్కార్‌ కాస్త ఇరకాటంలో పడింది. ముగ్గురు కీలక మంత్రులు- అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నరేంద్ర తోమర్‌ బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా నివాసంలో సమావేశమై పరిస్థితిని చర్చించారు. పట్టు వీడని రైతులకు నచ్చచెప్ప డం కష్టమవుతోందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నా యి. ‘పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాలను ఉపసంహరించడం అసాధ్యం. కేంద్రం కూడా అందుకు సుముఖంగా లేదు. సున్ని తమైన రైతుల సమస్యను ఎలా ఎదుర్కొనాలా అని ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది’ అని ఆ వర్గాలు వివరించాయి.


అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీతో పాటు 30 సంఘాల చలో ఢిల్లీ పిలుపు మేరకు వేలాది మంది రైతు లు ఢిల్లీ సరిహద్దుల్లోని సంఘూ, టిక్రి పాయిం ట్ల వద్ద రహదారులపైనే బైఠాయించా రు. అక్కడే వండుకు తింటున్నారు. వణికిస్తున్న చలిలో అక్కడే నిద్రిస్తున్నారు. బురారి గ్రౌండ్స్‌కు (నిరంకారి మైదానం) తరలాలన్న అమిత్‌ షా విజ్ఞప్తిని తిరస్కరించిన రైతు లు జంతర్‌మంతర్‌ లేదా రాంలీలా మైదానంలో నిరసనలకు అనుమతిస్తే నే ఢిల్లీలోకి ప్రవేశిస్తామం టున్నారు.పంజాబ్‌, యూపీ, ఉత్తరాఖండ్‌, హరియాణ, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి రైతులు సోమవారం భారీ గా తరలివచ్చారు. కొందరు సమాచార లోపంతో ఉత్తర ఢిల్లీలోని బురారీ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. జైలును తలపిస్తున్న ఈ మైదానాన్ని వం దలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. మైదానం లోపలికి వెళ్లిన వారిని బయటకు రానివ్వలేదు. దాన్ని ఓపెన్‌ జైలుగా అభివర్ణించిన రైతు సంఘాల నేతలు తమ సహచరులను తక్షణం బయటకు పోనివ్వాలని డిమాండ్‌ చేశారు.

పెరుగుతున్న మద్దతు
నిరసనకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఢిల్లీ వచ్చిన రైతులకు సాయం చేయాలని కార్యకర్తలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. రైతుల డిమాండ్లను 2 రోజుల్లో పరిష్కరించకుంటే క్యాబ్‌లు, టాక్సీలు, ఆటోలు, ట్రక్కులను నిరవధికంగా నడపబోమని ఢిల్లీ టాక్సీ యూనియన్‌ హెచ్చరించింది. రైతులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టాలని సీపీఎం, సీపీఐ, ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, సీపీఐ(ఎంఎల్‌) తమ యూనిట్లను ఆదేశించాయి. పీఆర్సీ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా షహీన్‌బా్‌ఘలో వారాల తరబడి బైఠాయించిన మహిళలు సింఘూ సరిహద్దువద్ద రైతునేతలను కలిసి మద్దతు ప్రకటించారు. 

అమిత్‌ షా కు ఆర్‌ఎల్పీ లేఖ
ఎన్టీఏ మిత్రపక్షమైన రాజస్థాన్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ(ఆర్‌ఎల్పీ) రైతుల నిరసనలకు మద్దతు ప్రకటించింది. ఎన్టీయేలో కొనసాగడంపై పునరాలోచిస్తామని హెచ్చరించింది. రైతు చట్టాలను తక్షణం రద్దు చేసి రైతులతో చర్చ లు జరపాలంటూ ఆ పార్టీ చీఫ్‌, ఎంపీ హనుమాన్‌ బేనివాల్‌ హోం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. మరో మిత్రపక్షమైన జేడీయూ మాత్రం వ్యవసాయ చట్టాలను సమర్థించింది. కొత్త చట్టాలు రైతు బాగుకోసమే అని కేంద్రం నచ్చచెప్పాలని బిహార్‌ సీఎం నితిశ్‌కుమార్‌ సూచించారు.




వాళ్లు కరోనా సూపర్‌ స్పెడర్లు
ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులు కరోనా నిబంధనలు పాటించకపోవడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి ఆ రైతులు వాహకాలు (సూపర్‌ స్పెడర్లు)గా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ధర్నాలో పాల్గొన్న వేలాది మంది రైతులు ట్రాక్టరు, ట్రాలీల్లోనే ఉం టున్నారు. అక్కడే వంట చేస్తున్నారు. మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. పరిశుభ్రతా కొరవడింది. కరోనా నేపథ్యంలో సామూహిక సమావేశాలు, ధర్నాలను అడ్డుకోకుంటే ఢిల్లీతో పాటు దేశానికి ఇబ్బందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు కేకే అగర్వాల్‌ అన్నారు. అయితే, కరోనా కంటే కొత్త వ్యవసాయ చట్టాలతోనే రైతులకు ఎక్కువ హాని అని రైతులు అంటున్నారు.



రైతులకు మద్దతుగా కాంగ్రెస్‌ ప్రచారం
ట్విటర్‌ వేదికగా ప్రారంభించిన రాహుల్‌ 

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు గట్టి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ, సామాజిక మాధ్యమం ద్వారా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సోమవారం ‘‘హ్యాష్‌ట్యాగ్‌ స్పీక్‌ప ఫర్‌ ఫార్మర్స్‌ క్యాంపెయిన్‌’’ పేరుతో ట్విటర్‌ వేదికను ప్రారంభించారు. రైతులకు వ్యతిరేకంగా సాగు చట్టాలను తేవడమే కాకుండా ఇప్పుడు ఆందోళన చేస్తున్న రైతులపై మోదీ ప్రభుత్వం లాఠీలతో విరుచుకుపడుతోందని రాహుల్‌ విమర్శించారు. రైతులు ఒకసారి తమ నిరసన గళాన్ని వినిపిస్తే.. అది దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని హెచ్చరించారు. రైతులకు మద్దతుగా గొంతు వినిపించేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. రైతులు ఇంటిని వదిలి వణికించే చలిలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కదిలివచ్చారని.. దేశానికి అన్నం పెట్టే రైతులకు మద్దతుగా ఉంటారో.. మోదీ మిత్రులైన పెట్టుబడిదారి వర్గానికి మద్దతుగా ఉంటారో నిర్ణయించుకోవాలని మరో ట్వీట్‌లో రాహుల్‌ పేర్కొన్నారు. 



ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: మోదీ ధ్వజం
కొత్త వ్యవసాయ చట్టాలను ప్రధాని మోదీ మరోసారి గట్టిగా సమర్థించుకున్నారు. కొత్త చట్టాలు పాత వ్యవస్థనేమీ మార్చలేదని, ఎంఎస్పీ, మండీల్లో సేకరణ, ప్రభుత్వ కొనుగోలు యథావిధిగా ఉన్నాయని పునరుద్ఘాటించారు. రైతును బలోపేతం చేయడమే, వారికి కొత్త అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా సంస్కరణలు తెచ్చామన్నారు. వారాణసీలో ఓ కార్యక్రమంలో వీడియో లింక్‌ ద్వారా మాట్లాడిన ప్రధాని విపక్షాలపై విరుచుకుపడ్డారు. రాజకీ య లబ్ధి కోసం రైతు చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వదంతులు సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘‘ఇప్పుడు కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. గతంలో ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాయి. ఇప్పుడు నిరాధారమైన సమాచారంతో పుకార్లను సృష్టిస్తున్నాయి. నిర్ణయం సరైనదే అని తెలిసినా మరిన్ని దుష్పరిణామాలకు దారితీస్తాయని తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఏళ్ల తరబడి మోసాలకు అలవాటు పడ్డ పార్టీలు వీటిని ప్రోత్సహిస్తున్నాయి’’ అని పరోక్షంగా కాంగ్రె్‌సను దుయ్యబట్టారు.   వ్యవసాయ మార్కెట్లను రద్దు చేస్తారన్న ప్రచారాన్ని ప్రధాని ఖండించారు. వ్యవసాయ మార్కెట్ల ఆధునికీకర ణకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని, మార్కెట్లను మూసివేసే ప్రశ్నే లేదని చెప్పారు. పంజాబ్‌లో రైతులు వరి ధాన్యాన్ని నిరుటి కంటే ఈ ఏడాది ఎక్కువగానే అమ్మారని, ఎంఎస్పీ కూడా కిందటేడాది కం టే ఎక్కువేనని కేంద్ర సమాచార మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. నిరసనల్లో ఖలిస్థానీ వేర్పాటువాదులు, మావోయిస్టులు ప్రవేశించారని బీజేపీ, హరియాణా సీఎం ఖట్టార్‌ ఆరోపించారు. నిరసనల్లో ముస్లిం కనిపిస్తే అల్‌ఖాయిదా ఉగ్రవాదులనీ, తలపై టర్బన్‌ ఉంటే ఖలిస్తానీ అనడం ఫ్యాషన్‌గా మారిందని రైతు సంఘాల నాయకుడు యోగేంద్ర యాదవ్‌ అన్నారు.

Updated Date - 2020-12-01T07:26:36+05:30 IST