‘పోడు’ పిడికిలి

ABN , First Publish Date - 2021-10-05T06:08:18+05:30 IST

‘పోడు’ పిడికిలి

‘పోడు’ పిడికిలి

భూ  హక్కుల కోసం గిరిజనుల పోరు 

ఏళ్ల తరబడి తప్పని ఎదురుచూపులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 42,292 మంది దరఖాస్తు

2009లో 17,175 మందికి 49,994.7 ఎకరాలకు పత్రాల అందజేత

మరో 75,755,29 ఎకరాలకు 25,117 మంది అర్జీల తిరస్కరణ

రెవెన్యూ, అటవీ శాఖల మధ్య తెగని భూ వివాదాలు

రైతులు, ఫారెస్ట్‌ అధికారుల పరస్పర దాడులతో ఉద్రిక్తత

కొనసాగుతున్న ఆందోళనలు

నేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో ‘సడక్‌ బంద్‌’

భూపాలపల్లి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : పోడు భూముల హక్కుల కోసం గిరిజన రైతుల దశల వారీ పోరు కొనసాగుతోంది. రోజురోజుకూ ఇది పదునెక్కుతోంది. తాజాగా మరో ‘జంగ్‌ సైరన్‌’ మోగింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో పోడు రైతులు ‘సడక్‌ బంద్‌’ చేయనున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం జరగనుంది.  

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అడవులు భారీగా విస్తరించి ఉన్నాయి. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో ప్రస్తుత వరంగల్‌, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో ఐదు రెవెన్యూ డివిజన్లు, 51 మండలాల ఉన్నాయి. మొత్తం ఉమ్మడి వరంగల్‌లో 35 లక్షల మంది జనాభా ఉండగా ఇందులో గిరిజనులు 5.35 లక్షల మంది ఉన్నారు. వీరి కోసం 11 మండలాల్లో ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌  అమలవుతోంది. 15 మండలాల్లో ‘మాడా’ (మ్యాడిఫైడ్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అప్రోచ్‌) కార్యక్రమం అమల్లో ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 177 షెడ్యూల్డ్‌ గ్రామాలు ఉన్నాయి. జిల్లాల విభజన అనంతరం అటవీ ప్రాంతం ఎక్కువ శాతం ములుగు జిల్లాలో కలవగా రెండో స్థానం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఉంది.

హక్కు పత్రాల కోసం 42,292 దరఖాస్తులు

అడవి భూములను గిరిజనులు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఏళ్లతరబడి వీరికి ఇదే బతుకుదెరువు. 2005లో కేంద్ర ప్రభుత్వం ఈ భూములపై సర్వే చేయించింది. హక్కు పత్రాల కోసం దరఖాస్తులను ఆహ్వనించింది. దీంతో 2009లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు జిల్లా నుంచి 12,910 మంది 50,731.72 ఎకరాలకు హక్కు పత్రాల కోసం అర్జీలు పెట్టుకున్నారు. భూపాలపల్లి జిల్లా నుంచి 4,408 మంది 9,640 ఎకరాలకు, వరంగల్‌ రూరల్‌ జిల్లా నుంచి 3,868 మంది 9,520.70 ఎకరాలకు, మహబూబాబాద్‌ జిల్లా నుంచి 21,106 మంది 55,807.52 ఎకరాలకు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలా ఉమ్మడి జిల్లా వరంగల్‌ వ్యాప్తంగా మొత్తం 42,292 మంది 1,25,700 ఎకరాలకు అర్జీలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో 2009లో 17,175 మంది రైతులకు 49,944.71 ఎకరాల పోడు భూములకు అప్పటి ప్రభుత్వం హక్కు పత్రాలు ఇచ్చింది. ఇంకా 25,117 మంది రైతులకు 75,755.29 ఎకరాలకు హక్కు పత్రాలు ఇవ్వకుండా దరఖాస్తులను తిరస్కరించింది. ప్రధానంగా ములుగు జిల్లాలో 7482 మంది, మహబూబాబాద్‌ జిల్లాలో 12,720 మంది, భూపాలపల్లిలో 3,021 మంది, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 1,894 మందితో కలిపి మొత్తం 25,117 మంది  12 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పోడు రైతులందరికీ హక్కు పత్రాలు పంపిణీ చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 2009లో చేసిన సర్వే ప్రకారం కాకుండా 2014 వరకు పోడులో ఉన్న వారందరికీ అందజేస్తామని చెప్పారు.  ఇందుకు  అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి, ప్రధానితో చర్చించి ఒప్పిస్తామని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అలాంటి హామీయే ఇచ్చారు. ములుగులో కుర్చీ వేసుకొని కూర్చొని పోడు సమస్య పరిష్కరిస్తానని రైతులకు మాట ఇచ్చారు. అయితే.. ఈ  సమస్య నేటికీ పరిష్కారం కాకపోవటంతో పోడు రైతు పోరుబాట పడుతున్నారు.

భూవివాదాల పరిష్కారం ఎప్పుడో..?

 అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాలు ఉన్నాయి. రెవెన్యూ భూమి పరిధి ఏదో.. ఫారెస్ట్‌ భూమి ఏదో తెలియక గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. దీంతో 2016లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, అటవీ శాఖ భూములపై నిగ్గు తెల్చేందుకు జాయింట్‌ సర్వే చేయాలని నిర్ణయించారు. కానీ, ఏళ్లు గడుస్తున్నా జాయింట్‌ సర్వే చేయకపోవటంతో రెండు శాఖల మధ్య నెలకొన్న భూవివాదాలు తొలగిపోవటం లేదు. ఇటీవల భూపాలపల్లి జిల్లా పందిపంపుల గ్రామంలో రైతులకు, ఫారెస్టు అధికారుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఫారెస్ట్‌ మహిళా అధికారిపై రైతులు పెట్రోల్‌ పోసి దాడి చేశారని కేసు కూడా నమోదైంది. గ్రామంలోని సర్వే నెంబరు 34లో ఉన్న భూమి ఫారెస్టుకు సంబంధించిందో.. రెవెన్యూకు చెందిందో స్పష్టత లేకపోవటంతో రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య దాడులు జరిగాయి. ములుగు జిల్లా మంగపేట మండలం శనిగకుంట వద్ద పోడు భూముల్లో హరితహారం మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారులు వెళ్లగా పోడు రైతులు అడ్డుకున్నారు. ఇది పరస్పర దాడులకు దారి తీసింది. ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలో నిత్యం జరుగుతున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాలో 26,507 ఎకరాల్లో రెండు శాఖల మధ్య భూవివాదాలు నెలకొన్నాయి. దీంతో గిరిజన రైతులు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని గిరిజన సంఘాలు ఏళ్ల తరబడి చేస్తున్న డిమాండ్‌ అమలుకు నోచుకోవటం లేదు. దీంతో ఉద్రిక్తతలు ఆగడం లేదు.

నేడు ‘సడక్‌ బంద్‌’

పోడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో అఖిలపక్షం మంగళవారం సడక్‌ బంద్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని అన్ని కొత్త జిల్లా కేంద్రాలతో పాటు ప్రధాన రహదారులపై ఆందోళనలు జరగనున్నాయి. ఉదయం 9  నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సడక్‌ బంద్‌ను చేపట్టనున్నారు.  జాతీయ రహదారులను దిగ్బంధించనున్నారు. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి, వెంకటాపూర్‌, మంగపేట, రాజుపేట, పస్రా, ములుగు, చిన్నబోయినపల్లి, భూపాలపల్లి జిల్లాలోని రేగొండ, గాంధీనగర్‌, భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్‌, సిరొంచ హైవే, కొయ్యూర్‌, ఏమనపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలో కంబాలపల్లి, కేసముద్రం, గార్ల, బయ్యారం, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఇటుకాలపల్లిలో సడక్‌బంద్‌ కార్యక్రమం జరగనుంది. సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌, కాంగ్రెస్‌,  సీపీఐ(ఎంఎల్‌), న్యూడెమోక్రసీ, ఆదివాసీ సంఘాలు, కార్మిక, రైతు సంఘాలు పాల్గొననున్నాయి.  ప్రధానంగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌  నేతలు చేస్తున్నారు. వీటితో పాటు మంత్రివర్గ ఉప సంఘం నివేదక పేరుతో తాత్సరం చేయకుండా సీఎం కేసీఆర్‌ తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, 2014 వరకు పోడులో ఉన్న  ప్రతి ఒకరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, ఫారెస్ట్‌ అధికారుల దాడులను అరికట్టాలని,  పోడు భూముల్లో హరితహారం నిలిపివేయాలని కోరుతున్నారు.


Updated Date - 2021-10-05T06:08:18+05:30 IST