రైతుల హక్కులను కాలరాస్తున్నారు: రాహుల్ ఫైర్

ABN , First Publish Date - 2021-10-06T18:01:08+05:30 IST

రైతుల హక్కులను ఊడలాక్కుంటున్నారని, ఒక పద్ధతి ప్రకారం వారిపై దాడులు జరుపుతున్నారని..

రైతుల హక్కులను కాలరాస్తున్నారు: రాహుల్ ఫైర్

న్యూఢిల్లీ: రైతుల హక్కులను ఊడలాక్కుంటున్నారని, ఒక పద్ధతి ప్రకారం వారిపై దాడులు జరుపుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. నలుగురు రైతులతో సహా ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్న లఖింపూర్ హింసాత్మక ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించి, సంఘీభావం తెలిపేందుకు రాహుల్ ప్రతినిధి బృందం బుధవారం ఆ ప్రాంతంలో పర్యటించనుంది. ఢిల్లీ నుంచి లక్నో బయలుదేరే ముందు రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, 144 సెక్షన్ ప్రకారం నలుగురు లేదా ఐదుగురు గుమిగూడరాదని, అందుకు అనుగుణంగానే తమలో ముగ్గురు అక్కడ పర్యటిస్తారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుపిస్తూ, ఒక పద్ధతి ప్రకారం రైతుల హక్కులను దోచుకుంటున్నారని అన్నారు.


''రైతులపై వాహనాలు తోలుతున్నారు. హత్యలు చేస్తున్నారు. లఖింపూర్ ఘటనలో కేంద్ర మంత్రి, ఆయన కుమారుడి పేర్లు బయటకు వచ్చాయి. నిన్ననే ప్రధాని లక్నోలో పర్యటించారు. లఖింపూర్ మాత్రం వెళ్లలేదు. రైతులపై క్రమ పద్ధతిలో జరుగుతున్నా దాడి ఇది'' అని రాహుల్ విమర్శించారు. నిందితులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రతిపక్షాల బాధ్యత అని, ప్రతిపక్షాలు ఆ పని చేయకుంటే హత్రాస్ ఘటనను పట్టించుకునే వారే కాదని అన్నారు. లఖింపూర్‌కు వెళ్తుండగా ప్రియాంక గాంధీని నిర్బంధంలోకి తీసుకోవడంపై అడిగినప్పుడు, ఆ విషయం నిజమేనని, కానీ రైతుల గురించే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. దీనికి ముందు రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేస్తూ, ప్రియాంక గాంధీ నిజమైన కాంగ్రెస్‌వాది అని ప్రశంసించారు. ''భయం ఎరుగని వ్యక్తిని మీరు కస్టడీలో ఉంచారు. ఆమె నిజమైన కాంగ్రెస్‌వాది. ఎప్పటికే అలాగే ఉంటారు'' అని రాహుల్ ట్వీట్ చేశారు.

Updated Date - 2021-10-06T18:01:08+05:30 IST