ఆధునిక వ్యవసాయం వైపు రైతుల అడుగులు

ABN , First Publish Date - 2020-09-30T05:54:39+05:30 IST

కౌటాల మండలం తాట్‌పల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆధునిక వ్యవసాయం వైపు రైతుల అడుగులు

ఆదర్శంగా నిలుస్తున్న తాట్‌పల్లి గ్రామం

అడవి జంతువుల నుంచి పంటల రక్షణకు సోలార్‌ కంచెలు ఏర్పాటు

అధునాతన పరిజ్ఞానంతో అధిక దిగుబడులు 


కౌటాల, సెప్టెంబరు29: కౌటాల మండలం  తాట్‌పల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సాగులో సోలార్‌ కంచె, పవర్‌ వైడర్‌, సోలార్‌ ట్రాప్‌తో పాటు మరిన్ని యంత్రాలను ఉపయోగించి తాట్‌పల్లికి చెందిన 30 మంది రైతులు అధిక దిగుబడులు పొందుతున్నారు. గతంలో అడవి జంతువుల నుంచి పంటలను రక్షించుకోలేక రైతులు ఇబ్బందులకు గురయ్యేవారు. కొంత మంది రైతులు పంటలను కాపాడుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి వేళల్లో పొలాల్లో విద్యుత్‌ వైర్లు బిగించి కరెంటు పెట్టేవారు. దీంతో కొంతమంది విద్యుదాఘాతానికి గురై చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. 


విద్యుదాఘాతం ద్వారా వన్యప్రాణులకు నష్టం వాటిల్లుతుండడంతో అటవీ శాఖాధికారులు విద్యుత్‌ తీగలు బిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వారు. ప్రస్తుతం ఐదు ఎకరాల్లో సోలార్‌ కంచె ఏర్పాటుకు రూ.10 వేలు మాత్రమే ఖర్చవుతుండడంతో చాలా మంది రైతులు ఆ దిశగా  అడుగులు వేస్తున్నారు. ఈ సోలార్‌ కంచె వల్ల వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగదు.  పంటలను మేసేందుకు పశువులు, అడవి పందులు వస్తే వాటికి చిన్న పాటి షాక్‌ తగలడంతో అవి భయపడి పారిపోతాయి. దీంతో పంటలకు రక్షణగా   ఈ సోలార్‌ కంచె నిలబడుతోంది. ఇవేకాక సోలార్‌ట్రాప్‌, పాడి ర్యాపర్‌, పవర్‌ వీడర్‌ వంటి యంత్రాలను తాట్‌పల్లి రైతులు ఉపయోగించి అధిక దిగుబడులు పొందుతున్నారు. దీంతో కౌటాల, బెజ్జూరు, సిర్పూర్‌(టి) మండలాల రైతులు కూడా ఆధునిక వ్యవసాయంపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే చాలా మంది రైతులు ఆధునిక యంత్రాలను కొనుగోలు చేసి అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది.


నూతన యంత్రాలతో సాగు

సోలార్‌ ట్రాప్‌: 

సోలార్‌ ట్రాప్‌ను చేను మధ్యలో ఏర్పాటు చేస్తే అందులో ఉండే విద్యుత్‌ బల్బుకు పురుగులు ఆకర్షితమవుతాయి. సోలార్‌ ట్రాప్‌ తొట్టిలో గల నీటిలో పడి చనిపోతాయి. దీంతో రైతులకు పురుగుల బెడద తప్పుతుంది. దీని ధర రూ.4500 వుంటుంది. 


సాధారణ ట్రాప్‌

పత్తి చేనులో ఎకరం నుంచి రెండు ఎకరాల మధ్యలో ఈ ట్రాప్స్‌ పెట్టడం వల్ల గులాబి రంగు పురుగు అందులో పడి చనిపోతాయి. దీంతో రైతులకు గులాబి పురుగుల బెడద తగ్గుతుంది.  మార్కెట్‌లో ఒక ట్రాప్‌ రూ.100కు  దొరుకుతుంది. దీంతో రైతులు దిగుబడిని పెంచుకుని అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. 


పాడి ర్యాపర్‌ (వరి కోత యంత్రం) 

పాడి ర్యాపర్‌ అనే చిన్న యంత్రం ద్వారా రైతు స్వయంగా కూలీల అవసరం లేకుండా వరి కోత కోయవచ్చు. దీని ధర రూ.1.30 లక్షలు. రెండు ఎకరాల్లో దాదాపు 20మంది కూలీలు వరి కోతకు అవసరమవుతారు. పాడి ర్యాపర్‌ ద్వారా కేవలం నాలుగు గంటల్లో రెండు ఎకరాల్లో వరి పంటను కోయవచ్చు. కూలీల ద్వారా రూ.6వేలు ఖర్చు అయితే. పాడి ర్యాపర్‌ ద్వారా కేవలం రూ.3 వేలు ఖర్చు అవుతుంది. దీంతో రైతులకు ఆర్థిక భారం తగ్గమే కాకుండా సమయం ఆదా అవుతుంది.


పవర్‌ వీడర్‌:

ఈ యంత్రంతో పత్తి సాళ్లలో దౌర కొట్టడం, రొప్పడం, తదితర చిన్న పనులు చేస్తుండడంతో రైతులకు సమయం ఆదా అవుతుంది. ఈయంత్రంతో ఐదు ఎకరాల్లో నాలుగు గంటల్లో దౌర కొట్టవచ్చు. దీని ధర రూ.40 వేలు ఉంటుంది. 


 సోలార్‌ కంచెతో ప్రయోజనం-రోహినె సంతోష్‌, రైతు 

మొదట సోలార్‌ కంచెను మహారాష్ట్రలో చూసి నా చేనులో ఏర్పాటు చేసుకున్నా. ఆ తరువాత నూతన యంత్రాలు కూడా నా దృష్టికి రావడంతో వాటితో   వ్యవసాయం చేపట్టాను. ఇది చూసిన కొంత మంది రైతులు కూడా కావాలంటే మహారాష్ట్ర నుంచి తెప్పించి ఇచ్చా. 


చిన్న యంత్రాలతో రైతులకు లాభం -రాజేష్‌, వ్యవసాయాధికారి, కౌటాల

చిన్న యంత్రాలతో వ్యవసాయం చేయడంతో రైతులకు సమయం ఆదా అవుతుంది. అంతేగాక   50 శాతం ఖర్చులు తగ్గుతుండంతో రైతులు ఆధునిక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. కూలీలు కొరత ఉన్న చోట ఈ యంత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి.  

Updated Date - 2020-09-30T05:54:39+05:30 IST