పత్తి దిగుబడిపై రైతుల దిగులు

ABN , First Publish Date - 2021-10-14T04:10:55+05:30 IST

ఆరుగాలం శ్రమించే రైతన్నకు ఏటేటా కష్టాలు తప్పడం లేదు. ప్రకృతి వైపరిత్యాలకు రైతన్నలు విలవిలలాడుతున్నారు. అతివృష్టి, అనావృష్టితో ఏటా ఏదో ఒక రూపంలో జిల్లా రైతాంగం అతలాకుతలమవుతోంది. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు.

పత్తి దిగుబడిపై రైతుల దిగులు

- అధిక వర్షాలకు తగ్గిన ఎదుగుదల

- 43వేల ఎకరాల్లో పత్తి పంట నష్టం

- నేల వాలిన పత్తి మొక్కలు

- దిక్కుతోచని స్థితిలో రైతులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 13: ఆరుగాలం శ్రమించే రైతన్నకు ఏటేటా కష్టాలు తప్పడం లేదు. ప్రకృతి వైపరిత్యాలకు రైతన్నలు విలవిలలాడుతున్నారు. అతివృష్టి, అనావృష్టితో ఏటా ఏదో ఒక రూపంలో జిల్లా రైతాంగం అతలాకుతలమవుతోంది. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. జిల్లాలో రెండు దఫాలుగా కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారు 43వేల ఎకరాలలో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. వానకాలం సీజన్‌లో సుమారు 4.46లక్షల ఎకరాల్లో రైతులు జిల్లాలో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఇందులో పత్తిపంటదే సింహతిభాగం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో ఆధికంగా వర్షాలు కురియడంతో పత్తి ఎదుగుదల తీవ్రంగా తగ్గింది. అక్టోబరు, నవంబరు మాసాల్లో చేతికి రావాల్సిన పత్తిపంట పూత, కాయలు తక్కువగా ఉండడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.

జిల్లాలో దెబ్బతిన్న పత్తిపంట..

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు 43వేల ఎకరాలలో పంటనష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. కొన్ని మండలాల్లో పంటలు నీట మునగగా నది పరివాహక ప్రాంతాలలోని పంటచేలలో ఇసుక మేటలు వేశాయి. వర్షాలతో పంటచేలలో నీరు నిలువ ఉండడంతో పంటలన్నీ జవుకుపట్టి ఎదుగుదల నిలిచిపోయింది. కలుపు తీయడానికి కూడా వీలు లేకుండా వర్షాలు కురవడంతో ఏపుగా పెరిగిన కలుపుతో పంట ఎదుగుదల తగ్గిందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా రైతులు పత్తిపంట వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది ఆధిక వర్షాల కారణంగా పత్తిపంట సాగు చేస్తున్న రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. 

దిగుబడిపై దిగులు..

జిల్లాలో పత్తి రైతులు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో దిగుబడి రాదని దిగులు చెందుతున్నారు. వర్షాల కారణంగా పంట చేలలో నీరు నిలిచి మొక్కలు తెగుళ్ల బారిన పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో మొక్కలు ఇసుక మేటలో కలిసి పోయాయి. పూత నిలిచి కాత కాసిన మొక్కలు వర్షాలకు దెబ్బతినగా, పూత దశలో ఉన్న మొక్కలు పూర్తిగా తెగుళ్లబారిన పడ్డాయి. 

పంట ఎదుగుదల తగ్గింది..

- చిట్ల నారాయణ, రహపల్లి రైతు

ఈ ఏడాది ఏకదాటిగా కురిసిన వర్షాల కారణంగా రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. మొదట్లో కురిసిన వర్షాలకు విత్తనాలు మొలకెత్తే దశ నుంచి మొక్కలు పెరిగే వరకు భారీ వర్షాలు కురియడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో పత్తిపంట ఎదుగుదల తగ్గింది. నవంబరులో పంట చేతి కందాల్సి ఉండగా వర్షాలతో ప్రస్తుతం పూత, కాయ దశలోనే ఉంది.

Updated Date - 2021-10-14T04:10:55+05:30 IST