సాగు భూములు కనుమరుగు

ABN , First Publish Date - 2022-01-28T04:36:34+05:30 IST

జిల్లాలో అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా వ్యవసాయ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు లేఅవుట్లుగా మార్చేస్తున్నారు. దీంతో పట్టణ శివారులతో పాటు మండల శివారుల్లోనూ వ్యవసాయ భూములు కనుమరుగు అవుతున్నాయి. నాలా కన్వర్షన్‌ లేకుండానే ప్లాట్లుగా మారుస్తూ జోరుగా విక్రయాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా ప్రజలను మోసం చేస్తున్నారు.

సాగు భూములు కనుమరుగు
ఎల్లారెడ్డి మండల కేంద్రంలో వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్‌ లేకుండానే ప్లాట్లుగా మార్చిన దృశ్యాలు

- వ్యవసాయ భూములను ప్లాట్లుగా మారుస్తూ విక్రయాలు

- పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వెంచర్లు

- అనుమతులు లేకుండానే జిల్లాలో విచ్చలవిడిగా వెలుస్తున్న లేఅవుట్‌లు

- నాలా కన్వర్షన్‌ లేకుండానే ప్లాట్లుగా మార్చేస్తున్న రియల్‌ వ్యాపారులు

- కనీస సౌకర్యాలు కల్పించకుండానే ప్లాట్ల విక్రయాలు

- జిల్లాలో వేల ఎకరాల్లో రియల్‌ ఎస్టెట్‌ ప్లాట్లుగా మారుతున్న వైనం

- 50వేల ఎకరాల వరకు వ్యవసాయేతర భూములు

- పన్నులు చెల్లించకుండానే వ్యవసాయేతర భూములుగా మార్పు

- ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వ్యాపారులు

- పట్టించుకోని సంబంధిత శాఖల అధికారులు


కామారెడ్డి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా వ్యవసాయ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు లేఅవుట్లుగా మార్చేస్తున్నారు. దీంతో పట్టణ శివారులతో పాటు మండల శివారుల్లోనూ వ్యవసాయ భూములు కనుమరుగు అవుతున్నాయి. నాలా కన్వర్షన్‌ లేకుండానే ప్లాట్లుగా మారుస్తూ జోరుగా విక్రయాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గాల కేంద్రాల్లో స్థలాలను కొనుగోలు చేయాలని భావిస్తున్న మధ్య తరగతి ప్రజల ఆశను రియల్‌ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కాసులకు కక్కుర్తిపడి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. నిబంధనల ప్రకారం నాలా పన్ను చెల్లించిన తర్వాతనే వ్యవసాయ భూములు లే అవుట్లు చేసి వ్యవసాయేతర భూములుగా మార్చాలి. జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఈ విషయం రెవెన్యూ, పంచాయతీ, పట్టణ ప్రణాళిక అధికారులకు తెలిసినా రియల్‌ వ్యాపారుల మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదు. జిల్లాలో వేల ఎకరాల వరకు నాలా కన్వర్షన్‌ లేకుండానే వ్యవసాయ భూములను రియల్‌ వ్యాపారులు ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకున్నారు. సుమారు 50వేల ఎకరాల వరకు వ్యవసాయేతర భూములను ఎలాంటి పన్ను ప్రభుత్వానికి చెల్లించకుండా ఆయా వ్యాపారాలకు పలువురు వ్యాపారులు ఉపయోగించుకుంటున్నట్లు ఆయా శాఖల రికార్డులు ద్వారా తెలుస్తోంది.

జిల్లాలో వెలుస్తున్న అక్రమ లేఅవుట్లు

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, భిక్కనూరు, సదాశివనగర్‌, మాచారెడ్డి, రామారెడ్డి, గాంధారి, దోమకొండ తదితర మండలాల్లో ప్రధాన రహదారులకు ఇరువైపులా అనుమతులు లేకుండానే అక్రమ లే అవుట్లు వెలుస్తున్నాయి. రెండు సంవత్సరాల కిందట ప్రభుత్వం కొత్త మున్సిపల్‌, పంచాయతీ చట్టాలను తీసుకువచ్చినప్పటికీ రియల్‌ వ్యాపారులు మాత్రం అక్రమ వెంచర్లను చేపడుతూ ప్లాట్లను విక్రయిస్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి పట్టణ శివారుల్లో వెలసిన లేఅవుట్లకు మున్సిపాలిటీ నుంచి కానీ గ్రామ పంచాయతీ నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్నాయని ఆయా శాఖల అధికారులు వాపోతున్నారు. కామారెడ్డి జిల్లాగా ఏర్పడడంతో పట్టణం రోజురోజుకూ విస్తరిస్తుండడం కొత్త కాలనీలు వెలుస్తుండడం, అపార్ట్‌మెంట్‌ల కల్చర్‌ రావడంతో భూముల ధరలకు మరింత రెక్కలు వచ్చాయి. దీనినే అదునుగా చేసుకుంటున్న రియల్‌ వ్యాపారులు చుట్టు పక్కల్లోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసి నాలా కన్వర్షన్‌ చేయకుండానే ప్లాట్లుగా, వెంచర్‌గా మార్చి సౌకర్యాలు కల్పించకుండానే విక్రయాలు చేస్తున్నారు. ఇలా కామారెడ్డి పట్టణంలోనే కాకుండా ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లోనూ రియల్‌ వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 

నాలా కన్వర్షన్‌ లేకుండానే వ్యవసాయేతర భూములుగా మార్చెస్తూ..

జిల్లాలో వ్యవసాయ భూములను నాలా కన్వర్షన్‌ చేయకుండానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఇతర వ్యాపారులు వ్యవసాయేతర భూములుగా మార్చేస్తున్నారు. జిల్లాలో 8,45,621 ఎకరాల్లో భూమి ఉండగా ఇందులో 5,05,155 ఎకరాల్లో వ్యవసాయ భూమి ఉంది. ఈ వ్యవసాయ భూమిలో సుమారు 50వేల ఎకరాల్లో భూమిని నాలా కన్వర్షన్‌ చేయకుండానే ఆయా వ్యాపారులు వ్యవసాయేతర భూములుగా మార్చేస్తూ దర్జాగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తూ నాలా కన్వర్షన్‌ చేయకుండానే ప్లాట్లుగా మార్చి విక్రయాలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు నాలా పన్ను చెల్లించకుండా వేల ఎకరాల వరకు వ్యవసాయేతర భూములను మార్చి విక్రయించారు. దీని వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.6 కోట్ల వరకు గండిపడింది. వినియోగదారులకు చదరపు గజాలలో కాకుండా గుంటలలో రిజిస్ట్రేషన్‌ చేయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి మరింత గండికొడుతున్నారు. ఇలా రైస్‌మిల్లర్లు, కోళ్లఫాం వ్యాపారులు, పెట్రోల్‌ బంక్‌లు, తదితర పరిశ్రమల వారు వ్యవసాయ భూములను దర్జాగా వ్యాపారాల నిమిత్తం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

నాలా పన్ను చెల్లించాల్సింది ఇలా..

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి సంబంధిత భూ యజమానికి రెవెన్యూ డివిజన్‌ అధికారికి నాలా కింద దరఖాస్తు చేసుకోవాలి. ఆర్డీవో సంబంధిత దరఖాస్తులను మండల అధికారులకు పరిమితి నిమిత్తం పంపిస్తారు. మండల, డివిజన్‌, రెవెన్యూ అధికారులు ఈ స్థలాన్ని పరిశీలించి వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు అంగీకరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్‌ విలువ మూడు శాతం, పట్టణ ప్రాంతాల్లో 5 శాతం చొప్పున పన్నును సంబంధిత యజమాని రెవెన్యూ శాఖ ఖాతాల్లో చలానా ద్వారా కట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఆ భూమిని వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చినట్లు సంబంధిత రెవెన్యూ అధికారులు నాలా అనుమతి జారీ చేస్తారు. 

అధికారులకు తెలిసినా పట్టించుకోని పరిస్థితి

జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాలలో ఎలాంటి అనుమతులు లేకుండా నాలా కన్వర్షన్‌ కాకున్నా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా వ్యాపారులు మార్చేస్తున్న విషయం ఆయా శాఖల అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. వేల ఎకరాల్లో వ్యవసాయేతర భూములను ప్లాట్లుగా మార్చి వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి  గండి కొడుతున్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. రియల్‌ వ్యాపారులు పన్ను చెల్లించకుండా ప్లాట్లుగా మారుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా వివిధ సౌకర్యాలు కల్పించకుండా ప్లాట్లు కొనుగోలు చేసే ప్రజలను సైతం మోసగిస్తున్నా అధికారులు వ్యాపారుల మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీ, పట్టణ ప్రణాళిక  శాఖల అధికారులకే అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. కానీ వారు ఈ అక్రమ లేఅవుట్‌లపై కదలకపోవడంతో పలు విమర్శలకు తావిస్తోంది.

Updated Date - 2022-01-28T04:36:34+05:30 IST