ష్రగ్‌... దేనిమీదకైనా ఫిట్‌

ABN , First Publish Date - 2020-11-29T17:05:21+05:30 IST

ఫ్యాషన్‌ అంటేనే కొత్తదనం. దుస్తులు ఇలాగే ధరించాలన్న ఎలాంటి నియమ నిబంధనలు ఫ్యాషన్‌లో కనిపించవు. కంటికి ఇంపుగా, ఒంటికి సౌకర్యంగా ఉంటే...

ష్రగ్‌... దేనిమీదకైనా ఫిట్‌

ఫ్యాషన్‌ అంటేనే కొత్తదనం. దుస్తులు ఇలాగే ధరించాలన్న ఎలాంటి నియమ నిబంధనలు ఫ్యాషన్‌లో కనిపించవు. కంటికి ఇంపుగా, ఒంటికి సౌకర్యంగా ఉంటే చాలు కొత్త ట్రెండ్‌ను ఇట్టే ఫాలో అయిపోతారు నేటితరం. ఇదిగో ఇప్పుడు ష్రగ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ష్రగ్‌ వాడుక ఎప్పటినుంచో  మొదలైనా... దాన్ని చీరలు, జాకెట్లు, స్కర్టులు ఇలా రకరకాల మీదకి వాడడం ఈ మధ్యనే ఎక్కువైంది. కొన్నాళ్ల క్రితం జీన్స్‌ పై వేసుకునే టాప్‌కు అదనపు అందంగా మార్కెట్లో అడుగుపెట్టింది ష్రగ్‌. యువతకు తెగ నచ్చడంతో క్లిక్‌ అయ్యింది. అందులోనూ తక్కువ ధరకే రకరకాల ఫ్యాబ్రిక్‌లలో లభిస్తుండడంతో మరింత ఫేవరేట్‌గా మారింది.


వైట్‌ టాప్‌పై నలుపు ష్రగ్‌ వేస్తే ఆ లుక్కే వేరు.నడుము వరకు ఉండే వాటితో పాటూ షార్ట్‌ ష్రగ్‌, లాంగ్‌ ష్రగ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. డిజైనర్‌ చీరల కోసం ప్రత్యేకంగా ష్రగ్‌లను తయారుచేస్తున్నారు. సాంప్రదాయక దుస్తులపైనా, వెస్ట్రన్‌ వేర్‌ పైనా కూడా ష్రగ్‌ అందంగా సందడి చేస్తోంది. శీతాకాలం కోసం ఊలుతో అల్లిన ష్రగ్‌లు మార్కెట్లో ఉన్నాయి. లాంగ్‌ఫ్రాక్‌, ధోతీ శారీలపై అదనపు ఆకర్షణ కోసం వేసే ష్రగ్‌లు ఆ డ్రెస్‌ అందాన్ని మరింత పెంచుతున్నాయి. కాస్త లావుగా ఉన్న వారికి ష్రగ్‌ నిజంగా ఒక వరమే. పొడవుగా ఉండే ష్రగ్‌ను వేసుకుంటే వారు కొంచెం సన్నగా పొడుగ్గా కనిపిస్తారని ఫ్యాషన్‌ నిపుణులు చెబుతున్నారు. జీన్స్‌, టాప్‌పై ష్రగ్‌ వేసుకున్నా శరీరాకృతి ఎబ్బెట్టుగా కనిపించదు. కొన్ని ముందుకు డోరీలతో పాటూ వస్తున్నాయి. అవి ట్రెండీగా కనిపిస్తుండడంతో కాలేజీ యువతను ఆకట్టుకుంటున్నాయి. ఒక్కోసారి దుపట్టాల స్థానాన్ని కూడా ష్రగ్‌లు ఆక్రమించేసినట్టు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ష్రగ్‌ల హవా మరి కొన్నేళ్లు సాగేట్టుగా ఉంది. 

Updated Date - 2020-11-29T17:05:21+05:30 IST