కరోనా వారియర్స్‌కు పెళ్లి కానుక

ABN , First Publish Date - 2020-08-09T05:19:37+05:30 IST

కరోనా సోకిన వారికి వైద్యసేవలు అందిస్తున్న ఎందరో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మనం జేజేలు పలుకుతున్నాం. ప్రశంసలు కురిపిస్తున్నాం. అయితే ముంబయికి చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌

కరోనా వారియర్స్‌కు పెళ్లి కానుక

కరోనా సోకిన వారికి వైద్యసేవలు అందిస్తున్న ఎందరో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మనం జేజేలు పలుకుతున్నాం. ప్రశంసలు కురిపిస్తున్నాం. అయితే ముంబయికి చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సోనాక్షీ రాజ్‌ మెరానీ వారికి తన వంతుగా జీవితాంతం గుర్తుండే అపురూపమైన పెళ్లికానుకను అందిస్తున్నారు. వివాహం కుదిరిన డాక్టరు లేదా నర్సులకు తాను డిజైన్‌ చేసిన పెళ్లిదుస్తులను ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఆ విశేషాలను తెలుసుకుందాం...


సోనాక్షీ రాజ్‌ బాలీవుడ్‌లో సెలబ్రిటీ ఫ్యాషన్‌ డిజైనర్‌. సోనాక్షీరాజ్‌ లేబుల్‌తో ఆమె అవుట్‌ఫిట్స్‌ వస్తాయి. ముఖ్యంగా ఆమె రూపొందించిన మెహందీ అవుట్‌ఫిట్‌కు ఎంతో క్రేజ్‌ వచ్చింది. సోనాక్షి భర్త నిఖిల్‌ బాగా పేరున్న రెస్టారెంట్‌ నిర్వాహకులు. యురోపియన్‌ స్టైల్‌ కేఫ్‌, సలాడ్‌ బార్‌, ఏషియన్‌ ఈటరీ వంటివెన్నో ముంబయిలోని జుహులో ఆయన కు ఉన్నాయి.


కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు పెళ్లిదుస్తులు బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన మొదట స్పెయిన్‌లో మొదలైంది. ఈ ఆలోచనను మన దేశంలో సెలబ్రిటీ ఫ్యాషన్‌ డిజైనర్‌ సోనాక్షీ రాజ్‌ మిరా అందిపుచ్చుకున్నారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ అయిన నర్సులకు, వైద్యులకు పెళ్లిదుస్తులను బహుమతిగా ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారు. వీరికి తన ‘వారియర్‌ కలెక్షన్‌’ నుంచి కస్టమ్‌-మేడ్‌ లెహంగాలను ఉచితంగా అందజేస్తున్నారు. నర్సులు, వైద్యులకు సోనాక్షీ రాజ్‌ దగ్గర విభిన్నరకాల బ్రైడల్‌ కలెక్షన్లు ఉన్నాయి. ఆమె ఇప్పటిదాకా దేశంలోని తొమ్మిది ‘కొవిడ్‌-19’ ఆసుపత్రులకు ఒక్కో పెళ్లి డ్రెస్‌ను అందజేశారు. ‘‘ఇలాంటి విపత్తు సమయంలో నా వంతుగా ఏదైనా సహాయం అందించాలనుకున్నా. ఈమధ్యనే నాకు వివాహ మైంది. పెళ్లిదుస్తుల విషయంలో ప్రతి ఒక్కరూ ఎంత అపురూపంగా ఫీల్‌ అవుతారో నాకు అర్థమైంది. అందుకే ఎంగేజ్‌మెంట్‌ అయిన కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ప్రత్యేకంగా డిజైనర్‌ దుస్తులను వారి పెళ్లికి అందించాలనుకున్నా’’ అన్నారు సోనాక్షి. చాలామంది బాలీవుడ్‌ తారలు కరోనా వారియర్స్‌కు నగదు సాయం ప్రకటించడం చూసి తాను కాస్త భిన్నమైన ఆలోచనతో ముందుకొచ్చింది. ‘ఐ లవ్‌ ముంబయి ఫౌండేషన్‌’ ద్వారా ఆమె ఈ దుస్తులను అందిస్తున్నారు. ‘వివాహం కుదిరిన వారు తాము ఇచ్చిన కలెక్షన్‌ను బ్రౌస్‌ చేసి నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకోవచ్చ’ని సోనాక్షి తెలిపారు.


ముంబయి మేయర్‌ కిశోరీ పెడ్నేకర్‌, మహారాష్ట్ర పర్యాటకం, పర్యావరణ మంత్రి ఆదిత్య థాక్రేలు సోనాక్షి రాజ్‌ చేస్తున్న ఈ పనికి తమ మద్దతు తెలిపారు. కిశోరీ పెడ్నేకర్‌ పేద కుటుంబం నుంచి వచ్చారు. ఆమె ఫీల్డ్‌లో కోవిడ్‌ రోగులకు చికిత్సను అందిస్తున్నారు. ‘‘నర్సులు వైద్య సేవలు అందించే సమయంలో ఎదుర్కొనే సవాళ్లు ఎలా ఉంటాయో నాకు పూర్తి అవగాహన ఉంది. చాలామంది నర్సులు సామాజిక, ఆర్థిక  బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్లే. వాళ్లు మంచి పెళ్లి దుస్తులు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎవరికైనా జీవితంలో ఒకసారే వివాహ క్షణాలు వస్తాయి. ఆ క్షణాలను ఎంతో మధురంగా గుర్తుంచుకునేలా సోనాక్షి నర్సులకు అపురూపమైన బ్రైడల్‌ కలెక్షన్‌ దుస్తులను బహుమతిగా అందజేయడం అభినందనీయం’ అంటూ మేయర్‌ ప్రశంసించారు. సోనాక్షీ రాజ్‌ నుంచి పెళ్లిదుస్తులు అందుకున్న నర్సులు, డాక్టర్లు వాటిని చూసి మురిసిపోతున్నారు. ఇది నిజంగా కరోనా వారియర్స్‌కు విశేషమైన బహుమతి అని వారి ముఖాలు చూస్తేనే తెలిసిపోతుంది.

Updated Date - 2020-08-09T05:19:37+05:30 IST