కార్పొరేట్ల లబ్ధికే ఫాస్ట్ టాగ్

ABN , First Publish Date - 2021-03-03T06:07:31+05:30 IST

వాహనాలు, పెట్రోలియం ఉత్పత్తులపై వేస్తున్న పన్నులకు అంతూపంతూ లేకుండా పోతోంది. ఇది చాలదనట్టుగా టోల్‌గేట్‌ల వద్ద ఫాస్ట్‌టాగ్‌ లేని...

కార్పొరేట్ల లబ్ధికే ఫాస్ట్ టాగ్

వాహనాలు, పెట్రోలియం ఉత్పత్తులపై వేస్తున్న పన్నులకు అంతూపంతూ లేకుండా పోతోంది. ఇది చాలదనట్టుగా టోల్‌గేట్‌ల వద్ద ఫాస్ట్‌టాగ్‌ లేని వాహనాలకు రెట్టింపు రుసుము వసూలు చేయాలంటూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం లేని ఫాస్ట్‌టాగ్‌ విధానం వెనుక కార్పొరేట్‌ సంస్థలకు మేలుచేసే కుట్ర దాగి వుంది. పైగా ఫాస్ట్‌టాగ్‌ పేరిట అకౌంట్ల ఎయిర్ టెల్‌, జియోలతోపాటు వివిధ ప్రైవేటు బ్యాంక్‌లలో ఓపెన్‌ చేసి వందల రూపాయాలు డిపాజిట్‌ చేయాల్సి వస్తోంది. 2017 సంవత్సరపు లెక్కల ప్రకారం భారత దేశంలో దాదాపు 25 కోట్లకుపైగా వాహనాలు ఉన్నాయి. ఈ వాహన యజమానులు ఒక్కొక్కరు తమ అకౌంట్లో కనీసం 200 రూపాయలు డిపాజిట్‌ చేసినా ఆయా బ్యాంక్‌లు, ఎయిర్‌ టెల్‌ వంటి సంస్థల వద్ద ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేని 5060 కోట్ల రూపాయల ప్రజల డబ్బు నిల్వ ఉండిపోతోంది. కొన్ని సంస్థల డిపాజిట్‌ 500 రూపాయలుగా వసూలు చేసే పక్షంలో ఎంత డబ్బు ఆయా సంస్థలకు ఆయాచితంగా లభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. కార్పొరేట్‌ సంస్థల వేల కోట్ల రూపాయాలు సమకూర్చి పెట్టడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌టాగ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది. ఇంతఖర్చు చేసినా వాహనదారులకు మాత్రం టోల్‌ గేట్‌ల వద్ద వేచి వుండే పరిస్థితి మెరుగు పడలేదు. టోల్‌గేట్‌ నిర్వాహకులు నాసిరకం సెన్సార్‌లు వినియోగించడం వల్ల, తరచూ పనిచేయకపోవడంతో పెద్దఎత్తున వేచివుండాల్సి వస్తోంది. పండుగల సమయంలో అయితే గంటల కొద్ది వాహనాలు వరుసలో నిలిచిపోతున్నాయి. జాతీయ రహదారుల అభివృద్ధికి గాను కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తులపై రోడ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ను విధిస్తోంది. ప్రస్తుతం ప్రజలు ప్రతి లీటర్‌ డీజిల్‌/పెట్రోల్‌ ధరలో 7 రూపాయలను జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నాము. ఈ టాక్స్‌ ద్వారా 2018-19 సంవత్సరంలో 17 వేల కోట్ల రూపాయాలు వసూలు చేసింది. నిబంధనల ప్రకారం ఈ నిధులను రహదారులు అభివృద్ధికి వినియోగించాల్సి వుంది. అయితే ఇందుకు విరుద్ధంగా ఈ నిధులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు! 

అన్నవరపు బ్రహ్మయ్య

Updated Date - 2021-03-03T06:07:31+05:30 IST