నాన్న బాటలో తొలి అడుగు!

ABN , First Publish Date - 2020-06-21T05:30:00+05:30 IST

తండ్రి... ప్రతి కుమారుడికీ తొలి హీరో! వేలు పట్టుకుని తనయుడి చేత బుడి బుడి అడుగులు వేయించేది తండ్రే! వేలాది మందిలో, వివిధ మనస్తత్వాల మధ్య ఎలా నడుచుకోవాలో తనయుడికి చెప్పేదీ తండ్రే! ఒక్క ముక్కలో చెప్పాలంటే... తనయుడి జీవితానికి తొలి దర్శకుడు తండ్రి...

నాన్న బాటలో తొలి అడుగు!

తండ్రి... ప్రతి కుమారుడికీ తొలి హీరో! వేలు పట్టుకుని తనయుడి చేత బుడి బుడి అడుగులు వేయించేది తండ్రే! వేలాది మందిలో, వివిధ మనస్తత్వాల మధ్య ఎలా నడుచుకోవాలో తనయుడికి చెప్పేదీ తండ్రే! ఒక్క ముక్కలో చెప్పాలంటే... తనయుడి జీవితానికి తొలి దర్శకుడు తండ్రి! చిత్ర పరిశ్రమకు వస్తే... కుమారుడి తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన తండ్రులు కొందరున్నారు! వెండితెరపై తనయుల చేత బుడి బుడి అడుగులు వేయించారు!! విజయవంతమైన నట ప్రయాణానికి బలమైన పునాదులు వేశారు!!! ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా తెరపై తనయుల్ని డైరెక్ట్‌ చేసిన తండ్రుల గురించి....


  •                   నేడు ఫాదర్స్‌డే


తండ్రి చెంపదెబ్బ... ఏడుపొచ్చిందబ్బా!

నూనూగు మీసాల ప్రాయంలోనే నటుడిగా నందమూరి బాలకృష్ణ తెరంగేట్రం చేశారు. ఆయన తొలి చిత్రం ‘తాతమ్మ కల’. దానికి దర్శకుడు బాలకృష్ణ తండ్రి ఎన్టీఆరే. ఆ తర్వాత కథానాయకుడిగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘దాన వీర సూర కర్ణ’లో అభియన్యుడు, ‘అక్బర్‌ సలీమ్‌ అనార్కలీ’లో సలీమ్‌, ‘శ్రీ మద్విరాట పర్వం’లో అభిమన్యు, ‘శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం’లో నారద మహర్షి, ‘శ్రీ మద్విరాట్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’లో సిద్దయ్య పాత్రలు తనయుడి చేత వేయించారు ఎన్టీఆర్‌. నటుడిగా కెరీర్‌ తొలినాళ్లలో పౌరాణిక, జానపద, సాంఘిక, ఆద్యాత్మిక పాత్రల్లో నటింపజేసి తనయుణ్ణి ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దారు. ‘‘సినిమాలో నానమ్మ మరణించిన సన్నివేశంలో ఏడ్వాలి. నాన్నగారు ఏడవమని చెప్పారు. ‘నాన్నమ్మ జీవించి ఉంది కదా! బావుంది. ఎందుకు ఏడ్వాలి?’ అని అడిగా. చెంపమీద ఒక్కటి ఇచ్చారు. వెంటనే ఏడుపు వచ్చింది. వెంటనే ‘స్టార్ట్‌... కెమెరా’ అని షాట్‌ తీశారు’’ అని ‘తాతమ్మ కల’ చిత్రీకరణలో జరిగిన ఓ సంగతిని బాలకృష్ణ ఇప్పటికీ చెబుతుంటారు.




తండ్రి దిద్దిన నటుడు!

బాలనటుడిగా మహేశ్‌బాబు తొలి చిత్రానికి ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు దర్శకుడు. అయితే, మహేశ్‌ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం ‘కొడుకు దిద్దిన కాపురం’, చిన్న వయసులో హీరోగా నటించిన ‘బాలచంద్రుడు’ చిత్రాలకు సూపర్‌స్టార్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. బాలనటుడిగా తనయుడి కెరీర్‌ దిద్దినదీ, నటనలో ఓనమాలు దిద్దించినదీ ఆయనే. మహేశ్‌కి చిన్న వయసులో హీరో ఇమేజ్‌ వచ్చిందంటే... అందుకు కారణమూ ఆయనే. ‘ముగ్గురు కొడుకులు’, ‘గూఢచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘అన్నా తమ్ముడు’... ఇలా తండ్రీకొడుకులు కృష్ణ, మహేశ్‌ నటించిన చిత్రాలన్నీ విజయాలు సాధించాయి. ఓ దశలో చదువుకు సినిమాలు, షూటింగులు అడ్డొస్తున్నాయని తనయుడి చేత నటనకు విరామం ఇప్పించారు. కొన్నేళ్ల తర్వాత ‘రాజకుమారుడు’తో మహేశ్‌బాబు కథానాయకుడిగా పరిచయమయ్యారు.




చంద్రశేఖరుడి ‘విజయ’ం

తమిళ స్టార్‌ హీరోల్లో విజయ్‌ ఒకరు. ‘తుపాకీ’తో తెలుగులోనూ విజయం అందుకున్నారు. అప్పుడప్పుడూ విజయ్‌ సినిమాలు అనువాదమై మన ముందుకు వస్తుంటాయి. ఈ హీరో తండ్రి ఎస్‌.ఎ. చంద్రశేఖర్‌ దర్శకుడు. ఆయనే బాలనటుడిగా, కథానాయకుడిగా కుమారుణ్ణి వెండితెరకు పరిచయం చేశారు. తండ్రీకొడుకుల కలయికలో సుమారు పది చిత్రాల వరకూ వచ్చాయి. అందులో నాలుగైదు చిత్రాల్లో విజయ్‌ బాలనటుడిగా చిన్న చిన్న పాత్రలు పోషించారు. ‘నలయ తీర్పు’తో తనయుణ్ణి ఎస్‌.ఎ. చంద్రశేఖర్‌ హీరోగా పరిచయం చేశారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. కుమారుణ్ణి హీరోగా నిలబెట్టడం కోసం వరుసగా మరో మూడు చిత్రాలు చేశారు. ఇతర దర్శకులతో చేసిన చిత్రాలతో విజయ్‌ విజయాలు అందుకున్నారు. అయితే, కుమారుడి విజయాల వెనుక చంద్రశేఖర్‌ కృషి ఎంతో ఉంది.




రోషన్స్‌...హిట్‌ ఫిలిమ్స్‌!

హిందీ చిత్రసీమలో అందగాడు, గ్రీకు వీరుడు హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘కహో నా ప్యార్‌ హై’ (2000). ఆ ఏడాది హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఓ ఊపు ఊపిన ప్రేమకథా చిత్రమది. ఆ చిత్రానికి హృతిక్‌ తండ్రి రాకేశ్‌ రోషన్‌ దర్శకుడు. విజయవంతమైన చిత్రంతో తనయుణ్ణి హీరోగా పరిచయం చేశారు. హిందీలో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హీరో-డైరెక్టర్స్‌ జోడీగా ఈ తండ్రీకొడుకులు నిలిచారు. ‘కహో నా ప్యార్‌ హై’ తర్వాత హృతిక్‌ హీరోగా, రాకేశ్‌ దర్శకుడిగా రోషన్స్‌ ఇద్దరూ కలిసి చేసిన ‘కోయి మిల్‌ గయా’, ‘క్రిష్‌’, ‘క్రిష్‌ 3’ చిత్రాలు భారీ విజయాలు సాధించారు. హృతిక్‌ రోషన్‌ కెరీర్‌లో బిగ్టెస్ట్‌ బాక్సాఫీస్‌ హిట్స్‌ అతడి తండ్రి దర్శకత్వం వహించినవే అంటే అతిశయోక్తి కాదు.




సంజయ్‌ దత్‌... ‘రాకీ’!

తనయుణ్ణి కథానాయకుడిగా పరిచయం చేస్తూ, స్వీయ దర్శకత్వంలో సినిమా తీసిన మరో లెజండరీ పర్సన్‌ సునీల్‌ దత్‌. డ్రగ్స్‌కు బానిసై చెడు దారిలో నడిచిన తనయుడు సంజయ్‌ దత్‌ను దారిలోకి తీసుకురావడమే కాదు... తనయుణ్ణి కథానాయకుడిగా నిలబెట్టిందీ ఆయనే. సంజయ్‌ దత్‌ తొలి చిత్రం ‘రాకీ’కి సునీల్‌ దత్‌ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్‌ దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. అయితే, తర్వాత ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది.


శింబు... సన్నాఫ్‌ రాజేందర్‌

అనువాద చిత్రాలు ‘మన్మథ’, ‘వల్లభ’తో తెలుగులోనూ తమిళ యువ హీరో శింబు విజయాలు అందుకున్నారు. అనువాద చిత్రం ‘ప్రేమ సాగరం’ (1983)తో విజయం అందుకున్న టి. రాజేందర్‌ గుర్తున్నారా? ఆయన శింబు తండ్రి. దర్శకుడిగానూ టి. రాజేందర్‌ పలు చిత్రాలు తీశారు. తండ్రి దర్శకత్వంలోనే శింబు బాలనటుడిగా, కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. హీరోగా శింబు తొలి చిత్రం ‘కాదల్‌ అళివత్తిళ్లై’. అందులో ఛార్మి హీరోయిన్‌. ఆమెకు అదే తొలి తమిళ సినిమా. ఆ సినిమా తర్వాత శింబు వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. ఆగకుండా చిత్రాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ తండ్రి దర్శకత్వంలో మరో చిత్రం చేయలేదు.


తెలుగులో తనయుల్ని తమ దర్శకత్వంలో కథానాయకులుగా పరిచయం చేసిన ప్రముఖ దర్శకులు, నటులు ఉన్నారు. ‘గ్రీకు వీరుడు’తో అబ్బాయి అరుణ్‌ను దాసరి నారాయణరావు హీరోగా పరిచయం చేశారు. ‘గొడవ’తో తనయుడు వైభవ్‌రెడ్డిని హీరోగా పెట్టి కోదండరామిరెడ్డి స్వీయ దర్శకత్వంలో సినిమా నిర్మించారు. ఇటీవల హిందీలో ధర్మేంద్ర తనయుడు సన్నీ డియోల్‌, తన కుమారుణ్ణి హీరోగా పరిచయం చేస్తూ ‘పల్‌ పల్‌ దిల్‌ కే పాస్‌’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ జాబితాలో మరికొందరు తండ్రీకొడుకులు ఉన్నారు. తమ దర్శకత్వంలో తనయుల్ని కథానాయకులుగా పెట్టి చిత్రాలు తీసిన తండ్రులే కాదు... తనయులు హీరోలుగా నటించిన చిత్రాలతో దర్శకులుగా పరిచయమైన తండ్రులు కూడా ఉన్నారు. షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించిన ‘మౌసమ్‌’తో ఆయన తండ్రి, నటుడు పంకజ్‌ కపూర్‌... అజయ్‌ దేవగణ్‌ హీరోగా నటించిన ‘హిందుస్థాన్‌ కి కసమ్‌’తో ఆయన తండ్రి, యాక్షన్‌ డైరెక్టర్‌ వీరూ దేవగణ్‌... ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘తుమ్‌ మేరే హో’తో ఆయన తండ్రి తాహిర్‌ హుస్సేన్‌ దర్శకులుగా పరిచయమయ్యారు.


-సత్య పులగం

Updated Date - 2020-06-21T05:30:00+05:30 IST