క్వారంటైన్‌లో ఒకే ఒక్క మహిళ.. కుమార్తె కోసం నైట్‌వాచ్‌మన్‌గా మారిన తండ్రి!

ABN , First Publish Date - 2020-05-19T02:31:15+05:30 IST

కుమార్తె కోసం ఓ తండ్రి నైట్‌వాచ్‌మన్‌గా మారాడు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా కుడెకెలాలో జరిగిందీ ఘటన.

క్వారంటైన్‌లో ఒకే ఒక్క మహిళ.. కుమార్తె కోసం నైట్‌వాచ్‌మన్‌గా మారిన తండ్రి!

రాయ్‌పూర్: కుమార్తె కోసం ఓ తండ్రి నైట్‌వాచ్‌మన్‌గా మారాడు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా కుడెకెలాలో జరిగిందీ ఘటన. ఇటీవల ఓ మహిళ ఒడిశా నుంచి గ్రామానికి చేరుకుంది. దీంతో ఆమెను ధరమ్‌జైగఢ్ ప్రభుత్వ హైస్కూల్ భవనంలో క్వారంటైన్‌లో ఉంచారు. ధరమ్‌జైగఢ్‌కు ఏనుగుల బెడద ఎక్కువ. తరచూ గ్రామంపై పడి దాడిచేస్తూ ఉంటాయి.


బాధిత మహిళను క్వారంటైన్‌లో ఉంచిన హైస్కూల్‌లో ఆమె ఒక్కే ఒక్క రోగి కావడం గమనార్హం. అంతేకాదు, అక్కడ భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా లేవు. దీంతో మహిళ తండ్రి సుధీర్ ఖల్కో ఆందోళన చెందాడు. కుమార్తెకు రక్షణగా ఉండేందుకు నైట్‌వాచ్‌మన్‌గా మారాడు. రాత్రంతా స్కూలు బయట కూర్చుని కాపలా కాస్తున్నాడు. కాగా, గత వారం రోజుల్లో ఈ ప్రాంతంలో నలుగురు గ్రామస్థులను ఏనుగులు పొట్టనపెట్టుకున్నాయి. 


మహిళ ఉంటున్న క్వారంటైన్ కేంద్రంలో ఆహారం కూడా అందించే ఏర్పాట్లు లేకపోవడంతో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటి నుంచి ఆమె తండ్రి ఖల్కో ఆహారం తెచ్చి అందిస్తున్నాడు. తాను ఈ నెల 11 నుంచి క్వారంటైన్ సెంటర్‌లో ఉంటున్నానని, రాత్రుళ్లు సెక్యూరిటీ గార్డు కూడా లేడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.


ఉదయం ఇద్దరు మహిళా సిబ్బంది వచ్చి కాసేపు ఉండి వెళ్తారని తెలిపింది. దీంతో తన తండ్రే రాత్రివేళ తనకు కాపలాగా ఉంటున్నాడని పేర్కొంది. విషయం వెలుగులోకి రావడంతో ధరమ్‌జైగఢ్ సబ్ డివిజనల్ కలెక్టర్ నంద‌కుమార్ చౌబే స్పందించారు. ఆ క్వారంటైన్ కేంద్రంలో సెక్యూరిటీ సహా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-05-19T02:31:15+05:30 IST