కుమారుడి మృతి తాళలేక ప్రాణాలు వదిలిన తండ్రి

ABN , First Publish Date - 2021-06-04T05:06:24+05:30 IST

కుమారుడు ఆకస్మిక మృతి చెందాడు. ఇది చూసిన అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి మనోవేదనతో ప్రాణాలు వదిలాడు.

కుమారుడి మృతి తాళలేక ప్రాణాలు వదిలిన తండ్రి
కృష్ణమూర్తి మృతదేహం వద్ద విలపిస్తున్న భార్య స్వప్న

ఇసుకతాగేలి గ్రామంలో విషాదం


ఏర్పేడు, జూన్‌ 3: కుమారుడు ఆకస్మిక మృతి చెందాడు. ఇది చూసిన  అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి మనోవేదనతో ప్రాణాలు వదిలాడు.ఈ విషాదకర సంఘటన ఏర్పేడు మండలం ఇసుకతాగేలి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఇసుకతాగేలి గ్రామానికి  చెందిన పుత్తూరు మునిరత్నంరెడ్డికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. మునిరత్నం రెడ్డి అందరికి పెళ్లిళ్లు చేశారు. నలుగురు కుమారుల్లో ఇద్దరు గ్రామంలో ఉన్నారు.  ఒకరు కువైట్‌, మరోకొరు పక్కనే ఉన్న కృష్ణగిరికాలనీలో నివాసం ఉంటున్నారు. కృష్ణగిరి కాలనీలో నివాసం ఉంటున్న అతని రెండవ కుమారుడు పుత్తూరు కృష్ణమూర్తి(30) బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కిందపడి అస్వస్థతకు గురయ్యాడు. అతడిని తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. కృష్ణమూర్తి మృతదేహాన్ని ఇసుక తాగేలిలోని స్వగృహానికి తీసుకు వచ్చారు.  అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న మునిరత్నంరెడ్డి తీవ్ర మానసికక్షోభతో కొద్ది గంటల వ్యవధిలోనే ప్రాణాలు వదిలాడు.  కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి కూడా మృతి చెందడం గ్రామంలో ప్రజలను కలచివేసింది. మృతుడు కృష్ణమూర్తికి భార్య స్వప్న, మూడేళ్ల కమార్తె నవ్యశ్రీ, రెండేళ్ల నాగేంద్ర అనే కుమారుడు ఉన్నారు. చిన్నపిల్లలు తండ్రిని కోల్పోయారు. కృష్ణమూర్తి భార్య స్వప్న, మునిరత్నంరెడ్డి భార్య మునెమ్మ ఇద్దరూ ఒకేసారి తమ  భర్తలను కోల్పోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు బాధాతప్త హృదయాలతో ఇరువురి మృతదేహాలకు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. వారి కుటుంబ సభ్యులను సర్పంచ్‌ కందాటి గురవమ్మ, ఉపసర్పంచ్‌ ఆరాసి వనజాక్షి, వైసీపీ నాయకులు కందాటి ప్రభాకర్‌రెడ్డి, ఆరాసి సుబ్రహ్మణ్యంరెడ్డిలు పరామర్శించి ధైర్యం చెప్పారు.



Updated Date - 2021-06-04T05:06:24+05:30 IST