డాడీకి స్మాల్ బ్రేక్...

ABN , First Publish Date - 2020-06-21T17:45:00+05:30 IST

నాన్న... నిత్యశ్రామికుడు అలుపెరగక సాగే నావికుడు. నాన్నంటే ఓ బాధ్యత నాన్న పక్కనుంటే కొండంత ధైర్యం చిటికెన వేలు పట్టుకుని నడక నేర్పిన తండ్రే... చూపుడు వేలితో ప్రపంచాన్ని చూపిస్తాడు. పెంపకంలో కాస్త కాఠిన్యాన్ని చూపించినా... ఆయన మనసు మాత్రం మంచుకొండ....

డాడీకి స్మాల్ బ్రేక్...

నాన్న... నిత్యశ్రామికుడు అలుపెరగక సాగే నావికుడు. నాన్నంటే ఓ బాధ్యత నాన్న పక్కనుంటే కొండంత ధైర్యం చిటికెన వేలు పట్టుకుని నడక నేర్పిన తండ్రే... చూపుడు వేలితో ప్రపంచాన్ని చూపిస్తాడు. పెంపకంలో కాస్త కాఠిన్యాన్ని చూపించినా... ఆయన మనసు మాత్రం మంచుకొండ. ‘నాన్నా’ అని బిడ్డ పిలిస్తే చాలు, ఆ కొండ కరిగి.. ప్రేమ ఏరులై పారుతుంది. తల్లి జన్మనిస్తే... ఆ బిడ్డకు తన జీవితాన్నే అర్పిస్తాడు తండ్రి. అందుకే పిల్లలకు నాన్నే మొదటిహీరో. మన టాలీవుడ్‌హీరోల్లో కూడా ఎంతోమంది డాడీలు అయిపోయారు. నిత్యం సినిమా షూటింగులతో బిజీగా ఉండే స్టార్‌ హీరోలు కరోనా వల్ల వచ్చి పడిన లాక్‌డౌన్‌లో పిల్లలతో ఎంజాయ్‌ చేస్తున్నారు. తమ పిల్లల ముద్దు మాటలకు, అల్లరి చేష్టలకు మురిసిపోతున్నారు. ఇదివరకు సినిమానే హీరోల ప్రపంచం.. ఇప్పుడు పిల్లలే ప్రపంచం. ప్రతిఫ్రేమ్‌లోనూ బోలెడన్ని జ్ఞాపకాలు.. అనుభూతులు. నేడు ఫాదర్స్‌డే సందర్భంగా డాడీల స్మాల్‌బ్రేక్‌ విశేషాలు తెలుసుకుందాం.. 




గౌతమ్‌, సితార అండ్‌ ప్రిన్స్‌ 

అభిమానులకి మహేష్‌బాబు పెద్ద హీరో కావచ్చు... ఇంట్లో గౌతమ్‌, సితారలకు మాత్రం తమను ఎంతో ప్రేమించే నాన్న. లాక్‌డౌన్‌లో పూర్తిగా పిల్లలతోనే గడిపాడు ప్రిన్స్‌. అందులోనూ సితారతోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్టు ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా అర్థమవుతోంది. షూటింగ్స్‌ సమయంలో మహేష్‌కు పిల్లలతో ఆడుకునేందుకు అనుకున్నంత సమయం దొరకదు. అందుకే కరోనా హాలీడేస్‌ను పూర్తిగా పిల్లలకే కేటాయించాడని నమ్రత కూడా క్లారిటీ ఇచ్చేసింది. పిల్లలతో కలిసే కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు కూడా చూస్తున్నాడని తెలిపింది. సితార అయితే తండ్రిని ఒక్కనిమిషం కూడా వదలడం లేదట. ఈ తండ్రీకూతుళ్లవి చాలా ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్‌బాబు ఇన్‌స్టాగ్రామ్‌ నిండా ఈ ఫోటోలే  కనిపిస్తున్నాయి. సితారే తన ‘స్ట్రెస్‌ బస్టర్‌’ అని చెబుతున్నాడు మహేష్‌. ఆమె కబుర్లు చెబుతుంటే మైమరచి వింటున్న ప్రిన్స్‌ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి.  వీరి ముచ్చట  చూస్తుంటే  తండ్రులకు తమ బంగారు కూతుళ్లు గుర్తుకువస్తారు. 



కొడుకులే జూనియర్‌ లోకం...

వెండితెరపై నటవిశ్వరూపం చూపే జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంట్లో తన పిల్లల ముందు మాత్రం మరో పిల్లాడైపోతాడు. తనకు పిల్లలే ప్రపంచమని తెలిసినవాళ్లందరితోనూ చెబుతాడు. షూటింగులు లేని సమయంలో భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు భార్గవ్‌ రామ్‌, అభయ్‌ రామ్‌లతో చాలా సమయం గడుపుతాడు. షూటింగ్‌ల బిజీ వల్ల పిల్లలకు కాస్త దూరమవుతున్నట్టు అనిపిస్తే చాలు పిల్లల్ని షూటింగ్‌ స్పాట్‌కి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తాడు. తన ప్రపంచం చాలా చిన్నది. ఆ ప్రపంచంలో పిల్లలు, సినిమాలే ఉంటాయి. తన తండ్రి ఏంచేస్తాడో పిల్లలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కనుకే జూనియర్‌ ఇలా చేస్తాడని సన్నిహితులు కూడా చెబుతుంటారు. ఎన్టీయార్‌ పిల్లలిద్దరూ చూడచక్కని చందమామల్లా ఉంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటిస్తూ తీరికలేని ఎన్టీయార్‌కు లాక్‌డౌన్‌ వల్ల కాస్త సమయం దొరికింది. ఇద్దరు పిల్లలే లోకంగా వారితో ఆడుతూ పాడుతూ రోజులు గడిపేస్తున్నాడు జూనియర్‌. ఇద్దరు పిల్లల్లో సినిమా వారసత్వాన్ని ఎవరు అందుకుంటారో, తండ్రికి తగ్గ తనయుడిగా ఎవరు పేరు తెచ్చుకుంటారో చూడాలి. 



అర్హతో అర్జున్‌ ఆటపాట

అల్లు అర్జున్‌ను ‘కంప్లీట్‌ ఫ్యామిలీ మ్యాన్‌’ అని చెప్పుకోవచ్చు. సినిమా షూటింగులు ఎన్ని ఉన్నా...తాను ఎంత బిజీ అయినా అయాన్‌, అర్హలతో ఎంతో కొంత సమయం గడిపేలాగానే షెడ్యూల్‌ చేసుకుంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఎప్పటికప్పుడు వారితో ఆడిన అల్లరి ఆటలు, చిలిపి కబుర్లను పోస్టు చేస్తునే ఉంటాడు. వాటిని చూస్తే అర్జున్‌కు పిల్లలంటే ఎంత ప్రేమో అర్థమైపోతుంది. అసలే నాలుగు నెలల నుంచి లాక్‌డౌన్‌ సెలవులు వచ్చాయి సినిమా వాళ్లకి. అర్జున్‌ ఆ సమయంలో పిల్లలతో బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. కూతురు అర్హ ముద్దు ముద్దు మాటలకు మురిసిపోవడంతో పాటూ ఆ వీడియోలను అభిమానుల ముందుంచుతాడు. నాన్న చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని అర్హచేత అనిపించేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు అల్లు అర్జున్‌. తాజాగా 374వ సారి అర్హను ఒప్పించేందుకు ప్రయత్నించి ఓడిపోయినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోపెట్టాడు బన్నీ. అయాన్‌ ఆరో పుట్టినరోజు లాక్‌డౌన్‌ సమయంలోనే జరిగింది. ఈ సందర్భంగా ‘ప్రేమంటే ఏమిటో తన కొడుకు వల్లే తెలిసింది’ అని ఎమోషనల్‌గా ట్వీట్‌ చేశాడు బన్నీ. ఈ తండ్రీపిల్లలు ఫోటోషూట్‌లు కూడా బాగా ఇష్టపడతారు. 



విష్ణు వంటకు ఫిదా

కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను కలవకుండా చేసింది. లాక్‌డౌన్‌ వల్ల తల్లితండ్రులు ఒకచోట... పిల్లలు మరోచోట ఉండిపోయారు. లాక్‌డౌన్‌కు ముందు మంచు విష్ణు భార్యాపిల్లలు సింగపూర్‌ వెళ్లారు. లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో వారక్కడే ఉండిపోయారు. విష్ణు మాత్రం హైదరాబాద్‌లో ఉన్నారు. నలుగురు పిల్లల ముద్దుల తండ్రి... వందరోజులు కుటుంబానికి దూరమై చాలా బాధపడ్డాడు. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా వందరోజుల తరువాత విరానికా పిల్లలతో సహా హైదరాబాద్‌ చేరుకున్నారు. విష్ణు ఆనందానికి అవధుల్లేవు. లాక్‌డౌన్‌ 1.0 సమయంలోనే తన భార్యాపిల్లలను తలచుకుని విష్ణు భావోద్వేగానికి గురయ్యాడు. ‘భార్యా పిల్లలను చాలా మిస్సవుతున్నా. గత ఏడేళ్లుగా ఎక్కడికి వెళ్లినా సాయంత్రం కల్లా ఇంటికి చేరుకునేవాణ్ని. పిల్లలతో నాకు అటాచ్‌మెంట్‌ చాలా ఎక్కువ’ అంటూ కళ్లల్లో నీళ్లుతిరుగుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. పిల్లల కోసం కుకీస్‌ వంటివి స్వయంగా వండిపెడతాడు విష్ణు. తరచూ విహారయాత్రలకు తీసుకెళుతుంటాడు.



గోపీచంద్‌కు పిల్లలే ‘ఆక్సిజన్‌’

ఆక్సిజన్‌ హీరో గోపీచంద్‌ ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారని అందరికీ తెలిసిందే. ఇద్దరు ముద్దుల కొడుకులు ఆయనకి. వియాన్‌, విరాట్‌ కృష్ణ వారి పేర్లు. లాక్‌డౌన్‌ ముందు మార్చిలో జరిగిన హోలీలో వారితో ఆడిన ఫోటోను సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. ఆ ఫోటో చూసిన వాళ్లంతా చూడచక్కని కుటుంబం అని మెచ్చుకున్నారు. ఇక లాక్‌డౌన్‌లో ఇల్లే ప్రపంచం, పిల్లలే లోకం అయిపోయింది గోపీచంద్‌కు. ఇద్దరు కొడుకులను ఆడిస్తూ సమయాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే పెద్దగా కుటుంబ విషయాలు, ఫోటోలు సోషల్‌మీడియాతో పంచుకోడు గోపీచంద్‌. అన్నట్టు లాక్‌డౌన్‌ వేళ సామాజిక సేవలో కూడా ముందున్నాడు గోపీ. వెయ్యి కుటుంబాలకు తన వంతు సాయంతో నెలకు సరిపడా సరుకులను పంచి పెట్టాడు.



మాస్‌ మహారాజా మస్తీ

మొన్నటి వరకు రవితేజ రూటే సెపరేటు. ఫ్యామిలీ ఫోటోలు, వివరాలు బయటపెట్టేవాడే కాదు. తాను కూడా సోషల్‌ మీడియాలో ఖాతా తెరిచాక... రూటు మారిపోయింది. స్వయంగా తన పిల్లలతో ఫోటోలు దిగుతూ వారిని అభిమానులకు పరిచయం చేశాడు. లాక్‌డౌన్‌లో పూర్తిగా వారితోనే ఉంటున్నాడు. రవితేజ కొడుకు మహాధన్‌ ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో చిన్నప్పటి హీరో పాత్ర చేశాడు. అలా చాలా మందికి పరిచయం అయ్యాడు. ఇక కూతురు మోక్షదను మాత్రం రవితేజే ఫోటో ద్వారా పరిచయం చేశాడు. తన ఇద్దరు పిల్లలను గట్టిగా హత్తుకుని దిగిన ఆ ఫోటోకు ‘స్టే హోమ్‌... స్టే సేఫ్‌’ అని క్యాప్షన్‌ పెట్టాడు. అంతకుముందు త్రీ జనరేషన్స్‌ పేరుతో తన తండ్రి, తాను, కొడుకు కలిపి తీసుకున్న ఫోటోను పోస్టు చేశాడు.   కొడుకు మహాధన్‌కు తన సినిమా వారసత్వాన్ని అందించాలన్న ఆలోచన ఉన్నట్టు కనిపిస్తోంది. లాక్‌డౌన్‌లో పిల్లల కబుర్లతో, వారితో ఫోటోలు తీసుకుంటూ బిజీగా గడిపేస్తున్నాడు రవితేజ. ఎప్పుడూ ఓపెన్‌మైండ్‌తో ఉండే రవితేజ.. పిల్లల్లో  పిల్లాడైపోతాడు.   



బుజ్జిగాడితో ప్రకాష్‌రాజ్‌

ఈ భాష... ఆ భాష అని తేడాలేకుండా అన్ని భాషల్లో నటించే వ్యక్తి ప్రకాష్‌ రాజ్‌.  సినిమాలో విలన్‌ పాత్రలు పోషించినా నిజజీవితంలో మాత్రం ఇతరులకు సాయం చేస్తూ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో తన కొడుకు నాలుగేళ్ల వేదాంత్‌, భార్య పోనీ వర్మతో కలిసి షాద్‌నగర్‌ దగ్గర్లో ఉన్న ఫామ్‌హౌస్‌లో ఉంటున్నాడు. ఆ ఫామ్‌హౌస్‌లో మామిడితో పాటూ అనేక రకాల పంటలు పండుతాయి. వేదాంత్‌తో కలిసి తోటపనులు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ట్రాక్టర్‌పై కొడుకును కూర్చోబెట్టుకుని.. ఫామ్‌హౌస్‌ అంతా తిప్పుతున్నాడు. కొడుకు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి అభిమానులను అలరిస్తున్నాడు. అంతేకాదు తోటలో పనిచేసే కూలీల పిల్లలతో కలిసి కొడుకునే ఆడేలా ప్రోత్సహిస్తున్నాడు. మామిడికాయల పోగు ముందు వేదాంత్‌ కూర్చున్న ఫోటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు ప్రకాష్‌ రాజ్‌. ఆ ఫోటో వైరల్‌ అయ్యింది. మొత్తమ్మీద లాక్‌డౌనంతా పచ్చటి ప్రాంతంలో కొడుకుతో ఆనందంగా గడుపు తున్నాడు మన టాప్‌ విలన్‌. ప్రకాష్‌ రాజ్‌ కు వేదాంత్‌ కాకుండా మరో ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు మొదటిభార్యతో ఉంటారు. 



చిలుకపలుకుల చిన్నోడితో నాని..

నాచురాల్‌ స్టార్‌ నాని అంటే ఎవరికి నచ్చదు? తెరపై చూస్తుంటే మన పక్కింటిపిల్లాడిలా అనిపిస్తాడు. గుండెకు హత్తుకునేలా డైలాగులు చెబుతాడు. నాని కొడుకు పుట్టినప్పటి నుంచి చాలా బిజీ అయిపోయాడు. అంతకుముందు సినిమాలే ప్రపంచం. ఇప్పుడు కొడుకు జున్నుగాడే అన్నీ. జున్ను అసలు పేరు అర్జున్‌. మూడేళ్ల అర్జున్‌ చిలుకపలుకులతో లాక్‌డౌన్‌ కాలమంతా సంతోషంగా గడిపేశాడు నాని. ఈ మధ్యనే కొడుకుతోనే ‘స్టే హోమ్‌ స్టే సేఫ్‌’ అంటూ చెప్పించి ఒక వీడియో కూడా సోషల్‌ మీడియాలో విడుదల చేశాడు. జున్నుగాడి ముద్దుముద్దు మాటలు నాని అభిమానులను బాగా అలరించాయి. మరొక వీడియోలో ‘ఊరికే అలా... జున్నుగాడితో’ అంటూ ఓ వీడియో పోస్టు చేశాడు. అందులో వచ్చీరాని మాటలతో నాని కొడుకు అందరికీ భలే ముద్దొచ్చేశాడు. వరుస సినిమాలు చేస్తున్నా కూడా నాని ఫ్యామిలీ టైమ్‌ను మాత్రం అస్సలు మిస్‌ చేసుకోడు. అంతకుముందు దేవదాస్‌ సినిమా చేస్తున్నప్పుడు కూడా జున్నుని షూటింగ్‌ స్పాట్‌ కే తెప్పించుకుని ఆడుకునే వాడు. మొన్ననే మార్చి 29న పుట్టినరోజు చేసుకున్నాడు చిన్నారి అర్జున్‌.  

Updated Date - 2020-06-21T17:45:00+05:30 IST