సారూ.. ఇదేం తీరు

ABN , First Publish Date - 2021-01-17T05:52:26+05:30 IST

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు బయట పడుతున్నాయి. అర్హత లేనివారు అనుకూల ప్రాంతాలకు బదిలీ అయ్యారు.

సారూ.. ఇదేం తీరు
కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం

  1. టీచర్ల బదిలీల్లో అక్రమాలు!
  2. స్పౌజ్‌ కేటగిరీ దుర్వినియోగం
  3. అనుకూల ప్రాంతాలకు అనర్హులు 
  4. దొడ్డిదారి ఎంచుకున్న ఉపాధ్యాయులు


కర్నూలు(ఎడ్యుకేషన్‌), జనవరి 16: ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు బయట పడుతున్నాయి. అర్హత లేనివారు అనుకూల ప్రాంతాలకు బదిలీ అయ్యారు. దీంతో తమకు అన్యాయం జరిగిందని బాధిత ఉపాధ్యాయులు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి ఉపాధ్యాయ బదిలీల ఉత్తర్వులు విడుదల అవుతున్నాయి. బదిలీ అయినవారు ఉన్నస్థానం నుంచి రిలీవ్‌ అయి.. కొత్త పాఠశాలలో చేరిపోతున్నారు. కానీ బదిలీ ప్రక్రియలో నిబంధనలకు నీళ్లొదిలినట్లు స్పష్టమౌతోంది. 


ఇదిగో అక్రమాలు..

శ్రీశైలం మండలంలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడి భార్య స్పౌజ్‌ కేటగిరీ కింద బదిలీకి దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు ఇద్దరూ శ్రీశైలం మండలంలోనే పనిచేస్తున్నారు. స్పౌజ్‌ కేటగిరీ కింద బదిలీకి దరఖాస్తు చేస్తే.. భర్త పనిచేసే పాఠశాలకు లేదా సమీప పాఠశాలకు బదిలీ కోరవచ్చు. కానీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలానికి దూరంగా ఉండే ఓర్వకల్లు మండలంలోని ఓ గ్రామానికి ఆమె బదిలీ ఉత్తర్వులు పొందారు. దీంతో తనకు అన్యాయం జరిగిందని మరో ఉపాధ్యాయిని జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. 

దేవనకొండ మండలంలో పనిచేసే స్కూల్‌ అసిస్టెంట్‌ ఒకరు తుగ్గలి మండలంలోని ఓ ఎంపీయూపీ పాఠశాలకు 2015లో బదిలీ అయ్యారు. అప్పట్లో స్పౌజ్‌ కేటగిరి వెసులుబాటును ఆమె వినియోగించుకున్నారు. ఒకసారి స్పౌజ్‌ ఆప్షన్‌ను వినియోగించుకుంటే తిరిగి ఎనిమిదేళ్ల వరకు ఆ వెసులుబాటు ఉండదు. తాజా బదిలీల్లో ఆమె భర్త స్పౌజ్‌ కేటగిరి కింద పత్తికొండ మండలంలోని ఓ జిల్లా పరిషత్‌ పాఠశాలకు బదిలీ ఉత్తర్వులు పొందారు. ఆయన 2012 నుంచి దేవనకొండ మండలంలోని ఓ జడ్పీహెచ్‌ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. 2015లో స్పౌజ్‌ కేటగిరీ వినియోగించుకున్నందున మరో మూడేళ్ల వరకు స్పౌజ్‌ కేటగిరీ బదిలీకి అర్హులు కారు. అయినా సరే విద్యాశాఖ అధికారులు ఆయనను స్పౌజ్‌ ఆప్షన్‌ కింద బదిలీ చేశారు.


నిబంధనలు గాలికి..

జిల్లాలో బదిలీల కోసం 6,330 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఖచ్చితంగా బదిలీ కావాల్సినవారు 2187 మంది ఉన్నారు. రిక్వెస్టు బదిలీల కోసం 4,143 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్ల బదీలీల ఉత్తర్వులు ఇప్పటికే విడుదలయ్యాయి. బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఉన్నత పాఠశాలల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు దరఖాస్తులను పరిశీలించి ఫార్వర్డ్‌ చేయాల్సి ఉంది. కానీ చాలాచోట్ల గుడ్డిగా పార్వర్డ్‌ చేసినట్లు కనిపిస్తోంది. తెలిసి చేశారా..? నిర్లక్ష్యం వహించారా అన్న చర్చ ఉపాధ్యాయవర్గాల్లో జరుగుతోంది. 


కేసులు నమోదు చేయిస్తాం

విద్యాశాఖ అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమ మార్గాల్లో బదిలీ ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయుడి గురించి సమగ్ర విచారణ జరిపిస్తాం. అవసరమైతే క్రిమినల్‌ కేసు నమోదు చేయిస్తాం. లేదంటే బదిలీ ఉత్తర్వులును రద్దు పరిచి మారుమూల ప్రాంత పాఠశాలలకు పంపిస్తాం. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు.  - సాయిరాం, డీఈవో 

Updated Date - 2021-01-17T05:52:26+05:30 IST