భారత వ్య‌క్తి హ‌త్య‌కేసు.. భారీ రివార్డు ప్ర‌క‌టించిన ఎఫ్‌బీఐ !

ABN , First Publish Date - 2020-09-17T20:30:57+05:30 IST

అమెరికాలో భారత సంత‌తికి చెందిన‌ పరేష్‌కుమార్ పటేల్ అనే వ్య‌క్తి 2012లో దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు.

భారత వ్య‌క్తి హ‌త్య‌కేసు.. భారీ రివార్డు ప్ర‌క‌టించిన ఎఫ్‌బీఐ !

వాషింగ్ట‌న్ డీసీ: అమెరికాలో భారత సంత‌తికి చెందిన‌ పరేష్‌కుమార్ పటేల్ అనే వ్య‌క్తి 2012లో దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. అత‌ను ప‌నిచేసే చోటు నుంచి కొంద‌రు దుండ‌గులు అప‌హ‌రించుకెళ్లి అతికిరాత‌కంగా చంపేశారు. ఈ హ‌త్య కేసును ద‌ర్యాప్తు చేస్తున్న‌ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)కు సైతం హంత‌కుల సంబంధించి ఎలాంటి ఆధారం దొర‌క‌లేదు. ఎన్ని విధాల ప్ర‌య‌త్నించిన ఫ‌లితం లేకుండా పోయింది. దాంతో హంత‌కులకు సంబంధించి ఏదైనా‌ స‌మాచారం తెలిసిన వారు త‌మ‌కు చెబితే వారికి 15వేల డాల‌ర్లు(స‌మారు రూ.11.23 ల‌క్ష‌లు) రివార్డుగా ఇస్తామ‌ని తాజాగా ఎఫ్‌బీఐ ప్ర‌క‌టించింది. 


వివ‌రాల్లోకి వెళ్తే... పరేష్‌కుమార్ పటేల్ అనే భార‌తీయుడు వర్జీనియాలోని చెస్టర్‌ఫీల్డ్‌లోని రేస్ వే గ్యాస్ స్టేషన్‌లో ప‌ని చేసేవాడు. ఎప్ప‌టిలాగే 2012, సెప్టెంబ‌ర్ 16న ఉద‌యం డ్యూటీకి వెళ్లిన పరేష్‌కుమార్‌ను కొంద‌రు దుండగులు ప‌నిచేసే చోటు నుంచే అప‌హ‌రించుకెళ్లారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన నాలుగు త‌ర్వాత అత‌ని మృతదేహం వర్జీనియాలోని రిచ్‌మండ్ నగరంలోని అంకారో బోట్ ల్యాండింగ్ వ‌ద్ద దొరికింది. పరేష్‌కుమార్‌ను కాల్చి చంపిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అప్ప‌టినుంచి ఈ కేసును ఎఫ్‌బీఐ రిచ్మండ్ శాఖ‌కు చెందిన‌ సెంట్రల్ వర్జీనియా వైయోలెంట్ క్రైమ్స్ టాస్క్ ఫోర్స్  అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 8 ఏళ్లు గ‌డిచిన ఈ హ‌త్య కేసులో ఎఫ్‌బీఐకి ఎలాంటి ఆధారాలు దొర‌క‌లేదు. దీంతో త‌మ‌కు స‌వాల్‌గా మారిన ఈ కేసు ప‌రిష్కారానికి ఎఫ్‌బీఐ అధికారులు మ‌రో దారిలేక ఎవ‌రికైనా హంత‌కుల గురించి తెలిస్తే చెప్పాల‌ని కోరుతున్నారు. త‌మకు స‌మాచారం ఇచ్చిన వారికి రూ.11.23ల‌క్ష‌లు రివార్డుగా ఇస్తామ‌ని తెలిపారు. 


అస‌లు సెప్టెంబ‌ర్ 16న ఏం జ‌రిగిందంటే..

చెస్టర్‌ఫీల్డ్‌ కౌంటీ పోలీసుల‌కు ఓ ప్ర‌త్య‌క్ష‌సాక్షి చెప్పిన ప్ర‌కారం... పరేష్‌కుమార్ ఉద‌యం 6 గంట‌ల ప్రాంతంలో గ్యాస్ స్టేషన్‌కు వ‌చ్చాడు. అత‌ను స్టేషన్‌కు వ‌చ్చిన రెండు నిమిషాల‌కే ఒక వాహ‌నంలో ఇద్ద‌రు దుండ‌గులు అక్క‌డికి చేరుకున్నారు. అనంత‌రం అత‌డిని తుపాకీతో బెదిరించి వారు వ‌చ్చిన వాహ‌నంలోనే ఎత్తుకెళ్లారు. స్థానికుల స‌మాచారంతో పోలీసులు అత‌ని ఆచూకీ కోసం గాలిస్తున్న క్ర‌మంలోనే నాలుగు రోజుల త‌ర్వాత పరేష్‌కుమార్ వర్జీనియాలోని రిచ్‌మండ్ నగరంలోని అంకారో బోట్ ల్యాండింగ్ వ‌ద్ద శ‌వ‌మై క‌నిపించాడు. దుండ‌గులు అత‌డిని తుపాకీతో కాల్చి చంపిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అనంత‌రం ఈ కేసు ఎఫ్‌బీఐ చేతికి వెళ్లింది. వారు కూడా ఈ మిస్ట‌రీ కేసును చేధించ‌లేక‌పోయారు. దాంతో ఈ హ‌త్య కేసు సంబంధించి ఎలాంటి స‌మాచారం తెలిసిన‌ త‌మకు చెబితే రూ.11.23 ల‌క్ష‌లు ఇస్తామ‌ని తాజాగా ఎఫ్‌బీఐ అధికారులు ప్ర‌క‌టించారు. 

Updated Date - 2020-09-17T20:30:57+05:30 IST