బియ్యం సేకరణలో ఎఫ్‌సీఐ రివర్స్‌ గేర్‌!

ABN , First Publish Date - 2021-03-06T08:25:35+05:30 IST

తెలంగాణ నుంచి బియ్యం సేకరించేందుకు భారత ఆహార సంస ్థ(ఎఫ్‌సీఐ) రకరకాల కొర్రీలు పెడుతోంది.

బియ్యం సేకరణలో ఎఫ్‌సీఐ రివర్స్‌ గేర్‌!

  • 3.50 లక్షల టన్నుల ‘బలవర్థక  ఉప్పుడు బియ్యం’ టార్గెట్‌
  • మిగిలింది పచ్చి బియ్యమివ్వాలని ఆదేశం
  • వేరే రాష్ట్రాలకు పంపిణీ చేయటానికి తెలంగాణపై ఒత్తిడి
  • యాసంగిలో రైస్‌మిల్లర్లు ఇచ్చేదంతా ఉప్పుడు బియ్యమే
  • ‘బలవర్థకం’ చేసేందుకు ప్రత్యేక యూనిట్లు అవసరం
  • పచ్చిబియ్యం ఇవ్వలేమన్న సర్కారు
  • ఇప్పటిదాకా ఎఫ్‌సీఐకి వానాకాలంలో పచ్చి బియ్యం,
  • యాసంగిలో ఉప్పుడు బియ్యం ఇస్తూ వచ్చిన రాష్ట్రం

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి బియ్యం సేకరించేందుకు భారత ఆహార సంస ్థ(ఎఫ్‌సీఐ) రకరకాల కొర్రీలు పెడుతోంది. కొన్ని దశాబ్దాలుగా వానాకాలం సీజన్‌లో అధికశాతం పచ్చి బియ్యం(రా రైస్‌), యాసంగి సీజన్‌లో దాదాపు 100 శాతం ఉప్పుడు బియ్యం(బాయిల్డ్‌ రైస్‌) తీసుకుంటున్న ఎఫ్‌సీఐ.. ఈసారి మాత్రం రివర్స్‌ గేర్‌ వేసి, గతానికి విరుద్ధంగా టార్గెట్లు పెడుతోంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు ‘ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌’(బలవర్థకమైన ఉప్పుడు బియ్యం) సరఫరా చేసేందుకు తెలంగాణపై ఒత్తిడి పెంచుతోంది. ఈ యాసంగి సీజన్‌లో 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ‘ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌’ను ఎఫ్‌సీఐకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం టార్గెట్‌ విధించింది. దాంతోపాటు ప్రతి ఏటా యాసంగి సీజన్‌లో సేకరించే  ఉప్పుడు బియ్యాన్ని కాకుండా.. పచ్చి బియ్యం ఇవ్వాలని మరో తిరకాసు పెట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఆందోళన నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 25న ‘మన్‌కీ బాత్‌’ రేడియో కార్యక్రమంలో ప్రసంగించిన సమయంలో.. ‘ఫోర్టిఫైడ్‌ రైస్‌’(బలవర్థకమైన బియ్యం) పంపిణీ పథకాన్ని ప్రకటించారు. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌- బీ12 లోపంతో బాధపడుతున్న ఐదేళ్లలోపు పిల్లలు, మహిళలకు బలవర్థకమైన బియ్యాన్ని మధ్యాహ్న భోజనం లాంటి పథకాల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. దీంతో ఫోర్టిఫైడ్‌ రైస్‌ను సేకరించాల్సిన అవసరం కేంద్రానికి ఏర్పడింది. ఇందులో భాగంగా తెలంగాణకు 3.50  లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యం విధించింది. 


ఇతర రాష్ట్రాలకు తరలించేందుకే..

ఫోర్టిఫైడ్‌ రైస్‌ను కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అవసరాలకు తరలించనున్నారు. అయితే ఆ రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యం తినేవారే ఉన్నందున.. ఈ 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం ఫోర్టిఫైడ్‌ చేసినవే కావాలని ఎఫ్‌సీఐ షరతు పెట్టింది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైస్‌మిల్లుల్లో ప్రస్తుతం ‘ఫోర్టిఫైడ్‌’ సిస్టమ్‌ లేదు. దీనికి ప్రత్యేకంగా కొత్తగా యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫోర్టిఫైడ్‌ చేయాలంటే బియ్యం పిండిలో ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, బీ-12 విటమిన్లను తగిన మోతాదులో జోడించి.. బియ్యం మాదిరిగా తయారు చేయాల్సి ఉంటుంది. 99 కిలోల సాధారణ బియ్యానికి ఒక కిలో ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని కలిపి ప్రత్యేకంగా బ్యాగింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను కిలోకు 71 పైసల చొప్పున క్వింటాలుకు రూ.71 కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వద్దగానీ, రైస్‌ మిల్లర్ల వద్దగానీ ఇప్పటికిప్పుడు ‘ఫోర్టిఫైడ్‌ రైస్‌’ ఉత్పత్తి చేసే పరిస్థితి లేకపోవటంతో.. ఎఫ్‌సీఐ టార్గెట్‌ను ఎలా చేరుకోవాలని పౌరసరఫరాలశాఖ, రైస్‌మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. 


మిగిలినదంతా పచ్చి బియ్యమే ఇవ్వాలి..

సాధారణంగా యాసంగి సీజన్‌లో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. దొడ్డు బియ్యంలో దాదాపుగా 90 శాతం బాయిల్డ్‌ రైస్‌ (ఉప్పుడు బియ్యం) ఉత్పత్తి అవుతాయి. రైస్‌మిల్లర్లు కూడా రిస్కు తీసుకోకుండా.. కస్టమ్‌ మిల్లింగ్‌ వానాకాలంలో పచ్చి బియ్యం(రా రైస్‌), యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ ఉత్పత్తికే ప్రాధాన్యమిస్తారు. యాసంగిలో ధాన్యం నుంచి పచ్చి బియ్యం ఉత్పత్తి చేయటం కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులు ఇబ్బందికరంగా మారాయి. ఈ సీజన్‌లో బాయిల్డ్‌ రైస్‌ ఉత్పత్తి అయితే... పచ్చి బియ్యం ఎలా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఈ మేరకు పచ్చి బియ్యం కావాలంటూ ఎఫ్‌సీఐ నుంచి ఇటీవల వచ్చిన లేఖకు.. సాధ్యం కాదంటూ జవాబు ఇచ్చింది.  కానీ, ఇతర రాష్ట్రాలకు బాయిల్డ్‌ రైస్‌ అవసరముండగా... తెలంగాణ నుంచి ఆ రైస్‌ కాకుండా పచ్చి బియ్యం ఇవ్వాలని కేంద్రం టార్గెట్‌ పెట్టడం వెనక వ్యూహమేంటన్న చర్చ జరుగుతోంది. 


కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రతిష్టంభన

రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థను నోడల్‌ ఏజెన్సీగా నియమించి ప్రతి ఏటా గ్రామగ్రామాన ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈసారి ఉంటాయా? ఉండవా? అన్న ప్రతిష్టంభన నెలకొంది. ఈ యాసంగి సీజన్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాల్సిన అవసరంలేదని, రైతులు ఎక్కడ ధర ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముకోవచ్చని, గతంలో ధాన్యం కొనుగోళ్లతో ప్రభుత్వానికి నష్టం వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల నిర్వహించిన సమీక్ష సందర్భంగా అన్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు పౌరసరఫరాల సంస్థ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. వ్యవసాయ మార్కెట్లలో ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పించేందుకు మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గడిచిన వానాకాలం సీజన్‌లో సన్నధాన్యానికి బోనస్‌ ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఎమ్మెస్పీ కంటే ఎక్కువ ధర ఇస్తే... ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోనని మెలికపెడుతోందని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడు ఎఫ్‌సీఐ ఉప్పుడు బియ్యానికి బదులుగా... పచ్చి బియ్యం అడుగుతోందనే కారణం చెప్పి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తిలోదకాలిస్తారా? కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. 

Updated Date - 2021-03-06T08:25:35+05:30 IST