అమెరికాలో భయం.. భయం

ABN , First Publish Date - 2021-01-11T07:37:01+05:30 IST

అధ్యక్ష హోదాలో డొనాల్డ్‌ ట్రంప్‌ చివర్రోజులు మరింత అశాంతిని రేపే దిశగా సాగుతున్నాయి. కేపిటల్‌ భవనంపై దాడి తరువాత ఎపుడేం జరుగుతుందోనన్న

అమెరికాలో భయం.. భయం

  • 20లోగా మరిన్ని దాడులు జరగొచ్చన్న సంకేతాలు
  • గగనతలంలోనూ భారీగా భద్రత
  • ప్రతీ కాంగ్రెస్‌ సభ్యుడికీ రెట్టింపు భద్రత
  • కేపిటల్‌, వైట్‌హౌస్‌ పరిసరాల్లో నిషేధాజ్ఞలు


వాషింగ్టన్‌, జనవరి 10: అధ్యక్ష హోదాలో డొనాల్డ్‌ ట్రంప్‌ చివర్రోజులు మరింత అశాంతిని రేపే దిశగా సాగుతున్నాయి. కేపిటల్‌ భవనంపై దాడి తరువాత ఎపుడేం జరుగుతుందోనన్న భయం రాజకీయ పక్షాలను, సామాన్య ప్రజానీకాన్ని వేధిస్తోంది. ట్రంప్‌ నిష్క్రమణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గ్రూపులన్నీ క్రియాశీలమయ్యాయనీ, పెద్ద ఎత్తున హింసా విధ్వంసాలకు ప్రయత్నం జరగవచ్చనీ మీడియా కథనాలు వెల్లువెత్తుతున్నాయి.


‘అమెరికన్‌ ప్రజస్వామ్యం బలహీనంగా ఉంది... ఏం జరుగుతుందో తెలియని సంక్లిష్ట, అగమ్య స్థితిలో నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నట్లు గా ఉంది’’ అని సీఎన్‌ఎన్‌ ఆదివారంనాడంతా వార్తాకథనాలు ప్రసారం చేసింది. కేపిటల్‌ భవన దాడితో అప్రమత్తమైన భద్రతాయంత్రాంగం బైడెన్‌ పట్టాభిషేకం జరిగే తేదీలోగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా చర్యలు చేపట్టింది.


అమెరికన్‌, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు వాషింగ్టన్‌ డీసీ గగనతలంలో ప్రత్యేక జెట్ల ద్వారా భద్రతను పర్యవేక్షించనున్నాయి. ఇందుకు ఫ్టైట్‌ కమాండెంట్‌ యూనియన్లు అదనపు సిబ్బందిని దింపాయి. ప్రతీ కాంగ్రెస్‌ సభ్యుడికీ- ముఖ్యంగా సెనేటర్లకు రెట్టింపు భద్రతను కల్పిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే సెనేటర్లు, కాంగ్రెస్‌ సభ్యుల వెంట ప్రత్యేకంగా ఆరుగురు సాయుధులైన సిబ్బంది ఉంటారు. ప్రముఖులైన సెనేటర్ల వెంట పది నుంచి 15 మంది ఉంటారని మార్షల్‌ సర్వీస్‌, ఆర్మీ సార్జెంట్‌ సర్వీస్‌ వెల్లడించాయి. కేపిటల్‌, శ్వేతసౌధాల వద్ద భారీగా నేషనల్‌ గార్డ్స్‌ మోహరించాయి. ఇప్పటికే అక్కడ నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి.


అటు రాజకీయ స్థాయిలో- అభిశంసన అస్త్ర ప్రయోగానికి రంగం సిద్ధమయ్యింది. తిరుగుబాటును రెచ్చగొట్టినందుకు ట్రంప్‌ను అభిశంసిస్తున్నట్లు తీర్మానం సిద్ధం చేశారు.. సోమవారంనాడు దీనిని కాంగ్రెస్‌ చేపడుతుంది. బహుశా గురువారంనాటికి దీనిపై ఓటింగ్‌ జరిపి ఆమోదించి సెనెట్‌కు పంపుతారు. అయితే సెనెట్‌ సమావేశమయ్యేది 19వ తేదీన. అంటే బైడెన్‌ ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందు... ఈ దృష్ట్యా దీనిని సెనెట్‌లో ఏ స్థాయిలో విచారణకు చేపట్టగలరన్నది చర్చనీయాంశం. ఈ అభిశంసన తీర్మానంతో పాటు ట్రంప్‌ మళ్లీ పోటీచేయడానికి వీల్లేకుండా ఓ తీర్మాన బిల్లును సిద్ధం చేశారు. దీనికి ప్రతినిధుల సభలోనూ, సెనెట్‌లోనూ సాధారణ మెజారిటీ చాలు.


ట్రంప్‌ వల్ల రిపబ్లికన్‌ పార్టీ ఇమేజి కూడా దెబ్బతినడం వల్ల ఆయనను రాజకీయాల నుంచి శాశ్వతంగా నిషేధిస్తే భవిష్యత్తులోనైనా మళ్లీ తలెత్తుకోగలమన్న భావన చాలామంది రిపబ్లికన్లలో ఉంది. అందుచేత అభిశంసన కంటే ఈ తీర్మానానికి వారు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. రాజీనామాకు ట్రంప్‌ నిరాకరిస్తున్నందున 25వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆయనను పదవీచ్యుతుణ్ణి చేయాలని, 20లోగానే ఇది జరిగిపోవాలని డెమొక్రాట్లు ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ సవరణను ప్రయోగించడం ఉపాఽధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, ట్రంప్‌ కేబినెట్‌ సభ్యుల చేతిలో ఉంది. వీరంతా ఈ సవరణను వినియోగించాలని నిర్ణయిస్తే 20లోగా ట్రంప్‌ను పదవి నుంచి దింపేయడం సాధ్యమవుతుంది. అయితే దీన్ని వినియోగించే విషయమై పెన్స్‌ ఊగిసలాడుతున్నారు. కాగా, కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి తాను హాజరుకానని నిష్క్రమిస్తున్న అధ్యక్షుడు- ముందుగానే ప్రకటించడం 152ఏళ్లలో ఇదే తొలిసారని చరిత్ర చెబుతోంది. 




ప్రమాణస్వీకారానికి వెళ్తా


బైడెన్‌ ప్రమాణస్వీకారానికి తాను హాజరవుతానని మైక్‌ పెన్స్‌ ప్రకటించారు.  ‘ట్రంప్‌ హాజరవనని చెప్పేశారు. ఆయన రాకపోవడమే మంచిది... కనీసం మైక్‌ పెన్స్‌ వచ్చినా అది గౌరవంగా భావిస్తాను’ అని బైడెన్‌ పేర్కొనడంతో- పెన్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘కొత్త అధ్యక్షుడు అంతగా వ్యాఖ్యానించాక వెళ్లనని ఎలా చెబుతాను...?నేను సంప్రదాయలను గౌరవిస్తాను’ అని పెన్స్‌ అన్నారు.



Updated Date - 2021-01-11T07:37:01+05:30 IST