డెంగ్యూ భయం

ABN , First Publish Date - 2021-07-30T04:36:34+05:30 IST

అసలే వర్షాకాలం అందులోనూ వర్షాలు పడుతున్న సమయం. గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడిక్కక్కడ నీటి నిల్వలు, మురికి కాలువలో పేరుకపోయిన మట్టివల్ల నీరు కలుషితం అవుతున్నాయి.

డెంగ్యూ భయం
కోనాపూర్‌లో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో దోమల నివారణ మందు చల్లుతున్న సిబ్బంది

- కాటేస్తున్న నీటి నిల్వలు
- అవగాహన లేక విస్తరిస్తున్న వ్యాధి
- ఇప్పటికే జిల్లాలో 3 కేసుల నమోదు
- రెండు రోజుల క్రితం హన్మాజీపేట పరిధిలో ఓ డెంగ్యూ కేసు నమోదు
- వ్యాధి నిర్ధారణ పరికరాలను అందుబాటులోకి తేవడంలో సిబ్బంది నిర్లక్ష్యం
- జిల్లా కేంద్ర ఆసుపత్రి, బాన్సువాడ ఆసుపత్రిలో నిర్ధారణ పరికరాలు ఉన్న అందుబాటులోకి రాని వైనం
- జిల్లా అధికారులు దృష్టి సారిస్తేనే ప్రజలకు తప్పనున్న అవస్థలు


కామారెడ్డి టౌన్‌, జూలై 29: అసలే వర్షాకాలం అందులోనూ వర్షాలు పడుతున్న సమయం. గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడిక్కక్కడ నీటి నిల్వలు, మురికి కాలువలో పేరుకపోయిన మట్టివల్ల నీరు కలుషితం అవుతున్నాయి. పల్లె, పట్టణ ప్రగతిలో చాలా వరకు దోమల సంతతి వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టినప్పటికీ సరైన మురికి కాలువలు లేకపోవడం నీరు ఎక్కడక్కడ పేరుకపోవడంతో పాటు ప్రజలకు అవగాహన లేక నీటి నిల్వలు రోజుల తరబడి పెట్టుకోవడం, వర్షాలు పడ్డ ప్రాంతాల్లో గుంతల్లో నీటిని తొలగించకపోవడంతో దోమల సంతతి మళ్లీ పెరుగుతుందని తెలుస్తోంది. కలుషిత నీటిలో దోమలు గుడ్లు పెట్టి వాటి సంతతిని పెంచడం వల్ల జిల్లాలో దోమ కాటు వ్యాధులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో నానా అవస్థలు పడుతున్న జనానికి డెంగ్యూ వ్యాధి సైతం అల్లాడిస్తోంది. అయితే కామారెడ్డి జిల్లాగా మారినా జిల్లాలో ఇప్పటి వరకు డెంగ్యూ నిర్ధారణ పరికరాలు అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు నిజామాబాద్‌, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. వర్షాలు పడితే చెలరేగిపోయే దోమల వల్ల వచ్చే డెంగ్యూ వ్యాధిని ప్రభుత్వం విస్మరించింది. ఈ వ్యాధిని గుర్తించేందుకు జిల్లా ఆసుపత్రిలో ఇప్పటి వరకు పరికరాలను  అందుబాటులోకి తీసుకురాలేదు.
జిల్లాలో అందుబాటులోకి రాని డెంగ్యూ నిర్ధారణ పరికరాలు
డెంగ్యూ నిర్ధారణ పరికరాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడం, కనీసం ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనైన పరికరాలు ఉన్నాయని అనుకుంటే పొరపాటే. ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేసే పరీక్షలు అన్నీ ఉత్తవేనని, జిల్లాలోనే డెంగ్యూకు సంబంధించిన పరీక్ష పరికరాలు లేవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులే స్పష్టం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పతిలో డెంగ్యూకు సంబంధించిన పరికరాలు వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా వాటి ప్యాకింగ్‌ కవర్లు కూడా విప్పలేదు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమో లేక పరికరాలను బిగించేవారి కాలాయాపననో తెలిదు కానీ ప్రజలకు మాత్రం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కానీ జిల్లా ఆసుపత్రి వర్గాలు మాత్రం  నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలను బిగిస్తే డెంగ్యూ బాధితులకు నిర్ధారణ పరీక్షలు చేసి సరైన చికిత్సను అందిస్తామని చెబుతున్నాయి. బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో  పరికరాలు బిగించినప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. డెంగ్యూ వ్యాధి ప్రాణాంతక వ్యాధి అని తెలిసినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. పరికరాలు వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై వైద్యాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 3 కేసులు నమోదు
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. అనధికారికంగా చాలానే ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ కేసులు నమోదు అవుతున్న ప్రాంతాల్లో ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాలకు చెందిన ప్రాంతాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదు కావడానికి కారణం ఆ పరిసర ప్రాంతాల్లో డ్యాంలు ఉండడం నీటి నిల్వలు ఉండడం అని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే పరిసరాల పరిశుభ్రతను సైతం ప్రజలు పాటించడం లేదని తెలుస్తోంది. నీటి నిల్వలపై ప్రజలను అవగాహన కల్పిస్తున్నా వాటిని లెక్క చేయకపోవడంతో దోమల సంతతి పెరిగి డెంగ్యూ, మలేరియా వ్యాధులకు ప్రతీసారి ఇక్కడి ప్రాంత ప్రజలు గురవుతున్నారు. జిల్లాలో నమోదయిన డెంగ్యూ కేసులలో నాగిరెడ్డిపేట, నిజాంసాగర్‌ మండలాలతో పాటు గత రెండు రోజుల క్రితం హన్మాజీపేట పీహెచ్‌సీ పరిధిలోని కోనాపూర్‌ గ్రామంలో ఓ 11 సంవత్సరాల బాలునికి డెంగ్యూ నిర్ధారణ అయింది. సదరు బాలుడికి డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేయడానికి పరికరాలు అందుబాటులో లేకపోవడంతో నిజామాబాద్‌కు పంపి అక్కడ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు డెంగ్యూ నిర్ధారణ పరికరాలను అందుబాటులోకి తెస్తే వ్యాధి నిర్ధారణ అయ్యి అందుకు తగ్గట్టుగా చికిత్స పొంది ప్రజలు డెంగ్యూ మహమ్మారి నుంచి బయటపడతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
డెంగ్యూ ఎలా వస్తోంది
వర్షాలు ఆరంభమయ్యాక ఇంటి పరిసరాలు, మురికి గుంటలు, కొబ్బరి బొండాలు లాంటి వాటిలో నీరు నిల్వకుండా చూసుకోవాలి. అలా నీరు నిల్వ వుండడం వల్ల దోమల సంతతి పెరుగుతోంది. దోమల వల్ల మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ లాంటి వ్యాఽధులు సంభవిస్తాయి. ప్రాణాంతక వ్యాధి అయిన డెంగ్యూ సోకడానికి కారణం ఎడిస్‌ ఈజిప్టె(టైగర్‌ మస్కిటో) అనే దోమ కాటు కారణం. ఈ దోమలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే కుడతాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వేళల్లో కుట్టడం వల్ల ఈ వ్యాధి సోకే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కుట్టిన రెండు, మూడు రోజుల్లోనే వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనబడుతాయి. విపరీతమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఏర్పడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే తెల్ల రక్తకణాలపై దాడి చేస్తాయి. దీంతో వ్యాధి సోకిన వారు నీరసించిపోతారు.
డెంగ్యూను ఎలా గుర్తించాలి
దోమ మనిషిని కుట్టిన తర్వాత జ్వరంతో పాటు వారి శరీరంలో చిన్న చిన్న ఎర్రని చెమటకాయ లాంటి పొక్కులు కన్పిస్తాయి. మరికొంత మందికి చర్మంపై వచ్చిన విధంగానే కడుపులో వస్తాయి. ఇది గుర్తించాలంటే మలవిసర్జన సమయంలో రక్తం జీరలు వస్తున్నాయో లేదో గమనించాలి. ఈ రెండు రకాల పరిస్థితులు ఉంటే ఎలిసా టెస్ట్‌ ఫర్‌ డెంగ్యూ పరీక్షను చేయించుకోవాలి. ఆసుపత్రిని సంప్రదిస్తే దానికి తగిన ఆంటి బయోటిక్స్‌,ప్లూయిడ్స్‌లను వైద్యులు అందిస్తారు. వ్యాధి ముదరక ముందే తగిన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చు.

వ్యాధి కట్టడికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం
- చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో, కామారెడ్డి
వర్షాకాలం నీటి కుంటలలో దోమలు గుడ్లు పెట్టడం వల్ల వాటి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలి. నీరు నిలిచినట్లయితే బ్లీచింగ్‌ పౌడర్‌ లాంటి వాటిని చల్లాలి. దీంతో కొద్ది రోజులుగా నీటిపై నిల్వ ఉన్న దోమలు మృతి చెందుతాయి. హన్మాజిపేట పరిధిలో నమోదైన డెంగ్యూ కేసుతో చుట్టు పక్కల 50 మంది వరకు పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించాం. జిల్లాలో సైతం డెంగ్యూ వ్యాధి కట్టడికి గ్రామాల్లో, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి.

Updated Date - 2021-07-30T04:36:34+05:30 IST