భారీ వర్షంతో భయం.. భయం

ABN , First Publish Date - 2021-11-29T07:51:22+05:30 IST

అన్నమయ్య డ్యాం తెగిపోయి కనీవిని ఎరుగని నష్టంతో అతలాకుతలమైన రాజంపేట వాసులు తిరిగి భారీ వర్షాలు కురుస్తుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు ప్రస్తుతం రాజంపేట, రైల్వేకోడూరు పట్టణ

భారీ వర్షంతో భయం.. భయం
రైల్వేకోడూరులో పరవళ్లు తొక్కుతున్న గుంజననది

కోడూరులో గుంజనేరు వద్ద కుప్ప కూలిన మూడు ఇళ్లు

ఊటుకూరు చెరువు దిగువ ప్రాంతాలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు 

చిట్వేలి-నెల్లూరు మధ్య రాకపోకలు బంద్‌ 

రాజంపేట/రాజంపేట టౌన/రైల్వేకోడూరు, నవంబరు 28 : అన్నమయ్య డ్యాం తెగిపోయి కనీవిని ఎరుగని నష్టంతో అతలాకుతలమైన రాజంపేట వాసులు తిరిగి భారీ వర్షాలు కురుస్తుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు ప్రస్తుతం రాజంపేట, రైల్వేకోడూరు పట్టణ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రైల్వేకోడూరులోని నరసరాంపురంలో రెండు ఇళ్లు, బలిజవీధిలో ఒక్క ఇల్లు కూలిపోయింది. అధికారులు నది పరీవాహక ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేశారు. నరసరాంపురంలో చూస్తుండగానే ఇళ్లు కూలిపోయాయి. పది రోజుల కిందటే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వరద నీరు పెరుగుతూ ఉండటంతో పట్టణంలోని గుంజనేరు పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచిస్తున్నారు. కోడూరుకు చుట్టుపక్కల నదులు ఒకవైపు గుంజనేరు, మరోవైపు ముష్టేరు ప్రవహిస్తూ ఉంది. దీనివల్ల కోడూరుకు వరద పెరిగితే ఇబ్బందులు తప్పవు. మండలంలోని బాలపల్లి వద్ద కొండల్లోంచి వరద నీరు పొంగి ప్రధానదారిలో ప్రవహించింది. ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా ఆంజనేయపురం వద్ద బ్రిడ్జిని రైల్వేకోడూరు సీఐ పరిశీలించారు. అక్కడ కొద్దిగా బ్రిడ్జి దెబ్బతినే అవకాశం ఉందని ముందుస్తుగా అధికారులు సహాయక చర్యలు తీసుకున్నారు. తిరుపతి-రైల్వేకోడూరు మధ్య రాకపోకలు సాగుతున్నాయి. రాజంపేట పట్టణంలో భారీ వర్షాల వల్ల పట్టణానికి ఎగువనున్న ఊటుకూరు చెరువు ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల దిగువనున్న హరిజనవాడ, అరుంధతివాడ ప్రజలను రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, తహసీల్దారు రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వారిని సమీపంలోని ఓ పాఠశాలకు తరలించారు. పట్టణంలో మరోపక్క మన్నూరు చెరువు, పోలి చెరువు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కురిస్తే వరద నీరు పట్టణంలోకి చేరే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. కడప-నెల్లూరు సరిహద్దు అడవుల్లో భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల యల్లమరాజుచెరువు అలుగు పారడంతో చిట్వేలి-రాపూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 


మహిళను కాపాడిన పోలీసులు, స్థానికులు

రైల్వేకోడూరు మండలంలోని శెట్టిగుంట వాగులో గిరిజనకాలనీకి చెందిన నీలావతమ్మ అనే మహిళ ఆదివారం చిక్కుకుంది. సమాచారం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు వాగు వద్దకు వెళ్లి తాడు సాయంతో ఆమెను కాపాడారు. సాయంత్రం ఆమె పని మీద వాగులో అవతలికి వెళ్లింది. అప్పుడు వరద నీరు తాకిడి పెద్దగా లేదు. పని చూసుకుని వచ్చేసరికి వాగులో ఎక్కువగా నీరు చేరింది. దీంతో ఆమె రాలేకపోయిందనే సమాచారం గిరిజన కాలనీ వాసులకు తెలియడంతో శెట్టిగుంట సర్పంచ్‌ శివశైలజ, రైల్వేకోడూరు సీఐ కె.విశ్వనాథరెడ్డి, సిబ్బంది, గిరిజన కాలనీ వాసులు అక్కడికి చేరుకుని తాడు సాయంతో ఆమెను వాగు దాటించారు.


డేంజర్‌ జోనలో పలు చెరువులు 

పంటలు వర్షార్పణం 

నేడు పాఠశాలలకు సెలవు

కడప, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం జిల్లా వాసులను భయాందోళనకు గురి చేస్తోంది. నిన్నటి తుఫాన బారి నుంచి జిల్లా వాసులు కోలుకోక ముందే మళ్లీ తుఫాను జిల్లా వాసులను భయాందోళనకు గురి చేస్తోంది. ఇటీవల కురిసిన ఎడతెరపి లేని వర్షాలకు పంటలు వర్షార్పణం అయ్యాయి. అలాగే అన్నమయ్య డ్యాం తెగిపోవడం, పలు చెరువులకు గండిపడి జిల్లాకు కోలుకోలేని నష్టం సంభవించింది. 1320.67 కోట్లు జవాద్‌ తుఫాన నష్టం చేకూర్చింది. అయితే ఇప్పుడు మళ్లీ శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు లోతట్టు ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చెరువులు, కుంటలు నిండుకుండల్లా ఉన్నాయి. ఎక్కడ తెగిపోతాయోనన్న ఆందోళన ఉంది.  ఇప్పటికే జిల్లాలో గాలివీడు పెద్ద చెరువు, ఊటుకూరు చెరువు కృష్ణారెడ్డి చెరువు, నగిరిపాటి చెరువు, పుట్లంపల్లి చెరువు, చింతకుంట, చిట్లూరు, శిబ్యాల, పోలిపెద్ద చెరువు, సీకేదిన్నె చెరువులు ప్రమాదస్థితిలో ఉన్నాయి. వర్షం ఎక్కువైతే వీటికి ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయి. ఊటుకూరు చెరువుపై కడన నగర వాసుల్లో ఆందోళన నెలకొంది. తెగుతుందన్న ప్రచారం ఆ చెరువు పరిస్థితి పై ఉంది. ఆదివారం డిప్యూటీ సీఎం అంజాద్‌బాష, మేయర్‌ సురే్‌షబాబు చెరువును పరిశీలించారు. ముందస్తుగా ఇరిగేషన అధికారులు చెరువు కోత కాకుండా ఇసుకబస్తాలు వేశారు. ప్రమాదకరంగా మారిన చెరువులపై నిఘా పెట్టారు. జిల్లాలోని వాగులు, వంకలు అన్ని నదులు ఉధృతంగా పారుతున్నాయి. ఇప్పుడు మళ్లీ వర్షాలు రావడంతో లోతట్టు ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. చెరువులు, కుంటలు తెగుతాయన్న భయం ఉంది. పంటల విషయానికి వస్తే వరి పంట పూర్తిగా దెబ్బతింది. కేపీ ఉల్లి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కలెక్టర్‌ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుఫాన నేపఽథ్యంలో సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే స్పందన కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. 


కంట్రోల్‌ రూంలు ఏర్పాటు : కలెక్టర్‌

కడప (కలెక్టరేట్‌), నవంబరు 28: తుఫాన ప్రభావంతో వస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రజల అత్యవసర సహాయ, సహకారాల కోసం కలెక్టరేట్‌తో పాటు మూడు రెవెన్యూ డివిజన కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌  రూంలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వి.విజయరామరాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధిక నీటి ప్రవాహం ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, వంకలు, వాగులు, నదులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. వదంతులు, పుకార్లను ప్రజలు నమ్మవద్దన్నారు. 


కడప కలెక్టరేట్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఫోన నెంబర్లు : 08562 - 246344, 244437

కడప రెవన్యూ డివిజనల్‌ కంట్రోల్‌ రూమ్‌ : 08562-295990

రాజంపేట డివిజన కంట్రోల్‌ రూమ్‌: 08565-240066

జమ్మమడుగు డివిజన కంట్రోల్‌ రూమ్‌: 9966225191


24 గంటలు చెరువులు, కాలువలపై నిఘా పెట్టాలి

జిల్లాలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ, ఎంపీడీవో, పోలీసు,ఫైర్‌ సిబ్బందితో పాటు అధికారులంతా ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వి.విజయరామరాజు ఆదేశించారు. అధికారులతో కలెక్టర్‌ ఆదివారం జూమ్‌ వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. జేసీలు గౌతమి, సాయికాంతవర్మ, ధ్యాన చంద్ర లు పాల్గొన్నారు. రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌, డీఆర్వో మలోల, కడప, జమ్మలమడుగు ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు క్షేత్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌  మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురి సే అవకాశాలున్నాయని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. జవాద్‌  తుపాను వరధ గ్రామాల్లో సహాయ పునరావాస చర్యలు వేగవంతం చేయాలన్నారు. అన్ని చెరువులు, రిజర్యాయర్ల నీటిమట్టంపై 24 గంటల పాటు రెవెన్యూ, ఇరిగేషన అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా వరద ముంపు ఉందని తెలిస్తే వెంటనే ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలన్నారు. హెచ్చరికలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వారికి సహకరించి పునరావాస కేంద్రాలకు వెళ్లాలనీ  కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. 



Updated Date - 2021-11-29T07:51:22+05:30 IST