‘ఒమైక్రాన్‌’తో భయం భయం

ABN , First Publish Date - 2021-12-01T05:30:00+05:30 IST

జిల్లావాసులను ఒమైక్రాన్‌ భయం వెంటాడుతోంది. ఇప్పటికే కరోనా వైరస్‌ రెండు దశల వ్యాప్తితో అన్ని రంగాలూ కుదేలైపోగా.. తీవ్రస్థాయిలో ప్రాణ నష్టం వాటిల్లింది. తాజాగా ఒమైక్రాన్‌ రూపంలో కొత్త వైరస్‌ దూసుకొస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.

‘ఒమైక్రాన్‌’తో భయం భయం
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేశ్‌ బాలాజీ లఠ్కర్‌

- సర్వే ముమ్మరం చేసిన అధికారులు

- విదేశాల నుంచి వచ్చిన వారి వివరాల సేకరణ

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లావాసులను ఒమైక్రాన్‌ భయం వెంటాడుతోంది. ఇప్పటికే కరోనా వైరస్‌ రెండు దశల వ్యాప్తితో అన్ని రంగాలూ కుదేలైపోగా.. తీవ్రస్థాయిలో ప్రాణ నష్టం వాటిల్లింది. తాజాగా ఒమైక్రాన్‌ రూపంలో కొత్త వైరస్‌ దూసుకొస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు జిల్లాలో కరోనా ఉధృతి ఏ స్థాయిలో ఉందనే దానిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌ ఇప్పటికే జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంటికీ వైద్య సిబ్బంది, వలంటీర్లు వెళ్లి ఫీవర్‌ సర్వే చేయాలని ఆదేశించారు. కొవిడ్‌ నిబంధనలు విధిగా పాటించేలా ఆంక్షలు విధించాలని సూచించారు. ఒమైక్రాన్‌ రూపంలో కరోనా వైరస్‌ మూడో ముప్పు పొంచి ఉందని వైద్య వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నా... చాలామంది నిబంధనలు పాటించడం లేదు. కార్తీకమాసం సందర్భంగా పిక్నిక్‌లు, శివాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. మరోవైపు థియేటర్లు, రైతుబజార్లు, మార్కెట్లు, వివాహాది శుభకార్యాలయాల్లో ఎక్కడ చూసినా జనం గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో కూడా ప్రయాణికులు మాస్క్‌లు ధరించడం లేదు. ప్రస్తుతం కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నా అజాగ్రత్తగా ఉండరాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలపై అప్రమత్తంగా వ్యవహరిస్తే ఒమైక్రాన్‌ ముప్పు పెద్దగా ఉండదని సూచిస్తున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సిబ్బంది, వలంటీర్లు, ఆశావర్కర్లు ఇంటింటా పీవర్‌ సర్వే చేస్తున్నారు. ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. బ్రిటన్‌, సౌత్‌ ఆఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇజ్రాయిల్‌ దేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేసి అవసరం మేరకు చికిత్సలు అందించనున్నారు. మరోవైపు జిల్లాలో గతంలో ‘కొవిడ్‌’ సేవలందించిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు లభ్యత, ఆక్సిజన్‌ నిల్వలు, వసతుల వివరాలు సేకరిస్తున్నారు. అవసరమైతే మళ్లీ క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

 

ఎదుర్కొనేందుకు సిద్ధం : కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ 

ఒమైక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ శ్రీకేశ్‌ బాలాజీ లఠ్కర్‌ నోడల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయ సమావేశ మందిరంలో నోడల్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. విదేశాల నుంచి ముఖ్యంగా బ్రిటన్‌తోపాటు మరో 12 దేశాల నుంచి జిల్లాకు వచ్చేవారిపై దృష్టి పెట్టాలన్నారు. ఇతర దేశాల నుంచి జిల్లాకు ఐదుగురు వచ్చినట్లు గుర్తించామన్నారు. వీరికి పరీక్షలు చేయగా ముగ్గురికి నెగిటివ్‌ వచ్చిందన్నారు. అవసరం మేరకు గ్రామ స్థాయిలో ఐసోలేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్థాయిలో 104 కాల్‌ సెంటర్‌ను కొనసాగించాలన్నారు. మండల స్థాయిలో కూడా కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. 37 ఆస్పత్రుల్లో కొవిడ్‌ హెల్ప్‌డెస్క్‌లు, రైల్వే, బస్‌ స్టేషన్‌లలో హెల్ప్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. మందులను ఆస్పత్రుల్లో సిద్ధంగా ఉంచాలని వైద్యులను ఆదేశించారు. కరోనా పరీక్షలను ఎట్టిపరిస్థితుల్లో  ఆపరాదని.. రిమ్స్‌లో ఆక్సిజన్‌ నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వ్యాక్సిన్‌ రక్షణగా ఉంటుందని, ఈనెల 15 నాటికి కనీసం మొదటి డోసును అందరూ వేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాసులు, ఐటీడీఏ పీవో నవ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T05:30:00+05:30 IST