నిర్వాసితుల్లో భయం..భయం

ABN , First Publish Date - 2020-10-01T06:18:31+05:30 IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గండికోట నిర్వాసితులు భయంభయంగా గడుపుతున్నారు. ఇప్పటికే గండికోట జలాశయంలో 16.2 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో పరిహారం అందని నిర్వాసితుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా తాళ్లప్రొద్దుటూరు, కొండాపురం గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది.

నిర్వాసితుల్లో భయం..భయం

 జోరుగా కురుస్తున్న వర్షం.. 


కొండాపురం, సెప్టెంబరు 30 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గండికోట నిర్వాసితులు భయంభయంగా గడుపుతున్నారు. ఇప్పటికే గండికోట జలాశయంలో 16.2 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో పరిహారం అందని నిర్వాసితుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా తాళ్లప్రొద్దుటూరు, కొండాపురం గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. వర్షంతో పెన్నా, చిత్రావతి నదులతో పాటు వాగులు వంకల్లోకి నీరు చేరి అనూహ్యంగా ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది.


దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే తాళ్లప్రొద్దుటూరు బీసీ, ఎస్సీ కాలనీల్లో, కొండాపురం రామచంద్రనగర్‌లోనూ గండికోట బ్యాక్‌వాటర్‌ ఇళ్లలోకి చేరింది. జోరుగా వర్షం కురుస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరగకుండా చూడాలని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు.


కనీసం రెండేళ్లు గడువు ఇవ్వాలి

ఇళ్లు కట్టుకోవడానికి కనీసం రెండేళ్లు గడువు ఇవ్వాలని తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. 28వ రోజైన బుధవారం తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితుల ఆందోళన కొనసాగింది. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం కటాఫ్‌ డేట్‌ పెంచిన విధంగానే ప్రస్తుత ప్రభుత్వం ఫేజ్‌-2 గ్రామాలకు 31 డిసెంబర్‌ 2020 వరకు పెంచాలని డిమాండ్‌ చేశారు.


వెలిగొండ నిర్వాసితులకు ఇస్తున్న పునరావాస ప్యాకేజీని తమకూ వర్తింప జేయాలని, నీళ్లను 12 టీఎంసీల లోపే నిల్వ చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచు నరసింహారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చాంద్‌బాషా సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌బాబు, తులశమ్మ తదితరులు పాల్గొన్నారు.


గండికోటలో 16.2 టీఎంసీల నీరు

గండికోట ప్రాజెక్టులో ప్రస్తుతం 16.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో గండికోట నుంచి మైలవరం జలాశయానికి 8700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు జీఎన్‌ఎ్‌సఎస్‌ ఈఈ రామాంజనేయులు తెలిపారు. ప్రస్తుతం అవుకు రిజర్వాయర్‌ నుంచి వస్తున్న నీటి ప్రవాహం 5,800 క్యూసెక్కులు ఉండగా, వరదనీటి ద్వారా మరో 4200 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు ఈఈ తెలిపారు. ఇందులో జీఎన్‌ఎ్‌సఎస్‌ మెయిన్‌ కెనాల్‌కు 400 క్యూసెక్కులు, పైడిపాళెం రిజర్వాయర్‌కు 880 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ఈఈ తెలిపారు.

Updated Date - 2020-10-01T06:18:31+05:30 IST