కస్టమ్‌ మిల్లింగ్‌పై కరోనా కాటు

ABN , First Publish Date - 2020-07-09T10:40:53+05:30 IST

ఏలూరు పరిధిలో ఓ మిల్లర్‌కు ప్రతిరోజు 120 టన్నుల కస్టమ్‌ మిల్లింగ్‌ ఇచ్చే సామర్థ్యం ఉంది. కరోనా కారణంగా 60 వేల టన్నులు మాత్రమే

కస్టమ్‌ మిల్లింగ్‌పై కరోనా కాటు

హమాలీల కొరత

ఇతర రాష్ర్టాల నుంచి తెచ్చేందుకు

భయపడుతున్న మిలర్లు

రోజుకు ఆరువేల టన్నులే మిల్లింగ్‌..

పౌర సరఫరాల కార్పొరేషన్‌ సేకరణ

ఎఫ్‌సీఐకి నిలుపుదల 


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): ఏలూరు పరిధిలో ఓ మిల్లర్‌కు ప్రతిరోజు 120 టన్నుల కస్టమ్‌ మిల్లింగ్‌ ఇచ్చే సామర్థ్యం ఉంది. కరోనా కారణంగా 60 వేల టన్నులు మాత్రమే ఇవ్వగలు గుతున్నారు. రెడ్‌జోన్‌ పరిధిలో ఉండే హమాలీలు పనులకు రావడం లేదు. లాక్‌డౌన్‌ సమయంలో ఇతర రాష్ర్టాలకు చెందిన హమా లీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. వారిని రప్పించాలంటే కరోనా భయం వెంటా డుతోంది. ఆ ప్రభావం మిల్లింగ్‌పై పడింది. దాంతో బియ్యాన్ని సక్రమంగా అప్పగించలేకపోతున్నామంటూ సదరు మిల్లరు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని అనేకమంది మిల్లర్లకు ఇప్పుడు ఇదే సమస్య ఎదురవుతోంది. కస్టమ్‌ మిల్లింగ్‌కు కరోనా కష్టాలు వెంటాడు తున్నాయి. అనుకున్న స్థాయిలో బియ్యాన్ని అప్పగించేందుకు మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు. ఉచిత రేషన్‌ అందించేందుకు జిల్లాలో రబీ బియ్యాన్ని  పౌరసరఫరాల కార్పొరేషన్‌ పూర్తిస్థాయిలో సేకరిస్తోంది.


మిల్లర్లుకు ప్రతిరోజు 10వేల టన్నుల బియ్యాన్ని అప్పగించే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 6 వేల టన్నుల బియ్యాన్ని మాత్రమే అప్పగిస్తున్నారు. రబీ సీజన్‌లో ఉత్పత్తి అయిన బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు అప్పగించినప్పుడు ఇబ్బం దులు పడ్డారు. గోదాములు  కొరత ఉండడంతో ఎఫ్‌సీఐ సకాలంలో బియ్యాన్ని సేకరించలేకపోయింది, తాజాగా పౌరసరఫరాల కార్పొరేషన్‌ బియ్యాన్ని తీసుకుం టోంది. నవంబర్‌ నెల వరకు ఉచిత రేషన్‌ అందజేయ నుండడంతో రాష్ట్ర అవసరాల కోసం పౌర సరఫరాల కార్పొరేషన్‌ రబీ బియ్యం మొత్తాన్ని సేకరించేందుకు సిద్ధపడింది. ఎఫ్‌సీఐకి నిలిపివేసింది.జిల్లాలో పౌరసరఫరాల కార్పొరేషన్‌ 12.20 లక్షల టన్నుల ధాన్యాన్ని రబీలో కొనుగోలు చేసింది.కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం మిల్లర్లకు అప్పగిం చింది. దాదాపు 8 లక్షల టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల కార్పొరేషన్‌కు మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. ఆచితూచి ఇప్పటిదాకా 4 లక్షల టన్నుల బియ్యాన్ని ఇవ్వగలిగారు. హమాలీల సమస్యతో పలువురు మిల్లర్లు బియ్యాన్ని అప్పగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. 


రూ. 80 కోట్లు బకాయిలు

ఒకవైపు కరోనా సమస్యలు వెంటాడుతుంటే మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.80 కోట్లు మేర మిల్లర్లకు చెల్లించాల్సి ఉంది. తొలుత రైతుల బకాయిలు తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాతే మిల్లర్ల బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మరో రూ.91 కోట్లు రైతులకు జమ చేయాల్సి ఉంది. అప్పటిదాకా మిల్లర్లు ఎదరు చూసే పరిస్థితి.  

Updated Date - 2020-07-09T10:40:53+05:30 IST