దాడుల భయంతో Kashmir Valleyని వీడుతున్న పండిట్లు

ABN , First Publish Date - 2021-10-09T19:53:47+05:30 IST

జమ్మూ-కశ్మీరులో మైనారిటీలైన హిందువులు, సిక్కులను లక్ష్యంగా

దాడుల భయంతో  Kashmir Valleyని వీడుతున్న పండిట్లు

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులో మైనారిటీలైన హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరుగుతుండటంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. కశ్మీరు లోయ నుంచి వెళ్ళిపోయేందుకు హిందువులు, సిక్కులు సిద్ధమవుతున్నారు. కొన్ని కశ్మీరీ పండిట్ కుటుంబాలు శుక్రవారం లోయ నుంచి ఇతర ప్రాంతాలకు వలస పోయాయి. 


గతంలో ఉగ్రవాద దాడుల భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన కశ్మీరీ పండిట్లను తిరిగి తీసుకొచ్చేందుకు బుడ్గాం జిల్లాలోని షేక్‌పొరలో 2003లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కశ్మీరు లోయకు తిరిగి వచ్చిన పండిట్ల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో తమ జీవితాలను చక్కదిద్దుకోగలమని వీరంతా ఆశించారు. కానీ తాజా ఉగ్రవాద దాడులతో ఈ ప్రాంతం నుంచి పదుల సంఖ్యలో కశ్మీరీ పండిట్ కుటుంబాలు శుక్రవారం వలస వెళ్ళిపోయాయి. 


పాకిస్థాన్ మద్దతుగల తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి కశ్మీరు లోయలో ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్లు, సిక్కులను హత్య చేస్తున్నారు. గురువారం శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో ఓ పాఠశాలలోకి చొరబడి ప్రిన్సిపాల్‌ను, ఓ టీచర్‌ను కాల్చి చంపారు. అంతకుముందు వారు ఈ పాఠశాలలో పనిచేసేవారి గుర్తింపు పత్రాలను పరిశీలించి, ఈ హత్యలకు పాల్పడ్డారని మరొక టీచర్ మీడియాకు చెప్పారు. మంగళ, బుధవారాల్లో కూడా ఉగ్రవాద దాడులు జరిగాయి. 


ఈ హత్యాంకాండ నేపథ్యంలో తాము కాలనీ నుంచి బయటకు అడుగు పెట్టలేకపోతున్నామని కశ్మీరీ పండిట్లు చెప్తున్నారు. కాలనీలో తగిన భద్రత ఉంటోందని, అయితే అన్ని వేళలా ఇళ్లలోనే ఉండటం సాధ్యం కాదని, కార్యాలయాలకు వెళ్ళవలసి ఉంటుందని, ఉగ్రవాదులు ఎప్పుడు విరుచుకుపడతారోనని భయంగా ఉందని చెప్తున్నారు. 


కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి ప్రెసిడెంట్ సంజయ్ టికు మీడియాతో మాట్లాడుతూ, బుడ్గాం, అనంత్‌నాగ్, పుల్వామా తదితర ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది కశ్మీరీ పండిట్లు వలస పోతున్నారని చెప్పారు. 1990నాటి దుస్థితి మళ్ళీ వచ్చిందన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు తమ గోడు వినిపించేందుకు జూన్‌లో అపాయింట్‌మెంట్ అడిగామని, ఇప్పటి వరకు తమకు అపాయింట్‌మెంట్ దొరకలేదని చెప్పారు. 


Updated Date - 2021-10-09T19:53:47+05:30 IST