భయం భయంగా బడికి!

ABN , First Publish Date - 2021-08-17T07:26:45+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపఽథ్యంలో ఏప్రిల్‌లో మూతపడిన పాఠశాలలను దాదాపు నాలుగునెలల తర్వాత సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి.

భయం భయంగా బడికి!

నగర పాలక స్కూళ్లకు 44శాతం హాజరు

ప్రైవేటు విద్యాలయాల్లో పెద్దగా కానరాని విద్యార్థులు


తిరుపతి(విద్య), ఆగస్టు 16: కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఏప్రిల్‌లో మూతపడిన పాఠశాలలను దాదాపు నాలుగునెలల తర్వాత సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం తరగతులు శానిటైజ్‌.. థర్మల్‌స్కాన్‌ చేసి విద్యార్థులను అనుమతించేలా చర్యలు చేపట్టారు. భౌతికదూరంతోపాటు అందరూ మాస్కులు ధరించేలా చూశారు. అయినా ఇప్పటికీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కొవిడ్‌ భయాందోళనలు తొలగలేదు. తొలిరోజు భయం..భయంగానే బడివైపు అడుగులేశారు. తిరుపతిలోని 44 నగరపాలక పాఠశాలల్లో 7,266 మందికిగాను 3,204 మంది విద్యార్థులు (44శాతం) హాజరయ్యారు. ఇక, తిరుపతి అర్బన్‌ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంగళవారం ఉదయం 9.30గంటలకు బైరాగిపట్టెడలోని ఎంజీఎం ఉన్నత పాఠశాల ఆవరణలో జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేయనున్నారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, మేయర్‌ డాక్టర్‌ శిరీష పాల్గొననున్నారు. 

నగరంలో సింహభాగం ఉన్న ప్రైవేట్‌ స్కూళ్లలో తొలిరోజు పదులసంఖ్యలో మాత్రమే విద్యార్థులు హాజరైనట్టు సమాచారం. తిథి ప్రకారం సోమవారం రోజు బాగాలేదన్న కారణంతో కొన్ని ప్రైవేట్‌స్కూళ్ల యాజమాన్యాలు బుధవారం పునఃప్రారంభించేలా సన్నద్ధమైనట్లు సమాచారం. దశలవారీగా వారంపాటు తొమ్మిదినుంచి పదితరగతులు, మరోవారం తర్వాత ఆరునుంచి ఎనిమిది తరగతులు నిర్వహించి.. ఈలోపు ఎలాంటి ఇబ్బందులు లేకపోతే ప్రాథమిక తరగతులు కొనసాగించాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది. నగరంలో కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు రెండుమూడురోజుల ముందే ఉన్నత తరగతులకు నామమాత్రంగా రోజూ ఒకట్రెండుగంటలు తరగతులు నిర్వహించారు. అయినా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి పెద్దగా స్పందన కనబడడంలేదని వారు పేర్కొంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు మరీ ఫోన్లు చేసి మీ పిల్లలను పంపుతారా లేదా ఆన్‌లైన్‌ ప్రిఫర్‌ చేస్తారా అనిఅడుగగా సగం మందికిపైగా ఆన్‌లైన్‌ అంటుండడం ప్రైవేట్‌ యాజమాన్యాలను ఆందోళనకు గురిచేస్తోంది. సగంమందికి ఆఫ్‌లైన్‌ తరగతులు.. మరో సగం మందికి ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ కష్టంగా మారుతుందన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. కొవిడ్‌తో ఇప్పటికే ఏడాదిన్నరగా పాఠశాలల నిర్వహణ భారంగా మారిందని, అప్పులు తెచ్చి నిర్వహణ, భవనాల అద్దెతోపాటు టీచర్లకు అంతో ఇంతో జీతాలుగా ఇస్తున్నామని వారంటున్నారు. దాదాపు ఏడాదిన్నరకుపైగా జీతాలు లేకుండా, ఉన్నా చాలీచాలని జీతాలతో కుటుంబాలు నెట్టుకొస్తున్న ప్రైవేట్‌ టీచర్లకు పాఠశాలల పునఃప్రారంభం కొంత ఊరటనిచ్చినా.. విద్యార్థులు నేరుగా తరగతులకు హాజరైతే గానీ వారి పూర్తిజీతాలు అందుకోలేని పరిస్థితి ఉంది. 

జిల్లాలోని జూనియర్‌ కళాశాలల్ని కూడా సోమవారం పునఃప్రారంభించారు. తిరుపతిలో పలు ప్రైవేట్‌ కళాశాలలో విద్యార్థులు ఎక్కువసంఖ్యలో హాజరైనట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ కళాశాలలను అధికారికంగా ప్రారంభించినా.. బుధవారం నుంచి తరగతులు కొనసాగించాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది. 

Updated Date - 2021-08-17T07:26:45+05:30 IST