జ్వరాల పీడ!

ABN , First Publish Date - 2021-09-08T06:48:46+05:30 IST

జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఓవైపు కరోనా పీడిస్తుండగా, డెంగ్యూ, మలేరియా దీనికి తోడైంది. సీజనల్‌ జ్వరాల సంగతి ఇక చెప్పక్కర్లేదు.

జ్వరాల పీడ!

జిల్లాలో విజృంభిస్తున్న డెంగ్యూ, సీజనల్‌ ఫీవర్లు 8 ఏజెన్సీలో మలేరియా

అధికారిక లెక్కల్లో 181 మందికి డెంగ్యూ, 80 మందికి మలేరియా

అనధికారికంగా వేలల్లోనే జ్వరపీడితులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఓవైపు కరోనా పీడిస్తుండగా, డెంగ్యూ, మలేరియా దీనికి తోడైంది. సీజనల్‌ జ్వరాల సంగతి ఇక చెప్పక్కర్లేదు. వాటి సం ఖ్య వేలల్లోనే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే జిల్లాలో 181 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అందులో రాజమహేంద్రవరం డివిజన్‌లో 28 డెంగ్యూ కేసులు ఉన్నాయి. ఇక 80 మంది మలేరియా బారిన పడ్డారు. ఇందులో ఎక్కువ ఏజెన్సీలో నమోదు కాగా, ఒకటో రెండో మైదాన ప్రాంతంలో ఉన్నాయి. ఈ లెక్కల్లోకి రాని జ్వరాల బాధితులు వేలల్లోనే ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేటు ఆసుపత్రులన్నీ నిత్యం కిటకిటలాడుతున్నా యి. ప్రాణాపాయ స్థితికి చేరి మరణించిన వారూ ఉన్నారు. జిల్లాలో డెంగ్యూ, ఇతర సీజనల్‌ జ్వరాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇటీవల వైద్యాధికారులతో సమీక్ష చేశారు. పెరుగుతున్న జ్వరపీడితుల కేసులపై ఆందోళన వ్యక్తంచేస్తూ కొందరు అధికారులపైనా సీరియస్‌ అయ్యారు. వైద్యాధికారుల్లో అంత గా చలనం కనిపించడం లేదు. కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ఇటీ వల ఏజెన్సీలో దోమలు తెరలు పంపిణీ చేశామని, డెంగ్యూ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నందున చికిత్స సమస్యలేదన్నట్టు వైద్యాఽధికారులు చెబుతున్నట్టు సమాచారం. అయితే ప్రజలు మా త్రం ప్రస్తుత జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వాన, అటు ఎండ అన్నట్టు వాతావరణం ఉండడం వల్ల సీజనల్‌ జ్వరాలు మరింత పెరుగుతున్నట్టు చెబుతున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పలువురు వైద్యులు, సిబ్బంది కూడా సీజనల్‌ జ్వరాలతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది. ప్రజలు మంచినీళ్లను కాచి చల్లార్చుకుని తాగాలని, వర్షం నీటిలో ఎక్కువగా తడవకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

డెంగ్యూతో వెలుగు ఇన్‌చార్జి ఏపీఎంమృతి 

వరరామచంద్రపురం, సెప్టెంబరు 7: అనారోగ్యంతో వీఆర్‌ పురం వెలుగు ఇన్‌చార్జి ఏపీఎం బుర్రి కిరణ్‌(33) డెంగ్యూ జ్వరంతో మృతి చెందారు. వారం రోజులుగా ఆయన డెంగ్యూ జ్వరంతో బాధపడుతుండగా చింతూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడ నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల  వెలుగు సిబ్బంది సంతాపం వ్యక్తంచేసి ఆయన కుటుంబా నికి సానుభూతి తెలిపారు.



Updated Date - 2021-09-08T06:48:46+05:30 IST