వింటర్ మంచుపై వివేకానందుడు... మనోజ్ ఆవిష్కరించిన మనోజ్ఞ దృశ్యం

ABN , First Publish Date - 2022-01-19T00:16:35+05:30 IST

నిజామాబాద్ వినాయక్ నగర్‌లోని బస్వా గార్డెన్స్‌‌లో తెల్లవారుజామున గడ్డిపై పడిన మంచునే కాన్వాస్‌గా మలుచుకుని... వివేకానందుడి విరాట్ రూపాన్ని ఆవిష్కరించారు.

వింటర్ మంచుపై వివేకానందుడు... మనోజ్ ఆవిష్కరించిన మనోజ్ఞ దృశ్యం

హైదరాబాద్: ఫిబ్రవరి 13ను తెలంగాణ ప్రభుత్వం వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, హైదరాబాద్ యువత చేస్తున్న క్యాంపెయిన్‌కు మద్దతుగా శాండ్ ఆర్టిస్ట్ కంచీపురం మనోజ్‌కుమార్ మనోజ్ఞ దృశ్యాన్ని ఆవిష్కరించారు. నిజామాబాద్ వినాయక్ నగర్‌లోని బస్వా గార్డెన్స్‌‌లో తెల్లవారుజామున గడ్డిపై పడిన మంచునే కాన్వాస్‌గా మలుచుకుని... వివేకానందుడి విరాట్ రూపాన్ని ఆవిష్కరించారు. అర ఎకరానికి పైగా ఉన్న గడ్డిపై పరుచుకున్న మంచును సృజనాత్మకంగా తీర్చిదిద్దుతూ స్వామీజీ రూపాన్ని సాకారం చేయటమే కాక ఫిబ్రవరి 13(వివేకానంద డే)కు మద్దతు ప్రకటిస్తున్నట్లు గీసి చూపారు. 


జాతీయ యువజన దినోత్సవమైన జనవరి 12వ తేదీన కూడా మనోజ్ దోమల్‌గూడలోని రామకృష్ణ మఠం ‘వీఐహెచ్‌ఈ‌’ ఆడిటోరియంలో ఫిబ్రవరి 13కు మద్దతుగా అద్భుతమైన శాండ్ ఆర్ట్ ప్రదర్శించారు. స్వామి వివేకానంద హైదరాబాద్‌లో పర్యటించి సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ప్రసంగించిన చారిత్రక ఫిబ్రవరి 13వ తేదీని ‘వివేకానంద డే’గా గుర్తించాలని మనోజ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. 



Updated Date - 2022-01-19T00:16:35+05:30 IST