పిల్లిమొగ్గల పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంటా?

ABN , First Publish Date - 2020-02-20T09:07:19+05:30 IST

పుల్వామా దాడి జరిగి ఏడాది గడచిన సందర్భంగా, మృతవీరులకు నివాళి అర్పించే బదులు, పోనీ, మరణించిన సైనికుల కుటుంబాలకు వాగ్దానం చేసిన సహాయాలు అందాయో లేదో తెలుసుకునే బదులు, రాహుల్‌గాంధీ ఒక పెడసరపు వ్యాఖ్య చేశారు. పుల్వామా దాడి...

పిల్లిమొగ్గల పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంటా?

ఉద్వేగపూరిత మనోభావాల పునాదుల మీద, సైద్ధాంతిక లక్ష్యాలతో గట్టి సౌధాన్ని నిర్మించుకున్న బిజెపికి బలమైన ప్రత్యర్థిశిబిరం సమకూరడం సులువు కాదు. జాతీయనేత డీలా పడుతున్నప్పుడు, ప్రాంతీయ పార్టీలకు సొంతంగా ఆ శక్తి ఉన్నదా? 


ప్రాంతీయపార్టీల చక్రానికి ఏదో ఒక జాతీయపక్షం ఇరుసుగా ఉండాలి. ఇప్పటికే, ఓటర్లు జాతీయ ఎన్నికలకు, రాష్ట్ర ఎన్నికలకు భిన్నంగా స్పందించడం అలవరుచుకున్నారేమోనన్న అనుమానం కలుగుతోంది. ప్రాంతీయపార్టీల కూటమికి జాతీయపక్షం నేతృత్వం వహించకపోతే, ఇప్పుడున్న కేంద్రనాయకత్వానికి ఎదురే ఉండదు. ప్రాంతీయ స్థాయి నాయకులకు మోదీ ఎట్లా ప్రత్యామ్నాయం కారో, జాతీయస్థాయిలో మోదీకి ప్రాంతీయ నాయకులు ప్రత్యామ్నాయం కాలేరు.


పుల్వామా దాడి జరిగి ఏడాది గడచిన సందర్భంగా, మృతవీరులకు నివాళి అర్పించే బదులు, పోనీ, మరణించిన సైనికుల కుటుంబాలకు వాగ్దానం చేసిన సహాయాలు అందాయో లేదో తెలుసుకునే బదులు, రాహుల్‌గాంధీ ఒక పెడసరపు వ్యాఖ్య చేశారు. పుల్వామా దాడి లబ్ధిదారులెవరు?- అని ఆ వ్యాఖ్యలో ప్రశ్నించారు. పుల్వామా దాడి లాగానే ఆ ప్రశ్న కూడా రాహుల్‌కు చాలా నష్టం చేసింది. సమయం సందర్భం చూసుకుని మాట్లాడాలని, ఔచిత్యం లేని మాటలు అధికప్రసంగాలు అవుతాయని పెద్దలు అందుకే అంటారు. రాహుల్‌గాంధీ తన వ్యాఖ్య ద్వారా ఏమి స్ఫురింపజేయదలచుకున్నారో అందరికీ అర్థమవుతూనే ఉన్నది. మనకు స్ఫురించే ఆరోపణ, నిజమా కాదా ఇక్కడ అనవసరం. నిజమే అయినప్పటికీ, ఆ నిజాన్ని స్వీకరించి స్పందించే స్థితిలో భారతీయ ఓటర్లు లేరు అన్నది రాహుల్‌గాంధీకి తెలిసి ఉండాలి. ఎవరో ఒకాయన అడిగాడు కూడా, 2008లో బొంబాయి దాడులు జరిగాయి, 2009లో యుపిఎ గెలిచింది, రెంటికీ ముడిపెట్టి చూడాలా? అని. బిజెపివారిని నిలదీస్తే, కాంగ్రెస్‌ మీద ఎదురు ప్రశ్న సంధించడం- సమాధానం కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం, దేశభద్రతను తాకట్టు పెట్టడం, లేదా, ఉగ్రవాదుల సాయం తీసుకోవడం, లేదా స్వయంగా నకిలీ దాడులు జరపడం- ప్రపంచంలో లేనిదేమీ కాదు. భారతదేశంలో కూడా అటువంటి ధోరణి ఉన్నదా, మన రాజకీయపార్టీలు ఆ స్థితికి దిగజారాయా, దిగజారినా ఆ విషయం విశ్వసించడానికి సమాజం సిద్ధంగా ఉన్నదా- అన్నవి ప్రశ్నలు. 


ఇంటిలోని సమస్యలకు పొరుగును నిందించడం ఎప్పటి నుంచో ఉన్నది. అదే సమయంలో ఇరుగు దేశాలలో చిచ్చుపెట్టడం పొరుగుకు కూడా పాత విషయమే. దేశంలో తనపై అసంతృప్తి పెరగడాన్ని జీర్ణించుకోలేని ఇందిరాగాంధీ తరచు విదేశీహస్తాన్ని ప్రస్తావించేవారు. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ నాయకత్వంలో జరిగిన ప్రజాందోళనను కూడా ఆమె విదేశీకుట్రగా వ్యాఖ్యానించారు. జెపిని సిఐఎ ఏజెంటు అని నిందించడం కూడా ఆ రోజుల్లో జరిగింది. నక్సలైట్లను కూడా నిక్సనైట్లు అని ఆరోపించినవారున్నారు. బంగ్లాదేశ్‌ యుద్ధం, పోఖ్రాన్‌ అణుపరీక్ష వంటివి దేశానికి ఎంతో కీలకమైనవి, ఆవశ్యకమైనవి అయినప్పటికీ, వాటి నిర్ణయం వెనుక ఇందిరకు తన ప్రతిష్ఠను, జనాదరణను పెంచుకునే రాజకీయ ఉద్దేశ్యం కూడా ఉన్నదని పరిశీలకులు భావించేవారు. ఎమర్జెన్సీ అనంతరం ఇందిరాగాంధీలో అనేక మార్పులు వచ్చాయి. ప్రతిదానికీ అమెరికాను నిందించే ఆనవాయితీ మానేసి, పొరుగుదేశంపైనే ఆరోపణలు సంధించడం మొదలుపెట్టారు. ఖలిస్థాన్‌ తీవ్రవాదం, కశ్మీర్‌ సమస్యల విషయంలో పాకిస్థాన్‌తో ఏదో విధమైన లంకె ఉండడంతో, ఆ దేశమే మనకు ప్రతినాయక దేశంగా స్థిరపడిపోయింది. ఇటీవలి దశాబ్దాలలోని ఉగ్రవాదచర్యల విషయంలోనూ పాకిస్థాన్‌ ప్రమేయం లేదా పాకిస్థాన్‌ భూభాగంలోని శక్తుల ప్రమేయం ఉంటూనే వస్తోంది. హింసాత్మక, ఉగ్రవాద సంఘటనలు అనేకం వీడని ముడులుగా, అనుమానాస్పదంగా మిగిలిపోయిన మాట నిజమే. కొన్ని సార్లు వివిధ భద్రతా ఏజెన్సీల పాత్ర కూడా చర్చనీయాంశం అవుతుంది. కానీ, ఆ అంశాలు ప్రధాన రాజకీయ వేదిక మీదకి రావడానికి ఇంకా సమయం రాలేదు. ప్రజానీకంలో కొన్ని విషయాల మీద గాఢమైన విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని నిరంతరం పెంచిపోషించే ప్రక్రియలూ ఉంటాయి. 


వాస్తవం ఏదయినా, పరిణతి చెందిన రాజకీయ నాయకుడు రాహుల్‌ గాంధీ వలె వ్యాఖ్యానించడు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ గెలవడం వల్ల, ఎంతో కొంత ఉత్సాహపడిన బిజెపియేతర శ్రేణులు ఎదగడానికి ఇంకా మొరాయిస్తూనే ఉన్న రాహుల్‌ను చూసి నిరుత్సాహం చెందాయి. సరే, ‘ఆప్‌’ ఒక మార్గాన్ని చూపిస్తోంది. ప్రాంతీయపార్టీలు అన్నీ కలిసి జాతీయపక్షం తోడు లేకుండా నిలబడగలవా? నెగ్గగలవా? అన్నది ప్రశ్న. ఢిల్లీ ఫలితాలు రాగానే, ఆశ్చర్యకరంగా తెలంగాణ నుంచి స్పందన వచ్చింది. ఫెడరలిజం అన్న మాటకు మళ్లీ చెలామణి వచ్చింది. చిన్నచిన్న పార్టీలన్నిటిని ఒక్క తాటి మీదకు తెచ్చి, ఢిల్లీ గద్దెను కెసిఆర్‌ చేజిక్కించుకోగలరని ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు. పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగడం వెనుక, జాతీయ ఆకాంక్షలకు రెక్కలు రావడం కూడా ఒక కారణమని అంటున్నారు. 


ఆప్‌ గెలుపుతో జాతీయప్రతిపక్ష శిబిరాలు సంతోషించడంతో పాటు, బిజెపి నేతలు బాగా డీలాపడడం కూడా స్పష్టంగా కనిపించింది. అయితే, సంబరం, కలవరం ఎంతో కాలం నిలవలేదు. స్నేహ హస్తం చాచి, అభివృద్ధికి సహకరించమని కేజ్రీవాల్‌ మోదీని అడగడం ఒక లాంఛనమే అనుకున్నా, వెనువెంటనే ఆయన నుంచి జాతీయ కార్యాచరణ ఏదీ ఉండదనే సూచన కూడా అందులో ఉన్నది. స్వచర్మ రక్షణార్థమే అయినప్పటికీ, వైఎస్‌ఆర్‌ సీపీ ఎన్‌డిఎలో చేరతానని ఉబలాటపడడం- బిజెపికి ఉన్న అదనపు అవకాశాలను సూచిస్తున్నది. మరోవైపు, కాంగ్రెస్‌, ఎన్‌సిపి మద్దతుతో అధికారంలో ఉన్న ఉద్ధవ్‌ ఠాక్రే, బిజెపి విరహాన్ని భరించలేకపోతున్నాడు. కాబట్టి, ఢిల్లీ దెబ్బ తరువాత బిజెపికి కలసివస్తున్నఅంశాలు కూడా ఉంటున్నాయి. 


ఉద్వేగపూరిత మనోభావాల పునాదుల మీద, సైద్ధాంతిక లక్ష్యాలతో గట్టి సౌధాన్ని నిర్మించుకున్న బిజెపికి బలమైన ప్రత్యర్థిశిబిరం సమకూరడం సులువు కాదు. జాతీయనేత డీలా పడుతున్నప్పుడు, ప్రాంతీయ పార్టీలకు సొంతంగా ఆ శక్తి ఉన్నదా? ప్రాంతీయపార్టీలు ఏర్పడిన సమయాన్ని, సందర్భాన్ని గౌరవించవలసిందే కానీ, అవి ప్రస్తుతమైతే ఎటువంటి జాతీయ విధానాన్నీ, అవగాహననీ కలిగిలేవనే చెప్పాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే, జాతీయ వ్యవహారాలలో ప్రాంతీయపార్టీల వైఖరి అవకాశవాదంతో కూడి ఉంటున్నది. జాతీయస్థాయిలో బలాబలాల సమీకరణలో, తమ బలంతో తాము బేరాలు ఆడగలమని, ఒత్తిళ్లు తేగలమని, లేదా తమ బలాన్ని అమ్ముకోగలమని అనుకుంటున్నాయే తప్ప, తమకంటూ సొంత విధానాలు ఆ పార్టీలకు లేవు. ఉన్నపార్టీలలో డిఎంకె కాసింత మెరుగుగా కనిపిస్తుంది కానీ, తమ భావజాలానికి పూర్తి భిన్నమైన బిజెపితో గతంలో కలసి నడిచిన చరిత్ర దానికి కూడా ఉన్నది. కాంగ్రెస్‌ ప్రయోగించిన ఆర్టికల్‌ 356కు బాధితురాలు ఆ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్‌తో ఉన్నది సహజమైత్రిగా భావిస్తుంది. అయినప్పటికీ, జాతీయ అంశాలపై సొంతంగా తనకంటూ ఒక వైఖరిని ప్రకటించడమైనా ఆ పార్టీ చేయగలుగుతుంది. ప్రాంతీయపార్టీల అవకాశవాద వైఖరికి ఉదాహరణ కూడా డిఎంకె నుంచే తీసుకోవచ్చు. శ్రీలంక తమిళుల సమస్య- డిఎంకెకు ఎంతో కీలకమైనది, సున్నితమైనది. తాను భాగస్వామిగా ఉన్న కేంద్రప్రభుత్వం శ్రీలంకలో ఊచకోతకు మౌన సహాయం చేస్తుండగా, నిస్సహాయంగా మిగిలిపోయింది. 


అటువంటి ప్రాంతీయ పార్టీల నుంచి ఏమి ఆశించగలం? గాంధీ వైపా, గాడ్సే వైపా చెప్పు అని అడుగుతున్నాడు ప్రశాంత్‌ కిశోర్‌. నితీశ్‌ కుమార్‌కు ఇంకా సిద్ధాంతాలున్నాయా? రామమనోహర్‌ లోహియా, కర్పూరీ ఠాకూర్‌ల పేర్లు ఆయనకు గుర్తున్నాయా? సిఎఎ, ఎన్‌ఆర్‌సీ మీద ఇప్పుడు అభినందనీయమైన వైఖరి తీసుకున్న కెసిఆర్‌, గతంలో ఎన్ని సార్లు, ఎన్ని సందర్భాలలో కేంద్రానికి ఓటుసాయం చేయలేదు? నల్లచట్టాలను కూడా ఆయన పార్టీ ప్రశ్నించకుండా అంగీకరించింది. వీరందరికీ విదేశాంగం గురించి, రక్షణ గురించి, ఆర్థికాంశాల గురించి జాతీయస్థాయి వైఖరులేమైనా ఉన్నాయా? ఉన్నట్టు మనకు తెలుసునా? సిఎఎ గురించి వైఎస్‌ జగన్‌ ఏమి చేశారు, ఆయన మంత్రులు ఏమి మాట్లాడుతున్నారు? 


కాబట్టి, ప్రాంతీయపార్టీల చక్రానికి ఏదో ఒక జాతీయపక్షం ఇరుసుగా ఉండాలి. ఇప్పటికే, ఓటర్లు జాతీయ ఎన్నికలకు, రాష్ట్ర ఎన్నికలకు భిన్నంగా స్పందించడం అలవరుచుకున్నారేమోనన్న అనుమానం కలుగుతోంది. ప్రాంతీయపార్టీల కూటమికి జాతీయపక్షం నేతృత్వం వహించకపోతే, ఇప్పుడున్న కేంద్రనాయకత్వానికి ఎదురే ఉండదు. ప్రాంతీయ స్థాయి నాయకులకు మోదీ ఎట్లా ప్రత్యామ్నాయం కారో, జాతీయస్థాయిలో మోదీకి ప్రాంతీయనాయకులు ప్రత్యామ్నాయం కాలేరు. 


చిన్నతనం అనుకోకుండా, కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రశాంత్‌కిశోర్‌ను ఆశ్రయిస్తే, రాహుల్‌లో ఏమన్నా తేడా వస్తుందేమో? లేకపోతే, కాంగ్రెస్‌ నేతలు తెగించి, రాహుల్‌కు వీడ్కోలు చెప్పి కొత్తనేతను ఎన్నుకోవడం మరో మార్గం. మోదీ వంటి మేరువును ఎదుర్కొనడానికే కాదు, పిల్లిమొగ్గలు వేసే ప్రాంతీయనేతల చాతుర్యాన్ని తట్టుకోవడానికి కూడా ఒక పరిణతి చెందిన జాతీయనేత కావాలి. సాధ్యమా?

కె. శ్రీనివాస్

Updated Date - 2020-02-20T09:07:19+05:30 IST