నేనాడలేను...

ABN , First Publish Date - 2021-06-07T09:55:58+05:30 IST

స్విట్జర్లాండ్‌ దిగ్గజ ఆటగాడు రోజర్‌ ఫెడరర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌నుంచి వైదొలిగాడు. ఆదివారం మూడున్నర గంటలకుపైగా జరిగిన మూడో రౌండ్‌

నేనాడలేను...

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి ఫెడరర్‌ నిష్క్రమణ

విశ్రాంతి తీసుకొనేందుకేనని వెల్లడి


పారిస్‌: స్విట్జర్లాండ్‌ దిగ్గజ ఆటగాడు రోజర్‌ ఫెడరర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌నుంచి వైదొలిగాడు. ఆదివారం మూడున్నర గంటలకుపైగా జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌ అనంతరం తీవ్రంగా అలిసిపోయిన ఫెడరర్‌...తగిన విశ్రాంతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. ఈ మేరకు ఫ్రెంచ్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ఓ ప్రకటన వెలువరించింది. ‘రెండు మోకాలి శస్త్రచికిత్సలు, ఏడాదికిపైగా పునరావాసం అనంతరం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వేగంగా కోలుకొనేందుకు ఆరాట పడడంలేదు’ అని 20 గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్‌ ఫెడరర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. ‘రొలాండ్‌ గారో్‌సలో మూడు మ్యాచ్‌లు గెలుపొందడం థ్రిల్లింగ్‌గా ఉంది. కోర్టులో మళ్లీ అడుగుపెట్టడంకన్నా గొప్ప ఏముంటుంది’ అని ఆగస్టు 8న 40వ ఏట ప్రవేశించనున్న ఫెడెక్స్‌ వ్యాఖ్యానించాడు. 2020 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత అతడు పాల్గొంటున్న అతిపెద్ద టోర్నమెంట్‌ ఈ ఫ్రెంచ్‌ ఓపెనే. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత అతడి కుడి మోకాలికి రెండు ఆపరేషన్లు జరిగాయి. ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ముందు ఈ సీజన్‌లో రోజర్‌ కేవలం మూడు మ్యాచ్‌లే ఆడాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ రేసులో తాను లేనని గత నెలలోనే అతడు స్పష్టంజేశాడు. అంతకన్నా తనకెంతో ఇష్టమైన గ్రాస్‌కోర్టు స్లామ్‌ వింబుల్డన్‌ ట్రోఫీయే తన లక్ష్యమని ప్రకటించాడు. వింబుల్డన్‌ ఈనెల 28న ప్రారంభం కానుంది. అక్కడ టైటిల్‌ అందుకోవడం ద్వారా 21 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును చేరుకోవాలన్నది ఫెడరర్‌ లక్ష్యం. ఆ టోర్నీలో ఫెడరర్‌ రికార్డు స్థాయిలో 8సార్లు విజేతగా నిలవడం విశేషం. ఆదివారంనాటి ఫ్రెంచ్‌ ఓపెన్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ ఫెడరర్‌ 7-6 (5), 6-7 (3), 7-6 (4), 7-5తో డొమినక్‌ కోఫెర్‌ (జర్మనీని)ని ఓడించాడు. అయితే, ఫెడరర్‌ టోర్నీ నుంచి వైదొలగడంతో ప్రీక్వార్టర్స్‌లో అతనితో తలపడాల్సిన 9వ సీడ్‌ బెరెటినీ నేరుగా క్వార్టర్స్‌ చేరాడు. 


రొలాండ్‌ గారో్‌సలో ఇదే చివరిసారి..?

క్లేకోర్టు రొలాండ్‌ గారో్‌సలో ఇక ఫెడరర్‌ను చూసే దాదాపు లేనట్టే. మరో రెండునెలల్లో నాలుగు పదుల వయస్సుకు చేరనున్న అతడు వచ్చే ఏడాది వరకు ఆటలో కొనసాగడం అనుమానమే. వాస్తవంగా ఫెడరర్‌ రిటైర్మెంట్‌పై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. వయస్సు మీదపడడం, దానికితోడు వరుస సర్జరీలు ఫెడరర్‌ ఆటపై తీవ్ర ప్రభావం చూపాయి. అయితే 21వ గ్రాండ్‌స్లామ్‌ రికార్డుకు గురిపెట్టిన రోజర్‌ సర్జరీలు అయినప్పటినుంచి టోర్నీల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఏకైక ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను అతడు 2009లో గెలుచుకున్నాడు. 

Updated Date - 2021-06-07T09:55:58+05:30 IST