‘ఫీజు’ గోస

ABN , First Publish Date - 2021-11-25T14:59:25+05:30 IST

రాష్ట్రంలో..

‘ఫీజు’ గోస

పేరుకున్న బోధనా రుసుము, ఉపకార వేతనాల బకాయిలు

2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా పెండింగ్‌

మొత్తం రూ.3 వేల కోట్ల బకాయిలు 

3 నెలలకోసారి చెల్లింపు తూచ్‌.. నిరీక్షణలో 15 లక్షల మంది 

మంజూరుకు టోకెన్లు వచ్చినా.. ఖాతాలో జమ కాని నగదు


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బోధనా రుసుములు, ఉపకార వేతనాల బకాయిలు కుప్పలుగా పేరుకున్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వం సమయానికి నిధులు విడుదల చేయకపోవడంతో చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కోర్సు పూర్తి చేసుకుని మరో కోర్సు చదువుదామన్నా విద్యార్థులు ధ్రువపత్రాలు తీసుకోలేని పరిస్థితి ఉంది. ఉద్యోగంలో చేరుదామన్నా అడ్డంకి ఎదురవుతోంది. ఇక పిల్లల చదువుకు అప్పులు తెచ్చి ఫీజులు కట్టిన తల్లిదండ్రులు వడ్డీల భారం మోయలేక తల్లడిల్లుతున్నారు. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు సంక్షేమ శాఖ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మందిపైగా విద్యార్థులు సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్ష బోధన ప్రారంభంతో బకాయిలు చెల్లించాలని కళాశాలల నిర్వాహకులు వారిపై ఒత్తిడి తెస్తున్నారు.


కొవిడ్‌ దెబ్బ.. ఈ రెండు పథకాలపై

ఆర్థిక వ్యవస్థ మీద కొవిడ్‌ చూపిన ప్రభావం బోధనా రుసుములు, ఉపకార వేతనాలపై పడింది. 2019-20 విద్యాసంవత్సరానికి నిధులు పూర్తిగా ఇవ్వలేదు. 2020-21కి ఇంకా విడుదల కాలేదు. ఈ రెండేళ్లకు సంబంధించి వరుసగా రూ.767 కోట్లు, రూ.2250 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం రూ.3,017 కోట్లు బకాయిలున్నట్లు సంక్షేమ శాఖల లెక్కలు చెబుతున్నాయి. సంక్షేమ శాఖ అధికారులు బిల్లులు సిద్థం చేసినా ప్రభుత్వం నుంచి మంజూరు కరువైంది. ఫలితంగా విద్యార్థులకు ఉపకార వేతనాలు, కళాశాల యాజమాన్యాలకు బోధనా రుసుములు అందడం లేదు. దీంతో చిన్న కళాశాలల యాజమాన్యాలు ఆర్థికంగా తీవ్ర నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.


సర్టిఫికెట్లు పొందేందుకు కటకట

ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో.. విద్యార్థులు ఫీజులు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామని కళాశాలల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. ఉన్నత చదువులు, ఉద్యోగాల సమయంలో ధ్రువపత్రాలు తప్పనిసరి కావడంతో కొందరు విద్యార్ధుల తల్లిదండ్రులు అప్పులు తెచ్చి చెల్లించారు. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక తల్లడిల్లుతున్నారు. మరికొందరు విద్యార్థులు ఫీజు చెల్లించలేక, సర్టిఫికెట్లు చేతికి అందక పైచదువుల్లో చేరలేకపోతున్నారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న విద్యార్థులు ఫీజులు మొత్తం కడితేనే పరీక్షలకు అనుమతిస్తామని కళాశాలల నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ముందుగా బకాయి కడితే బోధనా రుసుము, ఉపకార వేతనం వచ్చిన తర్వాత తిరిగిచ్చేస్తామని చెబుతున్నారు. పిల్లల ఉన్నత విద్యకు ప్రభుత్వ పథకాలపైనే ఆధారపడ్డ పేద, మద్య తరగతి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.


ఖాతాలో జమ ఎన్నడు?

ఒకేసారి చెల్లింపులు భారంగా మారడంతో 3 నెలలకు ఒకసారి ఇస్తామని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసినా అమలులోకి రావడం లేదు. ప్రారంభంలో 25ు, మధ్యలో 50%, విద్యా సంవత్సరం ముగిసేనాటికి మిగతాది చెల్లించాల్సి ఉంది. కానీ, ఏకంగా రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. గత విద్యా సంవత్సరం ముగిసి నెలలు గడిచినా మంజూరు ఊసే లేదు. మరోవైపు బోధనా రుసుములు, ఉపకార వేతనాల మంజూరుకు ముందు విద్యార్థులకు టోకెన్లు ఇస్తారు. తర్వాత వారి బ్యాంకు ఖాతాలో నగదు జమవుతుంది. గత విద్యా సంవత్సరానికి టోకెన్లు ఇచ్చి రోజులు గడుస్తున్నా విద్యార్ధుల ఖాతాలో నగదు పడలేదు. అధికారులను అడిగితే త్వరలోనే వస్తాయని సమాధానం ఇస్తున్నారు. కాగా, 2020-21 విద్యా సంవత్సరంలో 12.85 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఆగస్టులో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై ఈ సంవత్సరం మే దాక కొనసాగింది. ఆపై నెలకు పరిశీలన మొదలు కావాలి. కానీ, కొవిడ్‌తో ప్రక్రియ ఆలస్యమైంది. 


పిల్లల చదవుకు తప్ప.. అన్నిటికీ నిధులున్నాయా?

కాళేశ్వరం ప్రాజెక్టు, సచివాలయం నిర్మాణానికి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం బోధనా రుసుములు, ఉపకార వేతనాల చెల్లింపులకు  సంవత్సరాలుగా నిధులివ్వడం లేదు. ఇతర వర్గాలకు మొత్తం ఫీజు చెల్లిస్తున్న ప్రభుత్వం బీసీ విద్యార్ధులకు మాత్రం ఇవ్వడం లేదు. దీనిపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవాలి.

-బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య


విద్యా సంస్థల మూత.. 

నిర్వహణ భారంతో ఎన్నో విద్యాసంస్థలు మూతపడ్డాయి. వేలాది మంది సిబ్బంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. విద్యార్ధులతో పాటు సిబ్బందికి ప్రయోజనకరంగా ఉన్న బోధనా రుసుముల పథకం సక్రమంగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. భారీగా పేరుకున్న బకాయిలను విడుదల చేయాలి.

- కేజీ టు పీజీ జేఏసీ కన్వీనర్‌ గౌరీ సతీష్‌



Updated Date - 2021-11-25T14:59:25+05:30 IST