ఫీ(డర్‌) కెనాల్‌

ABN , First Publish Date - 2021-07-30T05:15:18+05:30 IST

‘‘రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. త్వరితగతిన వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి మూడు జిల్లాల్లో సాగు, తాగు నీరు అందిస్తాం’’ ఇవి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ 2019 డిసెంబర్‌ 30న పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద టన్నెల్‌ పనులను పరిశీలించి చేసిన ప్రకటన. ఇదే ప్రకటనను జిల్లా స్థాయి అధికారులు పదేపదే పునరుద్ఘాటించారు. వాస్తవాలను పరిశీలిస్తే రాబోయే మూడేళ్లలో జలాశయానికి నీరు తీసుకురావడమనేది అసాధ్యంగా కనిపిస్తుంది.

ఫీ(డర్‌) కెనాల్‌
కడపరాజుపల్లె వద్ద పూడ్చని గండి

గతేడాది వర్షపు నీటికే కాల్వకు గండి 

పట్టించుకోని అధికారులు

ఇదీ వెలిగొండ ప్రాజెక్టు నీరు తరలించే కాలువ దుస్థితి


మార్కాపురం, జూలై 29 : ‘‘రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. త్వరితగతిన వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి మూడు జిల్లాల్లో సాగు, తాగు నీరు అందిస్తాం’’ ఇవి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ 2019 డిసెంబర్‌ 30న పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద టన్నెల్‌ పనులను పరిశీలించి చేసిన ప్రకటన. ఇదే ప్రకటనను జిల్లా స్థాయి అధికారులు పదేపదే పునరుద్ఘాటించారు. వాస్తవాలను పరిశీలిస్తే రాబోయే మూడేళ్లలో జలాశయానికి నీరు తీసుకురావడమనేది అసాధ్యంగా కనిపిస్తుంది. 

ఫీడర్‌ కెనాల్‌ పనుల పరిస్థితి

దోర్నాల మండలం కొత్తూరు వద్ద ప్రారంభమైన రెండు టన్నెళ్ల నుంచి జలాశయానికి నీరు చేరడానికి అనుసంధానంగా ఫీడర్‌ కెనాల్‌ను తవ్వుతున్నారు. ఈ ఫీడర్‌ కెనాల్‌ దోర్నాల మండలం కొత్తూరు నుంచి మార్కాపురం మం డలం గొట్టిపడియ వరకు సుమారు 24 కిలోమీటర్ల దూరం ఉంది. కెనాల్‌ తవ్వకం పనులు 2008లో ప్రారంభమైనప్పటకీ నేటికీ పూర్తి కాలేదు. కొన్నిచోట్ల ఒకవైపు కొండలు హ ద్దుగా, మరోవైపు మట్టితో కట్టలు నిర్మించారు. కొన్ని ప్రాం తాలలో రెండు వైపులా మట్టితో నిర్మాణం చేశారు. పలుచోట్ల యంత్రాలతో తవ్వకం పనులు సాధ్యం కాక నిలిపివేశారు. ఆ ప్రాంతాలలో మనుషులతో తవ్వించాల్సిఉంది. 

టన్నెల్‌ ద్వారా నీరు వస్తే

నల్లమలలో కురిసిన వర్షాలకు వచ్చిన నీటికే ఫీడర్‌ కెనాల్‌కు గండి పడింది. వర్షపు నీటి ఉధృతికే గండి పడిన ఫీడర్‌ కెనాల్‌ టన్నెళ్ల ద్వారా వచ్చే నీటి ఉధృతికి తట్టుకొని ఉంటుందా?  ఆ నీరు జలాశయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరఫరా కావడం సాధ్యమేనా? అన్న అంశాలు ప్రశ్నార్థకంగా మిగిలాయి. కెనాల్‌ పనులను ప్రారంభించిన ఎల్‌అండ్‌టీ కంపెనీ ఇప్పుడు పనులను నిలిపివేసింది.  


వర్షపు నీటికే కాల్వకు గండి.. నేటికీ అంతే

గత ఏడాది జూన్‌లో నల్లమలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఫీడర్‌ కెనాల్‌కు నీరు చేరింది. పనులు పూర్తయిన వరకూ ముందుకు ప్రవహించిన నీరు తర్వాత కాల్వల నిర్మా ణం జరగకపోవడంతో అక్కడ నీళ్లు నిలిచిపోయాయి. నల్లమల నుంచి చేరుతున్న నీటి ఉధృతికి ఫీడర్‌ కెనాల్‌కు దోర్నాల మం డలం కడపరాజుపల్లె వద్ద భారీ గండి పడింది. నేటికీ అధికారులు ఆ గండిని పూడ్చలేదు.


రూ.120 కోట్లతో సిమెంట్‌ అలైన్‌మెంట్‌ ప్రతిపాదన దశలోనే 

ఫీడర్‌ కెనాల్‌ వర్షపు నీటికే గండి పడటంతో నీటి పారుదల శాఖ అధికారులు కొత్తూరు నుంచి జలాశయం వరకూ సిమెంట్‌ అలైన్‌మెంట్‌ చేసి కాల్వను పటిష్టం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల అదేశాల మేరకు సిమెంట్‌ అలైన్‌మెంట్‌కు ప్రతిపాదనలు తయారు చేశారు. స్థానిక అధికారులు తయారు చేసిన అంచనాల మేరకు సిమెంట్‌ అలైన్‌మెంట్‌కు రూ.120 కోట్లు ఖర్చవుతుంది. ఇందుకు సంబంధించిన అంచనాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించారు. ఆ అంశం ప్రస్తుతం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. మరి ఉన్నతాధికారులు ప్రతిపాదనలను ఎప్పుడు పరిశీలించి, పచ్చజెండా ఊపుతారో వేచిచూడాలి. 

అలైన్‌మెంట్‌కు సంబంధించిన నిధులను ఎప్పుడు మంజూరు చేస్తారో? అలైన్‌మెంట్‌ పనులు ఎప్పుడు పూర్తవుతాయో? సమాధానాలు లేని ప్రశ్నలు. ప్రభుత్వం నిధులు మంజూరు  చేసి ఫీడర్‌ కెనాల్‌కు అలైన్‌మెంట్‌  పనులు చేయడానికి అధికారుల అంచనా ప్రకారం కనీసం రెండేళ్లు పడుతుంది. అలైన్‌మెంట్‌ చేయకుండా జలాశయానికి నీటిని సరఫరా చేయాలని భావించినా ఫీడర్‌ కెనాల్‌లో చాలా చోట్ల పనులు అర్ధంతరంగా ఆగిపోయి ఉన్నాయి.



Updated Date - 2021-07-30T05:15:18+05:30 IST