ఆయిల్‌ ఫాం వైపు అన్నదాతలు

ABN , First Publish Date - 2021-06-18T07:02:55+05:30 IST

ప్రతీయేటా రైతులు పత్తి, వరి, మొక్కజొన్న, సోయాబీన్‌ లాంటి పంటలనే పండిస్తూ ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు సాఽధిస్తున్నారు.

ఆయిల్‌ ఫాం వైపు అన్నదాతలు
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ ప్రాంతంలో సాగు చేస్తున్న ఆయిల్‌ ఫాం

జిల్లాలో ప్రయోగాత్మకంగా సాగు 

ప్రైవేటు సంస్థ నేతృత్వంలో అవగాహన 

రైతులకు నిరంతర శిక్షణ 

ప్రత్యామ్నాయ అంతర పంటగా అవకాశం 

ప్రతీయేటా 3వేల ఎకరాల్లో పంటసాగుకు ప్రణాళిక 

మొత్తం 83వేల ఎకరాల్లో ఆయిల్‌ ఫాం సాగు స్థిరీకరణకు కసరత్తు 

నిర్మల్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : ప్రతీయేటా రైతులు పత్తి, వరి, మొక్కజొన్న, సోయాబీన్‌ లాంటి పంటలనే పండిస్తూ ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు సాఽధిస్తున్నారు. అయితే ఆ పంటలకు బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గడం, గిట్టుబాటు ధరలు ఆశించిన మేరకు లభించకపోవడం, పంటలసాగుకు పెట్టుబడులు పెరిగిపోవడం లాంటి అంశాలు అన్నదాతను కుంగదీస్తున్నాయి. దీంతో పాటు బహిరంగ మార్కెట్‌లో పంటలకు డిమాండ్‌ లేకున్నప్పటికీ రైతు సంక్షేమం పేరిట ఆ పంటలను కొనుగోలు చేయడం, నిల్వ చేయడమే కాకుండా, మార్కెటింగ్‌ చేయడం లాంటి అంశాలు సర్కారుకు గుదిబండగా మారుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం నిర్బంధ సాగు విధానాన్ని తెరపైకి తెచ్చినప్పటికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని యేళ్ల నుంచి కోరుతున్నప్పటికీ.. రైతులు మాత్రం సాంప్రదాయ పంటలవైపే మొగ్గు చూపుతుండడం సర్కారుకు చిక్కులు సృష్టిస్తోంది. అయితే ఇక నుంచి మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉన్న ఆయిల్‌ఫాంను సాగుచేయించేందుకు ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణ రూపొందించింది. రైతులు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌ఫాం పంటలసాగుకు ముందుకు రావాలని సర్కారు కోరుతోంది. హార్టికల్చర్‌ శాఖ ఆధ్వర్యంలో ఇక నుంచి ప్రతీయేటా ఒక్కో జిల్లాలో కొంత మేరకు ఆయిల్‌ ఫాం తోటలను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా దశల వారీగా ఎంపిక చేసిన జిల్లాల్లో ఆయిల్‌ ఫాం పంటలసాగును ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహించబోతోంది. దీని కోసం గాను ఆయిల్‌ ఫాం తోటలసాగుతో పాటు ఆ పంటలతో ఒనగూరే లాభాలపై రైతులకు అవగాహన కల్పించేందుకే కాకుండా పంటలసాగుకు ప్రోత్సాహం కల్పించేందు కోసం రెండు ప్రైవేటు సంస్థలతో అవగాహన కుదుర్చుకుంది. ఒక్కోసంస్థకు ఎంపిక చేసిన జిల్లాలను అప్పగించి ఆ కంపెనీ ఆధ్వర్యం లోనే ఫాం ఆయిల్‌ మొక్కలను రైతులకు అందించనున్నారు. దీంతో పాటు సాగు మెలకువలు, ఇతర రకాల సలహాలు, సూచనలను కూడా ప్రైవేటు కంపెనీలు అందించనున్నాయి. ఇందులో భాగంగానే ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలు ఆయిల్‌ ఫాం సాగుకోసం ప్రయోగాత్మకంగా ఎంపికయ్యాయి. ఇదిలా ఉండగా నిర్మల్‌ జిల్లాలో ప్రతియేటా 3 వేల ఎకరాల్లో ఆయిల్‌ ఫాం పంటలను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా రు. రాబోయేరోజుల్లో దశల వారీగా ఆయిల్‌ఫాం సాగువిస్తీర్ణాన్ని 83వేల ఎకరాలకు పెంచాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఆయిల్‌ఫాం సాగుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందించేందుకు ముందుకు వచ్చింది. రైతులందరికీ ఆయిల్‌ ఫాం పంటలసాగుపై అవగాహన పెంపొందించి వారందరినీ ఈ పంటసాగు వైపుకు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం గాను జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి తమ పరిధిలో ఆయిల్‌ ఫాం తోటల పెంపకం కోసం రైతులను సమాయత్తం చేయాలని సర్కారు లక్ష్య ంగా నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే గురువారం జిల్లాలో ఆయిల్‌ ఫాం తోటల సాగు ప్రయోజనాలు, దిగుబడులు, రాయితీలు లాంటి అంశాలపై రైతులకు పవర్‌ ప్రజంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. 

ఫ జిల్లాలో 83వేల ఎకరాల ఆయిల్‌ ఫాం సాగు లక్ష్యం

జిల్లాలో ప్రతీయేటా 3వేల ఎకరాల్లో ఆయిల్‌ ఫాం పంటలను సాగుచేస్తూ దీనిని ప్రతీయేటా విస్తరించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. రాబోయే రోజుల్లో జిల్లావ్యాప్తంగా 83వేల ఎకరాల్లో ఆయిల్‌ ఫాం పంటలు సాగయ్యేట్లు చూడాలని లక్ష్యంగా నిర్ధారించారు. ప్రతీ ఎకరానికి 57ఆయిల్‌ ఫాం మొక్కలు అవసరం కానున్నట్లు హార్టికల్చర్‌ అధికారులు వెల్లడిస్తున్నారు. ఒక మొక్కధర బహిరంగ మార్కెట్‌లో రూ.177 ఉండగా.. రైతులకు మాత్రం కేవలం రూ. 33లకు మాత్ర మే ఒక మొక్కను అందించనున్నారు. మిగతా రూ.84లను ప్రభుత్వం సబ్సిడీగా భరించనుంది. నిర్మల్‌ జిల్లాతో పాటు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాలు మొదటిదశ కింద ఆయిల్‌ ఫాం తోటల సాగుకు ఎంపికయ్యాయి. హార్టికల్చర్‌ శాఖతో పాటు హైదరాబాద్‌ కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ఆయిల్‌ ఫాం తోటలసాగు ప్రక్రియను ఉమ్మడిగా పరిశీలించనున్నాయి. 

ఫ మొదట అంతర పంటగా.. 

ఆయిల్‌ ఫాం పంటసాగు చేసిన నాటి నుంచి నాలుగేళ్ల తరువాత దిగుబడి సాధిస్తుంది. అప్పటి వరకు ఈ పంటను రైతులు ప్రస్తుతం పండించే తమ పంటల్లో అంతరపంటగా సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. పంటను సాగు చేసిన నాలుగేళ్ల నాటి నుంచి 30సంవత్సరాల వరకు ప్రతీయేటా ఈ పంటల దిగుబడులు రైతుచేతికి అందుతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను ఆయిల్‌ ఫాం ధర రూ 19,288లుగా ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో వంటనూనెలకు విపరీతమైన డిమాండ్‌ పెరిగిపోతుండడం, ధరలు సైతం ఆకాశాన్నంటుతుండడ మే కాకుండా దాని దిగుమతులు కూడా తక్కువ గా ఉన్నాయి. ఇలాంటి కారణాల వల్ల ఇక ఆయి ల్‌ ఫాం పంట ను సాగు ను ప్రత్యామ్నాయంగా చూపుతున్నారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని వ్యవసాయ భూములు ఆయిల్‌ పంటలసాగుకు అనుకూలంగా ఉండడంతో.. పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఈ రెండు జిల్లాలను ఎంపిక చేశారు. కాగా.. ఆయిల్‌ ఫాం సాగు మెళకువలను తెలుసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులను ఆశ్వారావుపేట్‌కు శిక్షణకు పంపనున్నారు. ముఖ్యంగా ఎక్కువ వ్యవసాయం సాగుచేస్తున్న గ్రామాలను, అక్కడి రైతులను ఈ పంటల సాగుకు అధికంగా ప్రోత్సహించనున్నారు.

ఫ 83వేల సాగు స్థిరీకరణే లక్ష్యం

జిల్లాలో ప్రతీయేడాది 3వేల ఎకరాల్లో ఆయిల్‌ ఫాం తోటలసాగును చేపట్టి క్రమంగా ప్రతీయేటా ఆ సాగును విస్తరించనున్నారు. మొత్తం జిల్లావ్యాప్తంగా 83వేల ఎకరాల్లో ఆయిల్‌ఫాం తోటల పెంపకాన్ని లక్ష్యంగా నిర్ధారించారు. జిల్లా లో ప్రతియేటా లక్ష ఎకరాల్లో వరి, లక్షన్నర ఎకరాల్లో పత్తి, 75వేల ఎకరాల్లో సోయాబీన్‌, అలాగే 50వేల ఎకరాలకు పైగా మొక్కజొన్న పంటలను ప్రస్తుతం సాగు చేస్తున్నారు. ఈ పంటలన్నీ సాంప్రదాయ పంటలుగా మారిపోవడం, వీటి సాగు కారణంగా భూసారం సైతం తగ్గిపోతుండడమే కాకుండా బహిరంగ మా ర్కెట్‌లో డిమాండ్‌ ధరలు సైతం ఆశాజనకంగా ఉండడం లేదు. ప్రతీయేటా ఈ పంటలసాగు రైతులకు కత్తిమీద సాములా మారుతోంది. ఈ పంటలతో చేసే వ్యవసాయమంతా రైతులకు మానసిక ఒత్తిడిని సృష్టిస్తుండడమే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులను కలిగిస్తోందంటున్నారు. ఏళ్ల నుంచి ప్రత్యామ్నాయ పంటలసాగు నినాదం వినిపిస్తున్నప్పటికీ రైతులు మూసధోరణితో వ్యవహరిస్తున్న కారణంగా ఈ వ్యవహారం నినాదాలకే పరిమితమైపోతోంది. చిట్ట చివరకు ప్రభుత్వం సీరియస్‌గా రంగంలోకి దిగి ఆయిల్‌ఫాం తోటలసాగుకు ప్రణాళికలు రూపొందించడమే కాకుండా రైతులను ఆ దిశగా నడిపించే బాధ్యతను తన భు జాలపై వేసుకుందని పేర్కొంటున్నారు.

Updated Date - 2021-06-18T07:02:55+05:30 IST