ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజులుం

ABN , First Publish Date - 2020-05-28T09:39:59+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు పెంచవద్దని, కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే...అది కూడా ఏ నెలకానెల

ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజులుం

  • గత ఏడాది ఫీజులపై 15 శాతం మేర పెంపు
  • ఫస్ట్‌ టర్మ్‌ ఫీజు చెల్లించాలంటూ తల్లిదండ్రులకు వాట్సాప్‌ మెసేజ్‌లు
  • ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ ఆదేశాలు బేఖాతరు
  • ఈ ఏడాది ఫీజులు పెంచొద్దని విస్పష్టంగా ఆదేశాలు
  • ట్యూషన్‌ ఫీజు మినహా మరేదీ వసూలు చేయకూడదు
  • అది కూడా నెల నెలా కట్టే వెసులుబాటు ఇవ్వాలి...
  • పట్టించుకోని యాజమాన్యాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు పెంచవద్దని, కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే...అది కూడా ఏ నెలకానెల కట్టించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. కొత్త విద్యా సంవత్సరం మొదలైనందున ఫస్ట్‌ టర్మ్‌ ఫీజు కట్టాలంటూ తల్లిదండ్రులకు వాట్సాప్‌ మెసేజ్‌లు పంపుతున్నాయి.

ప్రైవేటు పాఠశాలల్లో అప్పుడే కొత్త విద్యా సంవత్సరం మొదలైపోయింది. పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు పంపించే ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆన్‌లైన్‌ క్లాసులూ నిర్వహిస్తున్నారు. పిల్లల కోసం ఇప్పుడు ఇంట్లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పెట్టుకోవలసి వస్తోంది. ఇవన్నీ పక్కనపెడితే...కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు నిలిచిపోయాయి. ప్రైవేటు సంస్థల్లో కొందరికి ఉద్యోగాలు పోయాయి. మరికొందరికి జీతాలు తగ్గిపోయాయి. ఎవరి చేతిలో డబ్బులు లేవు. ఇటువంటి సమయంలో అడ్డగోలుగా ఫీజులు పెంచేసి, స్కూళ్లు తెరవకముందే మొదటి టర్మ్‌ ఫీజు వెంటనే చెల్లించాలని ఒత్తిళ్లు తేవడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 


ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యా సంస్థలన్నీ గత ఏడాది ఫీజులే ఈ ఏడాది కూడా వసూలు చేయాలి. ఒకవేళ ఫీజులు పెంచాలనుకుంటే...ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ మానిటరింగ్‌ కమిషన్‌ (ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ) నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే ఈ సంస్థ తాజాగా ఈ నెల 25న ఓ ఉత్తర్వు జారీచేసింది. ఫీజులు పెంచకూడదని, 2020-21 విద్యా సంవత్సరానికి కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే...అది కూడా నెల నెలా కట్టే వెసులుబాటు కల్పించాలని ఆదేశించింది. ప్రైవేటు పాఠశాలలు మూడు నెలలకోసారి ముందుగానే ఫీజులు కట్టించుకుంటాయి. అందులో బిల్డింగ్‌ ఫీజు, లేబొరేటరీ ఫీజు, కంప్యూటర్‌ లెర్నింగ్‌..ఇలా రకరకాల పేర్లతో సగటున ఒక్కో త్రైమాసికానికి రూ.10 వేల వరకు గుంజుతున్నాయి. ఈ ఫీజులను మరో 15 శాతం పెంచాయి. ఇది ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ ఆదేశాలను ఉల్లంఘించినట్టే.


అలా కుదరదు: టింపనీ యాజమాన్యం

విశాఖలో అత్యంత ధనవంతుల పిల్లలంతా టింపనీలో చదువుతుంటారు. మధ్య తరగతికి చెందినవారు కూడా ఆర్థికంగా భారమైనప్పటికీ అక్కడే పిల్లల్ని చేర్పిస్తారు. ఈ ఏడాది ఫీజులు 15 శాతం పెంచి, ఆ మొత్తం ఒకేసారి కట్టాలని యాజమాన్యం ఒత్తిడి తెస్తున్నది. దీంతో తల్లిదండ్రుల అసోసియేషన్‌ బృందం వెళ్లి, గత ఏడాదిలాగే ఫీజులు తీసుకోవాలని, నెల నెలా ట్యూషన్‌ ఫీజు కడతామని చెప్పగా...యాజమాన్యం అంగీకరించలేదు. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు వుంటే వ్యక్తిగతంగా వచ్చి కలవాలని, ఇలా అసోసియేషన్‌ పేరుతో వస్తే స్పందించేది లేదని స్పష్టంచేసింది. ప్రభుత్వం ఆదేశాలను ఇంత బహిరంగంగా ఉల్లంఘిస్తుంటే ఏమి చేయాలని తల్లిదండ్రులు వాపోతున్నారు.


ప్రభుత్వం నడిపే స్కూల్‌లోనూ అంతే!!

జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన విశాఖ వేలీ స్కూల్‌ నడుస్తున్నది. ఇక్కడ కూడా అడ్మిషన్లకు డిమాండ్‌ ఎక్కువ. ఫీజులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ యాజమాన్యం కూడా ప్రభుత్వం ఆదేశాలు పట్టించుకోకుండా ఫస్ట్‌ టర్మ్‌ ఫీజు, ట్రాన్స్‌పోర్టు చార్జీలు కలిపి జూన్‌ 10వ తేదీలోగా కట్టాలని మెసేజ్‌లు పంపుతోంది. ‘ట్యూషన్‌ ఫీజు వసూలు’ అనేది ఉత్తర్వులకే పరిమితం అయిందని, కలెక్టర్‌  ఆధ్వర్యంలో నడిచే స్కూల్‌లోనే వీటిని ఉల్లంఘిస్తే...ఇక ఇతర ప్రైవేటు పాఠశాలలు ఎందుకు ఊరుకుంటాయి’’ అని తల్లిదండ్రులు వాపోతున్నారు.


ఇది చాలా దారుణం

పెన్మెత్స దీపిక

మా ఇద్దరు పిల్లలు టింపనీలో చదువుతున్నారు. ఈ ఏడాది ఫీజులు పెంచడమే కాకుండా, పూర్తి మొత్తం కట్టాలంటూ నోటీసు పంపించారు. పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులంతా పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని కలిశాం. ఫీజులకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు చూపించాం. కానీ ఏ మాత్రం పట్టించుకోలేదు. దీనిపై జిల్లా యంత్రాంగం  తక్షణమే స్పందించి తగిన ఆదేశాలు ఇవ్వాలి. 


పుస్తకాలు ఇప్పుడు కొనాలట

సుబ్రహ్మణ్యం, ప్రైవేటు ఉద్యోగి

మా ఇద్దరు పిల్లలు ప్రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చదువుతున్నారు. ఈ ఏడాది కూడా ఫీజులు పెంచారు. ఫస్ట్‌ టర్మ్‌ ఫీజు చెల్లించడంతోపాటు పుస్తకాలు కూడా తీసుకోవాలంటూ వారం రోజుల నుంచి కబురు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలలుగా జీతాలు లేవు. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఇద్దరు పిల్లలకు మొదటి టర్మ్‌ ఫీజులు, పుస్తకాలకు రూ.25 వేలు అవసరం. ఎక్కడి నుంచి తేవాలి. ఫీజు తగ్గించాలని కోరగా...కుదరదని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలి.   

Updated Date - 2020-05-28T09:39:59+05:30 IST