ఆంగ్లంవైపు అడుగులు

ABN , First Publish Date - 2022-01-22T06:35:20+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పదవతరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంను రాబోయే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఆంగ్లంవైపు అడుగులు

ఆశలపల్లకిలో తల్లిదండ్రులు 

సర్కారు బడుల్లో ఇంగ్లీష్‌ మీడియంపై అంతటా జిల్లాలో చర్చ 

ప్రైవేటు యాజమాన్యాల్లో మొదలైన గుబులు

ఇకపై మారనున్న సర్కారీ చదువుల భవితవ్యం 

నిర్మల్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి)  : ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పదవతరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంను రాబోయే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు సర్కారు  సన్నద్ధమవుతోంది. కరోనా కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విపరీతమైన అడ్మిషన్‌లు పెరిగిపోతున్న కారణంగా ప్రభుత్వం దీనిని అనుకూలంగా మలుచుకొని సర్కారువిద్యను మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంను అమలు చేస్తామంటూ సంబంధిత టీచర్లు ముందుకు వస్తున్నప్పటికీ అనుమతుల వ్యవహారంలో ఉన్న ఇబ్బందుల కారణంగా వారు ముందడుగు వేయలేకపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలతో పాటు కేజీబీవీ, మోడల్‌స్కూల్స్‌లలో మొత్తం 754 స్కూల్స్‌ ఉన్నాయి. ఇందులో నుంచి ప్రస్తుతం 158 స్కూల్స్‌లో మాత్రమే ఇంగ్లీష్‌ మీడియంను కొనసాగిస్తున్నారు. ఈ 158 పాఠశాలల్లో మొత్తం 16,683 మంది ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నారు. అయితే చాలా పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంను అమలు చేసేందుకు అక్కడి టీచర్లు ముందుకు వస్తున్నప్పటికీ సౌకర్యాల కొరత, అలాగే శిక్షణ పొందిన టీచర్లు అందుబాటులో లేకపోవడంతో అవరోధాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం రాబోయే విద్యాసంవత్సరం నుంచి నిర్భంధంగా ఇంగ్లీష్‌ మీడియంను అమలు చేయనున్న కారణంగా ఇక పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం తెలుగులో భోదిస్తున్న టీచర్లకు ఇంగ్లీష్‌ మీడి యంపై కూడా పట్టును పెంచేందుకు శిక్షణలను కొనసాగిస్తామని విద్యాశాఖ ప్రకటన చేసింది. అలాగే అవసరమైతే ఇంగ్లీష్‌ మీడియంకు సంబందించిన టీచర్ల నియమకాలను కూడా చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక ఆంగ్లందిశగా అడుగులు వేగవంతం కానున్నాయంటున్నారు. ప్రభుత్వం ఇంగ్లీష్‌ మీడియంపై స్పష్టమైన ప్రకటన చేయడమే కాకుండా ఆ దిశగా కార్యాచరణను మొదలుపెట్టడంతో ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు బెంబెలేత్తుతున్నాయంటున్నారు. కరోనా కారణంగా గత మూడు సంవత్సరాల నుంచి ప్రైవేటు పాఠశాలల భవితవ్యం గందరగోళంగా మారిన సంగతి తెలిసిందే. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు నిర్ణయం ప్రైవేటు యాజమాన్యాలకు షాక్‌ ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ట్రైన్డ్‌టీచర్లు అందుబాటులో ఉండడమే కాకుండా ప్రభుత్వం సౌకర్యాలను కల్పించేందుకు పకడ్భందీ కార్యాచరణను అమలు చేస్తుండ డం, ఇంగ్లీష్‌ మీడియంను తప్పనిసరి చేయబోతున్న కారణంగా భవిష్యత్‌లో ప్రైవేటు పాఠశాలల భవితవ్యం ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం లేకపోలేదంటున్నారు. 

జిల్లాలోని 754 పాఠశాలల్లో అమలు

కాగా జిల్లాలోని అన్నిరకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టబోతున్న కారణంగా అధికారులు ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ మీడియం అమలు కానున్నప్పటికీ అధికారులు ముందస్తుగానే జిల్లాలోని మొత్తం 754 పాఠశాలలను సంసిద్దంగా ఉంచబోతున్నారు. ప్రస్తుతం 158 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలవుతున్నప్పటికీ ఆ పాఠశాలల్లో కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేపట్టబోతున్నారు. కాగా ప్రస్తుతం 99 ప్రాథమిక పాఠశాలలు, 30 ప్రాథమికోన్నత పాఠశాలలు, 23 ఉన్నత పాఠశాలలతో పాటు 5 కేజీబీవీలు, ఒక మోడల్‌ స్కూల్‌లో ఇంగ్లీష్‌ మీడియం అమలవుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 8300 మంది, ప్రాథమికొన్నత పాఠశాలల్లో 2730, ఉన్నత పాఠశాలల్లో 3712, కస్తూరిబా పాఠశాలల్లో  1131, మోడల్‌స్కూల్‌లో 810 మంది విద్యార్థులు ఇంగ్లీష్‌మీడియంలో విద్యను అభ్యసిస్తున్నారు. రాబో యే సంవత్సరం నుంచి ఇక అన్ని తరగతులకు ఇంగ్లీష్‌ మీడియంను అనుసందానం చేయబోతున్న కారణంగా ఈ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయంటున్నారు. 

సౌకర్యాలే అసలు సమస్య

ఇదిలా ఉండగా కరోనా ప్రభావంతో గత మూడు సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా విద్యార్థుల అడ్మిషన్‌లు పెరిగిపోతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏ ఒక్క పాఠశాలలో కూడా కనీససౌకర్యాలు లేకపోవడం సమస్యగా మారిందంటున్నారు. రా బోయే సంవత్సరం నుంచి ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంను అమలు చేయబోతున్న కారణంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంగ్లీష్‌ మీడియం అమలుతో పాటు ప్రైవేటు పాఠశాలలకు సర్కారు బడులను ధీటుగా తయారు చేయాలంటే మొదట కనీససౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లతో పాటు అవసరమైన మేరకు తరగతి గదులను సైతం అందుబాటులో ఉంచాలంటున్నారు. జిల్లాలోని చాలా చోట్ల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉందని పేర్కొంటున్నారు. పాఠశాల భవనాలు శిథిలావస్థలో కొనసాగుతున్నప్పటికీ శాశ్వత మరమత్తులు చేయకపోవడంతో వాటి పరిస్థితి దయనీయంగా మారిందని చెబుతున్నారు. ప్రభుత్వం రాబోయే ఆరు నెలల్లోగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలను సమకూర్చడమే అత్యవసరం అంటున్నారు. తక్కువ గడువులో ఈ సవాలును ఛేదించడం సంబంధిత యంత్రాంగానికి కత్తిమీద సామేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

గందరగోళంగా విద్యావ్యవస్థ

317 జీఓ అమలుతో విద్యా వ్యవస్థ ప్రస్తుతం గందరగోళంగా మారిపోయిందన్న విమర్శలున్నాయి. జిల్లాలోని చాలా మంది టీచర్లు స్థానికేతరులుగా దూర ప్రాంతాల్లోని జిల్లాలకు బదిలీ అయిన కారణంగా విద్యా వ్యవస్థ అయోమయ పరిస్థితులను ఎదుర్కొంటోంది. 317 జీఓపై రోజుకో రకమైన నిర్ణయం వెలువడుతున్న నేపథ్యంలో ఉపాఽధ్యాయ లోకమంతా ఆగమ్యగోచర స్థితికి చేరుకుందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లీష్‌ మీడియం అమలు వ్యవహారం విద్యాశాఖలోని జిల్లాస్థాయి అధికారులకు తలనొప్పిగా మారే అవకాశం ఉందంటున్నారు. 

Updated Date - 2022-01-22T06:35:20+05:30 IST