స్వాతంత్ర్యోద్యమంలో స్త్రీశక్తి

ABN , First Publish Date - 2022-01-13T09:15:27+05:30 IST

స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా జరుగుతున్న చర్చలో కానీ, ప్రచురితమవుతున్న వ్యాసాలలో గాని స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న స్త్రీమూర్తుల ప్రస్తావన తగినంతగా లేకపోవడం శోచనీయం...

స్వాతంత్ర్యోద్యమంలో స్త్రీశక్తి

స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా జరుగుతున్న చర్చలో కానీ, ప్రచురితమవుతున్న వ్యాసాలలో గాని స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న స్త్రీమూర్తుల ప్రస్తావన తగినంతగా లేకపోవడం శోచనీయం.


భారత జాతీయోద్యమాన్ని గమనిస్తే 1857 సిపాయిల తిరుగుబాటు నుంచే నారీమణుల ప్రవేశం, వారి ఉద్యమస్ఫూర్తి కనబడుతుంది. స్వాత్రంత్య పోరాటంలోని ప్రధాన ఉద్యమాలు: స్వదేశీ ఉద్యమం, హోమ్‌ రూల్‌ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్‌ ఇండియా ఉద్యమం. ఈ ఉద్యమాలలో వేలమంది మహిళలు పాల్గొన్నారు. వారి శక్తియుక్తులు ఉపయోగించారు. ప్రాంతీయంగా సాగిన స్వాతంత్ర్యోద్యమాలలో సైతం ఆయా ప్రాంతాలలోని స్ర్తీలు ప్రవేశించి స్వాతంత్య్ర సంగ్రామంలో నారీశక్తి తీవ్రతను తెలియజేశారు. వారిలో కొంతమంది చరిత్రకెక్కారు. వందలాది మందిని చరిత్ర కూడా విస్మరించింది. 


1857లోని సిపాయిల తిరుగుబాటులో మధ్యప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి లక్ష్మీబాయి, కిత్తూరు నుంచి రాణీ చెన్నమ్మ, బొంబాయి నుంచి మేడమ్‌ కామాలతో పాటు ఎంతోమంది స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన పండిత రమాబాయి పేరు అవిస్మరణీయమైనది. భారతీరాయ్‌, శ్రీమతి సరోజినీనాయుడు స్వాతంత్రోద్యమంలో ఎంతో ప్రబలశక్తులుగా వ్యవహరించారు.


సరోజినీనాయుడు బాటలోనే తెలుగు ప్రాంతాల నుంచి దిగుబర్తి జానకమ్మ, చుక్కమ్మ, వాసిరెడ్డి హనుమాయమ్మ, చుండూరు రత్నమ్మ, కన్నగర్తి నాగరత్నమ్మ, దుగ్గిరాల కమలాంబ, కృష్ణవేణమ్మ, ఆరికపూడి మాణిక్యాంబ సుగుణ, మహలక్ష్మమ్మ, వల్లభనేని మహలక్ష్మమ్మ, కంభంపాటి మాణిక్యాంబ, భారతీదేవిరంగ స్వాతంత్రోద్యమంలో ఎంతో క్రియాశీలక పాత్ర వహించారు. డా. కొమర్రాజు అచ్చమాంబ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పట్లో జాతీయోద్యమాన్ని తీవ్రతరం చేయడానికి, కరపత్రాలు పంచి పెట్టడానికి, ఉద్యమానికి అవసరమైన శిక్షణలు ఇవ్వడానికి, ధనాన్ని సమకూర్చుకోవడానికి విరాళాలు సేకరించారు. తెలుగు ప్రాంతాల మహిళలు పెద్ద మొత్తంలోనే విరాళాలు ఇచ్చారు. మాగంటి అన్నపూర్ణమ్మ మొదటగా తన బంగారు నగలు విరాళంగా ఇచ్చారు. ఆ తరువాత ఎంతోమంది మహిళలు తమ విలువైన ఆభరణాలు అందిం చారు. సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమాలలో దువ్వూరి సుబ్బమ్మ, వేదాంతం కమలాదేవి, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌, ఉన్నవ లక్ష్మీబాయమ్మ, మాణిక్యాంబ, పోనకా కనకమ్మ, ఓరుగంటి మహాలక్ష్మమ్మ, మాగంటి అనసూయ, తల్లాప్రగడ విశ్వవర్ధనమ్మ, పెద్దాడ కామేశ్వరమ్మ, ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి, దర్శి సుభద్రమ్మ మొదలైనవారు పాల్గొన్నారు.


బెంగాల్ నుంచి బసంతిరాయ్‌ హేమప్రభ, సరళాదేవి చౌదరాణి, సరళారాయ్‌, లేడీ జగదీస్ బోస్‌, విద్యాగౌరి, నీలకాంత్‌, శారదాబెన్‌ మెహతా, బేగం హమ్మిద్‌ అలి; భోపాల్‌ నుంచి సుబ్బలక్ష్మి, మద్రాస్‌ నుంచి ముత్తులక్ష్మిరెడ్డి, అహ్మదాబాద్‌ నుంచి కస్తూర్బాగాంధి; మంగుళూరు నుంచి కమలాదేవి చటోపాధ్యాయ, అలహాబాద్ నుంచి స్వరూపరాణి, కమలానెహ్రూ మొదలైనవారు స్వాతంత్య్ర సంగ్రామంలో అరెస్టయి జైలుకు వెళ్లారు. ‘శక్తి సమితి’ స్థాపకురాలు ‘భారతి’ పత్రిక ఎడిటర్‌ స్వర్ణకుమారిదేవి, మొదటి మహిళా కాంగ్రెస్‌ డెలిగేట్‌ కాదంబిని గంగూలి, సహాయనిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాల్లో పాల్గొన్నారు. మతంగిరి హజ్రా, కర్నాటక బారువా తమ శక్తిసామర్థ్యాలను స్వాతంత్రోద్యమం కోసం ధారబోశారు. అరుణ అసఫ్‌ అలి, ఉషామెహతా క్విట్‌ ఇండియా ఉద్యమం వరకు పాల్గొన్నారు. మహారాష్ట్ర నుంచి రమాబాయి రనడే, కహీబాయ్‌ కనికర్‌, మాలతీబాయి బెడేకర్‌, గీతాసేన్‌, అస్సాం నుంచి పుష్పలతదాస్‌, అన్నప్రభ బారువ, సుధారధాదత్త, చంద్రప్రభ, కుమారి కమలలత, తుల్జేశ్వరి, నాగాలాండ్‌ నుంచి రాణి గైడెన్‌ ‘నాగ’జాతి యోధులతో కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. సుచేత కృపలాని, చోటుబాయ్‌ కురానిక్‌ మొదలైనవారు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. డా. లక్ష్మీ స్వామినాధన్‌, బసంతిదేవి, పద్మాశిని అమ్మాళ్‌, శకుంతలాదేవి, విజయలక్ష్మి పండిట్‌, హంసామెహతా రాధాబాయి సుబ్బరాయన్‌, అమ్ము స్వామినాధన్‌, సుహాసిని జంబేకర్‌, అవంతిక గోఖలే, మృదులా సారాబాయి తదితరులతో సహా స్వాతంత్ర్యోద్యమంలో వేలాది మహిళలు పాల్గొన్నారు. చాలామంది పేర్లు చరిత్రకు అందలేదు. మహిళలు ఇంటి నుంచి బయటకు రాలేని రోజుల్లోనే దేశం కోసం కుటుంబాన్ని, బంధాలను వదిలి దేశమాత విముక్తి కోసం, ఎలాంటి బంధనాలు లేని ఊపిరుల్ని మనకు అందించారు. ఆ మహోన్నత నారీశక్తికి వందనాలు.

సుసర్ల మాధవి

Updated Date - 2022-01-13T09:15:27+05:30 IST