అమెరికాలో వ్యాక్సినేష‌న్‌కు.. ఆటంకంగా మారిన రూమ‌ర్ !

ABN , First Publish Date - 2021-05-16T01:46:20+05:30 IST

అగ్ర‌రాజ్యం అమెరికాలో జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నుంచి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

అమెరికాలో వ్యాక్సినేష‌న్‌కు.. ఆటంకంగా మారిన రూమ‌ర్ !

వాషింగ్ట‌న్‌: అగ్ర‌రాజ్యం అమెరికాలో జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నుంచి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ల‌క్ష్యాలు నిర్ధేశించుకుని మ‌రీ టీకా కార్య‌క్ర‌మాన్ని బైడెన్ ప‌రుగులు పెట్టిస్తున్నారు. దీంతో అతి త‌క్కువ కాలంలోనే దేశ‌ వ్యాప్తంగా సుమారు 45 శాతం మందికి వ్యాక్సినేష‌న్ పూర్తి చేయ‌గ‌లిగారు. యూఎస్‌లో ఇప్ప‌టికే దాదాపు 45 శాతం మంది వ‌యోజ‌నులు రెండు మోతాదుల‌ టీకా తీసుకోవ‌డం పూర్తి కాగా, 58 శాతం మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు జాన్ హోప్‌కిన్స్ యూనివ‌ర్శిటీ నిపుణులు చెబుతున్నారు. ఇక త‌న తొలి 114 రోజుల పాల‌న‌లో ఏకంగా 25 కోట్ల మందికి టీకాలు అందించ‌డం గొప్ప విష‌యంగా బైడెన్ పేర్కొన్నారు. 


ఇలా శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్న‌ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు అక్క‌డి సోష‌ల్ మీడియాలో ప్ర‌చారంలో ఉన్న ఒక‌ రూమ‌ర్‌ ఇప్పుడు ఆటంకంగా ప‌రిణ‌మిస్తోంది. దేశప్రజలకు వ్యాక్సినేష‌న్ ప్రక్రియ పూర్తి చేసి మ‌హ‌మ్మారి నుంచి ఉపశమనం క‌లిగించాలని చూస్తున్న ప్ర‌భుత్వానికి ఈ న్యూస్ ప్ర‌స్తుతం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ న్యూస్‌ కారణంగా ఏకంగా టీకా ప్రక్రియ మంద‌గించే ప్ర‌మాదంలో ప‌డింది. ఎందుకంటే అక్కడి 18 నుంచి 49 ఏళ్ల మ‌ధ్య ఉన్న అమెరికన్లలో ఇంకా స‌గం మంది వ్యాక్సిన్‌ తీసుకోలేదు. టీకా తీసుకుంటే సంతానోత్ప‌త్తి కోల్పోయే అవకాశం ఉంద‌నేది ఈ న్యూస్ సారాంశం. దీనిపై అక్క‌డి సోష‌ల్ మీడియా వేదిక‌గా రూమ‌ర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీంతో అమెరికన్లు టీకా వేయించుకునేందుకు వెనుకాడుతున్నారు. 18 నుంచి 49 ఏళ్ల‌ వయసు గల మ‌హిళ‌లలో 50 శాతం, పురుషులలో 47 శాతం మంది ఇలాంటి భయాల‌తోనే టీకా తీసుకునేందుకు జంకుతున్నారు. దీంతో అక్క‌డి ప్రభుత్వ లక్ష్యానికి  ఇదో ఆటంకంగా మారింది. ఇదిలాఉంటే.. టీకాలు తీసుకుంటే వంధ్య‌త్వం వ‌స్తుంద‌నే దానికి ఆధారాలు ఏమీ లేవ‌ని శాస్త్రవేత్తలు చెబుతున్న మాట‌.

Updated Date - 2021-05-16T01:46:20+05:30 IST