Abn logo
Sep 26 2021 @ 23:56PM

ఎరువులు బ్లాక్‌

చీరాలలో గోదాములో అన్‌లోడ్‌కు సిద్ధంగా ఉంచిన లారీ

 వ్యాపారుల కృత్రిమ కొరత

ధరలు పెంచి విక్రయం 

బస్తాకు 50వరకూ అదనంగా వసూలు

పట్టించుకోని అధికారులు 

అక్కరకు రాని ఆర్‌బీకేలు 

చీరాల, సెప్టెంబరు 26 : జిల్లాలో ఎరువుల వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఆర్‌బీకేల్లో పూర్తిస్థాయిలో సరుకు అందుబాటులో లేకపోవడం, రైతుల అవసరాన్ని ఆసరా చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. సరుకును బ్లాక్‌ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎరువులకు డిమాండ్‌ పెరిగేలా చేసి అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు ఆవైపు దృష్టి సారించకపోవడంతో అందినకాడికి దండుకుంటున్నారు. అసలే ఎరువుల ధరలు పెరిగి అల్లాడుతున్న అన్నదాతలు ఈ అదనపు బాదుడు గుదిబండగా మారిందని వాపోతున్నారు. 

ఆర్‌బీకేల్లో అరకొరే..

రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకేల) ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు  పూర్తిస్ధాయిలో అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆచరణలో అది నామమాత్రమే అయ్యింది. జిల్లాలో మొత్తం 56 మండలాల్లో 879 ఆర్‌బీకేలు ఉన్నాయి. అర్బన్‌ పరిధిలో మరో 27 ఏర్పాటు చేశారు. వీటితోపాటు 23 సహకార సొసైటీల్లో ఎరువులు విక్రయిస్తున్నారు. వీటిలో రైతులకు కావాల్సిన ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. అరకొరగానే లభిస్తున్నాయి. డీఏపీకి తీవ్ర కొరత ఉంది. దీంతో రైతులు ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని వారు జేబులను కొల్లగొడుతున్నారు. 


అదనంగా వసూలు 

ప్రధానంగా ఖరీఫ్‌లో సాగు చేసిన మిర్చికి ప్రస్తుతం ఎరువుల వాడకం అధికంగా ఉంది. మిర్చికి తొలిదశలో డీఏపీ వాడతారు. అది ఆర్‌బీకేల్లో పూర్తిస్థాయిలో లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తుండగా, వారు బస్తాకు రూ.50 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. మిగిలిన ఎరువులను కూడా ఎమ్మార్పీకంటే అధిక మొత్తానికి అమ్ముతున్నారు. మరో వారంలో శనగ సాగుకు సంబంధించి ముందస్తుగా దుక్కిలో ఎరువులు వెదపెడతారు. ఆర్బీకేల్లో ఎరువుల కొరత ఉంది. దీన్ని గుర్తించి వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల డీఏపీ అడిగిన వారికి పోటీగా మరో ఎరువు బస్తా (అండర్‌సేల్‌లో ఉండేది) తీసుకోవాలని షరతు పెడుతున్నారు. 


వెంటనే చర్యలు తీసుకుంటాం

శ్రీనివాసరావు, జేడీఏ, ఒంగోలు

జిల్లాలోని కొన్ని చోట్ల ప్రైవేటు డీలర్లు ఎరువులు అధిక ధరకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. అలా వసూలు చేసినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటాం.  సోమవారం వీడియో కాన్ఫెరెన్స్‌లో జిల్లాలోని అన్ని ప్రాంతాల వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడి తగిన ఆదేశాలు ఇస్తాం. ఆర్‌బీకేలకు మరో నాలుగైదు రోజుల్లో పూర్తిస్ధాయిలో డీఏపీ అందుబాటులోకి వస్తుంది.