ఎరువుల భారం

ABN , First Publish Date - 2022-08-25T05:53:41+05:30 IST

సమృద్ధిగా సాగునీరుతో సంబురపడ్డ రైతులకు అతివృష్టి, అతలాకూతలం చేయడంతో ఆలస్యంగా వానాకాలం సాగు మొదలైంది.

ఎరువుల భారం

- పకృతి వైపరీత్యాలకు తోడు పెరిగిన ఎరువుల ధరలు

- ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రూ. 11.39 కోట్ల అదనపు భారం 

 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సమృద్ధిగా సాగునీరుతో సంబురపడ్డ రైతులకు అతివృష్టి, అతలాకూతలం చేయడంతో ఆలస్యంగా వానాకాలం సాగు మొదలైంది. వరి నాట్లు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా  ఇంకా కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటల నష్టాన్ని చూసిన రైతులకు ఎరువుల ధరలు మరింత భారాన్ని నింపింది. అప్పులు చేసి ఎరువులు కొనుగోలు చేసినా పంటకు గిట్టుబాటు ధర వస్తుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ధరలు పెరుగుతుండడంతో రైతులు భారీగానే భారం మోయాల్సి వస్తుంది. జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 1.99 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు.  పంటల సాగుకు 14,242.11 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. ఇందులో యూరియా 9,138 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 761 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 4,161 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 79.65 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 100.96 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని సిద్ధం చేశారు. ఎరువుల ధరలు  తాజాగా కాంప్లెక్స్‌ ఎరువు బస్తాపై 150 రూపాయల నుంచి  300 రూపాయలు, డీఏపీ 150 రూపాయలు, పొటాష్‌పై 700 రూపాయల వరకు పెరిగింది. సరాసరిగా చూసుకుంటే రైతుకు బస్తాకు  200 రూపాయల వరకు పెరిగింది. దీనివల్ల జిల్లా రైతులపై  11.39 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనాలు వేశారు. పొటాష్‌ గత సంవత్సరం 900 రూపాయలు ఉండగా ఈ సారి 1700 రూపాయలు, డీఏపీ 1200 రూపాయల నుంచి 1,350 రూపాయల వరకు, 20:20 1,250 నుంచి 1490 రూపాయల వరకు, 10:26:26  1,260 రూపాయల నుంచి  1,570 రూపాయల వరకు, 15:15:15:09  1,150 రూపాయల నుంచి  1,450 రూపాయల వరకు, 16:20:00:13  1,175 రూపాయల నుంచి 1450 రూపాయల వరకు, ఎన్‌ఎస్‌పీ 475 రూపాయల నుంచి 640 రూపాయల వరకు, యూరియా మాత్రం 266 రూపాయలు గతేడాది ధరనే ఉంది. పెరిగిన ధరలకు తోడుగా కూలీల కొరతతో కూలీ డబ్బులు కూడా పెరిగిపోయాయి. గతేడాది  500 రూపాయల వరకు వచ్చిన కూలీలు ఇప్పుడు 750 నుంచి 800 రూపాయల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు ఎకరానికి 5,500 నుంచి 6,000 వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు. మరోవైపు విత్తనాలు వేసుకోకముందే పొలాలు దుక్కులు దున్నుకోవడానికి డీజిల్‌ ధరలు  పెరగడంతో ట్రాక్టర్‌ కిరాయిలు కూడా పెరిగాయి. అన్నదాతకు ఎరువుల భారంతో పాటు కూలీల కొరత కూడా మరింతభారాన్ని పెంచింది. 

- ఆదిలోనే వరదపాలు... 

అదునులో వర్షాలు పడుతున్నాయని జిల్లా రైతులు అనందపడ్డా, జూలైలో కురిసిన భారీ వర్షాలకు నష్టాన్నే చవిచూశారు. వరినాట్లు ఆలస్యం కాగా మొదట్లో వేసుకున్న నాట్లు కొట్టుకుపోయాయి. పత్తి మొలక దశలోనే కొట్టుకుపోగా పత్తి చేన్లలో ఇసుక మేటలు వేశాయి. జిల్లాలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి, కోనరావుపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్‌, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, చందుర్తి, రుద్రంగి, మండలాల్లో రైతులు నష్టాన్నే చవిచూశారు. జూలై చివరి వారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ సాగు జోరందుకుంది. 

-   2.43 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2.43 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో వరి 1,50,400 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 1,34,850 ఎకరాలు, పత్తి 80,900 ఎకరాలు లక్ష్యం కాగా 62,583 ఎకరాలు, కంది 5,020 ఎకరాలకుగాను 1300 ఎకరాలు, మొక్కజొన్న 3,940 ఎకరాలకు గాను 807 ఎకరాల్లో సాగు చేశారు. పెసర 52 ఎకరాల్లో వేశారు. ఈ సారి అయిల్‌పాంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో ఈ ఏడాది 1600 ఎకరాల్లో సాగు చేయడానికి అంచనాలు వేశారు. 800 ఎకరాలు వానాకాలం సీజన్‌లో సాగు చేస్తున్నారు. 


 

Updated Date - 2022-08-25T05:53:41+05:30 IST