Abn logo
Sep 25 2021 @ 23:29PM

పొటాష్‌పై విజిలెన్స్‌!

టెక్కలిలో ఎరువుల దుకాణాన్ని పరిశీలిస్తున్న అధికారులు

అనుమతి లేకుండా ఎరువుల విక్రయాలు

దర్యాప్తు చేపట్టిన అధికారులు

హోల్‌సేల్‌ డీలర్‌ లైసెన్స్‌ రద్దుకు చర్యలు

టెక్కలి, సెప్టెంబరు 25: అనుమతి లేకుండా సాగుతున్న పొటాష్‌ విక్రయాలపై విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించారు. వరిసాగుకు   పొట్ట దశలో పొటాష్‌(ఎంవోపీ) ఎరువులు అవసరం. ఓ హోల్‌సేల్‌ డీలర్‌ వ్యవసాయశాఖ అధికారుల అనుమతి లేకుండా 200 మెట్రిక్‌ టన్నుల పొటాష్‌ను విక్రయించాడు. దీనిని గుర్తించిన వ్యవసాయ శాఖ అధికారులు హోల్‌సేల్‌ డీలర్‌పై చర్యలకు ఉపక్రమించారు. రెండు రోజులుగా తనిఖీలు చేసి.. డీలర్‌ వద్ద స్టాక్‌ రిజిస్ట్రార్‌, సంబంధిత ఇన్‌వాయిస్‌లను సీజ్‌ చేసి జేడీ కార్యాలయానికి పంపించారు. ఈ మేరకు డీలర్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. టెక్కలికి చెందిన హోల్‌సేల్‌ డీలర్‌ తంగుడు విష్ణుమూర్తి మొజాయిక్‌ పొటాష్‌ ఎరువు కాకినాడ పోర్టు నుంచి ఇటీవల 200 మెట్రిక్‌ టన్నులు తెప్పించారు. దీనిని వ్యవసాయశాఖ అధికారులకు తెలియకుండా భామిని, కొత్తూరు, మెళియాపుట్టి, టెక్కలి, కోటబొమ్మాళి, నరసన్నపేట, సారవకోట తదితర మండలాలకు చెందిన ఎరువుల వ్యాపారులకు విక్రయించారు. టెక్కలిలోని తన దుకాణంలో 37 మెట్రిక్‌టన్నులు, వైశ్యరాజు గోవిందరాజులుకు మూడు మెట్రిక్‌టన్నులు, శ్రీనివాస ఫెర్టిలైజర్స్‌కు 10 మెట్రిక్‌టన్నులు విక్రయించారు. మిగిలిన 150 మెట్రిక్‌టన్నులు ఇతర మండలాల్లో హోల్‌సేలర్లకు అందజేశారు. తమకు తెలియకుండా పొటాష్‌ ఎరువులు మార్కెట్‌లోకి ఎలా వచ్చాయని వ్యవసాయశాఖ అధికారులు టెక్కలిలో హోల్‌సేల్‌ షాపు వద్ద ఆరా తీశారు. ఒక్కో డీలర్‌కు 30 మెట్రిక్‌ టన్నులు ఇచ్చామని.. ఇన్‌వాయిస్‌ ప్రకారం రూ.1020, రూ.1030 చొప్పున విక్రయించామని విష్ణుమూర్తి తెలిపారు. అప్పటికే జిల్లాలో 200 మెట్రిక్‌టన్నులు పొటాష్‌ విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ కమిషనర్‌ హనుమంతు అరుణకుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే డీలర్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని సూచించారు. ఈ మేరకు శనివారం విజిలెన్స్‌ విభాగానికి చెందిన స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, తహసీల్దార్‌ స్థాయి అధికారులు, మండల వ్యవసాయ శాఖ అధికారి హోల్‌సేలర్‌ వద్ద వివరాలు ఆరా తీశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేసిన పొటాష్‌ ఎరువుల విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు. ఒకటి, రెండు రోజుల్లో సబ్‌కలెక్టర్‌, వ్యవసాయశాఖ అధికారులు కలిపి ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో ఎరువుల విక్రయాలపై దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వ్యవసాయశాఖ జేడీ బీవీ తిరుమలరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. జిల్లాలో అనధికారికంగా సాగుతున్న పొటాష్‌ ఎరువుల విక్రయాలపై అధికారులతో కలిసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు.